KL Rahul News: తన సక్సెస్ మంత్రను పంచుకున్న రాహుల్.. ఆసీస్ లో రాణించాలంటే అవి తప్పనిసరని అంటున్న క్లాస్ బ్యాటర్
Ind Vs Aus Test Series: బ్రిస్బేన్ లో జరుగుతున్న మూడో టెస్టు పేలవమైన డ్రా దిశగా సాగుతోంది. మ్యాచ్ కు పలుమార్లు అంతరాయం కలగడంతో నాలుగు రోజులు గడిచినా, ఇప్పటికీ రెండు జట్ల తొలి ఇన్నింగ్స్ పూర్తి కాలేదు.
Brisbane Test: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత టాపార్డర్ బ్యాటర్లు అంతంతమాత్రంగానే రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బ్రిస్బేన్ లో జరిగిన మూడో టెస్టులో మాత్రం భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం అభిమానుల మనసు దోచుకున్నాడు. 84 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంతే కాకుండా, ఈ సిరీస్ లో ఇప్పటివరకు అత్యధిక బంతులు ఎదుర్కొన్న బ్యాటర్ గానూ ఘనత వహించాడు. ఒకవైపేమో భారత బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకునేందుకు ఆపసోపాలు పడుతుంటే తను మాత్రం.. ఇరుజట్లలోనూ కలిపి అత్యధిక బంతులు ఎదుర్కొని వారెవా అనిపిస్తున్నాడు. తాజాగా ఆసీస్ లో తన సక్సెస్ మంత్రను రాహుల్ బయటపెట్టాడు.
ఆ సమయమే కీలకం..
ఆసీస్ లాంటి పేస్, బౌన్స్ ఉన్న పిచ్ లపై ఓపిక, సహనం ఎక్కువగా ఉండాలని రాహుల్ సూచించాడు. తొలి 15 ఓవర్లపాటు జాగ్రత్తగా ఆడితే తర్వాత పరుగులు వాటంతట అవే వస్తాయని తెలిపాడు. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ బంతులను ఆడటంలో కాస్త నైపుణ్యం ప్రదర్శించల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఇక సాలిడ్ డిఫెన్స్ ఆవశ్యకతను వివరించాడు. సేనా దేశాల్లో రాహుల్ కు మంచి రికార్డు ఉంది. సెనా అన్ని దేశాల్లో సెంచరీలు చేసిన ఘనత తన సొంతం. నిజానికి ఈ సిరీస్ ప్రారంభానికి ముందు తనను ఓపెనర్ గా పరిగణించలేదు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. మ్యాచ్ కు దూరమవడంతో తాత్కాలిక ఓపెనర్ గా జట్టులోకి వచ్చాడు. అయితే పెర్త్ లో జరిగిన టెస్టులో తన క్లాస్ ఆటతీరుతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. దీంతో రెండోటెస్టుకు అందుబాటులోకి వచ్చిన రోహిత తన స్థానాన్ని మార్చుకుని, ఆరో ప్లేస్ లో బ్యాటింగ్ కు వస్తున్నాడు.
వేదికను బట్టి ప్రణాళిక..
ఇక తన ఆటతీరును వేదికను బట్టి మార్చుకుంటానని రాహుల్ పేర్కొన్నాడు. పెర్త్, బ్రిస్బేన్ లో ఒకే తరహా పరిస్థితులు ఉంటాయి, కాబట్టి అందుకు తగిన విధంగా తన బ్యాటింగ్ చేసినట్లు పేర్కొన్నాడు. ఇక అడిలైడ్ తొలి ఇన్నింగ్స్ లో మార్నస్ లబుషేన్, నేథన్ మెక్ స్వినీ జంట తొలి 15 ఓవర్లపాటు జాగ్రత్తగా ఆడి, పాఠాలు నేర్పారని, అందులో నుంచి నేర్చుకున్నట్లు తెలిపాడు. ఇక అజేయంగా 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఫాలో ఆన్ గండాన్ని దాటించిన భారత టెయిలెండర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ లపై ప్రశంసలు కురింపించాడు. జట్టు ఫాలో ఆన్ తప్పించుకోవడం ఆనందంగా ఉందని, లోయర్ ఆర్డర్లో బౌలర్లు ఆ విధంగా బ్యాటింగ్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.
టెయిలెండర్లు కూడా బ్యాటింగ్ చేసేలా జట్టు మేనేజ్మెంట్ ప్రణాళికలు రచించిందని, అవిప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నాడు. ఇక బ్రిస్బేన్ టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సరికి 252/9తో భారత్ నిలిచింది. ప్రత్యర్థి కంటే 193 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 445 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ కు బుధవారం ఆఖరి రోజు.. వర్షం కూడా అంతరాయం కలిగించే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్ డ్రా కావడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: Social Media Fire: మూడో టెస్టులో సంబరాలెందుకు ? గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్