Rohit Vs Gambhir: రోహిత్, గంభీర్ మధ్య విబేధాలు!! టీమ్ సెలెక్షన్ రాంగ్- భారత జట్టుపై మాజీ క్రికెటర్ విశ్లేషణ
Brisbane Test: బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స లో రాహుల్, జడేజా రాణించడంతోపాటు బుమ్రా, ఆకాశ్ దీప్ చెరో చేయి వేయడంతో భారత్.. ఫాలో ఆన్ తప్పించుకుంది.
BGT Series Indian coach Gautam Gambhir: భారత కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంపై ఇప్పటికే అభిమానుల్లో అసంతృప్తి ఉంది. ఇప్పటికే అది సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో బహిర్గతమవుతోంది. అంతకుముందు తొలి టెస్టులో 140 పరుగులకు ఆలౌటైన దశలో.. అద్భుతంగా పుంజుకుని భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. ఇక రెండోటెస్టులో సారథ్యాన్ని చేతిలోకి తీసుకున్న రోహిత్.. అందులో ఓడిపోగా, మూడో టెస్టులోనూ తను తప్పిదాలు చేశాడని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా టీమ్ ఫైనల్ సెలెక్షన్, టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం, జడేజాను జట్టులోకి తీసుకోవడం లాంటి వాటిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పాకిస్థాన్ మాజీ ప్లేయర్ బాసిత్ అలీ స్పందించాడు.
కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ మధ్య విబేధాలు..
నిజానికి లంకతో వన్డే సిరీస్ జరిగినప్పటి నుంచి భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్, రోహిత్ మధ్య సరైన రాపో కనిపించడం లేదని బాసిత్ అలీ విశ్లేషించాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్, ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో ఇద్దరి మధ్య అవగాహనా రాహిత్యం కనిపిస్తోందని, అది బేధాభిప్రాయం రూపంలో ఉండవచ్చునని అభిప్రాయ పడ్డాడు. ఇక టీమిండియా ఫైనల్ సెలెక్షన్ తప్పుల తడకగా ఉందని విమర్శించాడు. ఇప్పటివరకు ఆసీస్ తో జరిగిన మూడు టెస్టుల్లో మ్యాచ్ కొక స్పిన్నర్ ను ఆడించారని, ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్లో ముగ్గురు లెఫ్టాండర్లు ఉన్న నేపథ్యంలో ఆఫ్ స్పిన్నర్ గా వాషింగ్టన్ సుందర్ లేదా రవిచంద్రన్ అశ్విన్ ను తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయ పడ్డాడు. ఇక టాస్ విషయంలోనూ రోహిత్ తప్పు చేశాడని, బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్ పై ముందుగా బ్యాటింగ్ తీసుకుని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాడు.
Also Read: Virat Kohli: కోహ్లీని మందలించిన గవాస్కర్.. ఆ బలహీనత అధిగమించాలంటూ క్లాస్
బుమ్రాపై అధికంగా ఆధారపడుతున్నారు..
ఇక టీమిండియా బౌలింగ్ లో బుమ్రాపై అధికంగా ఆధారపడుతోందని బాసిత్ అలీ వ్యాఖ్యానించాడు. తనకు సపోర్టుగా నిలిచే పేసర్లు కరువయ్యారని పేర్కొన్నాడు. మరోవైపు జట్టులో లెఫ్టార్మ్ పేసర్ లేని లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ను ఎదుర్కోవాలంటే లెఫ్టార్మ్ పేసర్ అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. షాహిన్ షా ఆఫ్రిది, మీర్ హమ్జాలను హెడ్ లాంటి వారి కోసం తురుపుముక్కగా ఉపయోగిస్తామని వెల్లడించాడు. మరోవైపు జడేజా బౌలింగ్ లోరాణించకపోయినా, బ్యాట్ తో సత్తాచాటాడు. 77 పరుగులతో రాణించి, జట్టు ఫాలో ఆన్ తప్పించుకోవడంలో కీలక భూమిక పోషించాడు.
ఇక మూడో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 445 పరుగులు చేయగా, భారత్ 9 వికెట్లకు 252 పరుగులు చేసింది. ప్రత్యర్తి కంటే ఇంకా 193 పరుగుల వెనుకంజలో ఉంది. ఆటలో ఇంకా ఒక్కరోజు మిగిలి ఉంది. అయితే బుధవారం కూడా వరణుడి ముప్పు పొంచి ఉండటంతో ఈ మ్యాచ్ డ్రా కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
Also Read: Social Media Fire: మూడో టెస్టులో సంబరాలెందుకు ? గంభీర్ హయాంలో పతనావస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్