T20 World Cup: మినీ వార్‌కు ఆయుధాలతో , భారత సేన సిద్ధం
T20 World Cup: ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించడం ఐపీఎల్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అలరించిన ఆటగాళ్లు అదే ఊపులో టీ 20 ప్రపంచకప్‌లో ఆడనుండడం... టీమిండియాకు కలసి రానుంది.
T20 World Cup Tournament From Today: వన్డే ప్రపంచకప్(ODI World Cup)లో తుది మెట్టుపై బోల్తా పడ్డ టీమిండియా(Team India)..పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. ఐపీఎల్(IPL) ముగిసిన తర్వాత అమెరికా(USA)లో కాలుమోపిన రోహిత్ సేన వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్(Bangladesh)ను 60 పరుగుల తేడాతో చిత్తు చేసి ఆత్మ విశ్వాసాన్ని పెంచుకుంది. ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్‌లలో చెమటోడుస్తున్న భారత జట్టు ఆటగాళ్లు తొలి సమరానికి సిద్ధమవుతున్నారు.
ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు మరో సారి సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. టీ 20 ప్రపంచకప్ నెంబర్ వన్ ప్లేయర్ సూర్య(Surya), రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుని.. సూపర్ ఫామ్‌లో ఉన్న పంత్(Panth)పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. చెమట చిందిస్తున్న ఆటగాళ్లు రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని భారత జట్టు మరో ప్రపంచకప్ సమరానికి సిద్ధమైంది. వన్డే వరల్డ్ కప్‌లో జట్టును అద్భుతంగా నడిపించి ఫైనల్‌కు చేర్చిన రోహిత్ శర్మ ఈసారి టీ 20 ప్రపంచకప్‌లో జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో జట్టును చివరి వరకూ సమర్థంగా నడిపించిన హిట్ మ్యాన్‌టీ 20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని కెప్టెన్‌గా తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని తహతహలాడుతున్నాడు. అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అగ్రరాజ్యంలో కాలు మోపిన టీమిండియా ఆటగాళ్లు... ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. గంటల కొద్దీ ప్రాక్టీస్ చేస్తూ లోపాలను సవరించుకుంటూ కొత్త షాట్లను కూడా ప్రయత్నిస్తున్నారు.
ప్రాక్టీస్ మ్యాచ్‌లో సత్తా
ఇప్పటికే బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించడం భారత జట్టు ఆత్మ విశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. బంగ్లాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో రోహిత్ సేన.... విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అనేక సమస్యలకు టీమిండియా చెక్ పెట్టింది. రిషభ్ పంత్ అర్ధ శతకంతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో 53 పరుగులు చేసిన పంత్.. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కూడా కొట్టి తాను మంచి ఫామ్‌లో ఉన్నానని చాటి చెప్పాడు. హార్దిక్ పాండ్యా కూడా 23 బంతుల్లో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి భారత్ 182 పరుగులు చేసింది. అనంతరం భారత బౌలర్లు విజృంభించడంతో బంగ్లా కేవలం 122 పరుగులకే పరిమితమైంది. అర్ష్‌దీప్ పవర్ ప్లేలోనే రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు.
గేమ్ ఛేంజర్ అతనే
ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించడం ఐపీఎల్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అలరించిన ఆటగాళ్లు అదే ఊపులో టీ 20 ప్రపంచకప్‌లో ఆడనుండడం... టీమిండియాకు కలసి రానుంది. రోహిత్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ..పంత్, సంజు శాంసన్, పాండ్యా సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజాలతో బ్యాటింగ్ లైనప్ ప్రత్యర్థి జట్లకు భయం పుట్టించేలా ఉంది. బుమ్రా సారథ్యంలో సిరాజ్, అర్ష్‌దీప్‌లతో కూడిన పేస్ విభాగం.. కుల్దీప్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లతో కూడిన స్పిన్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో బుమ్రానే గేమ్ ఛేంజర్ అవుతాడని మాజీలు బలంగా నమ్ముతున్నారు. టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా గేమ్‌చేంజర్‌గా మారతాడని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ జోస్యం చెప్పాడు. భారత జట్టు చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉందని మంచి ప్రదర్శన చేస్తుందని కైఫ్ అన్నాడు. న్యూయార్క్‌లో భారత జట్టు పెద్దగా క్రికెట్ ఆడలేదు కాబట్టి ఈ పిచ్‌లపై భారత్ ఎలా ఆడుతుందో చూడాలని కైఫ్ అన్నాడు.