T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు క్వాలిఫై అయిన చివరి జట్టు ఇదే, ఈసారి బరిలోకి 20 జట్లు
T20 World Cup Qualify Teams | ఐసిసి టి20 ప్రపంచ కప్ 2007లో ప్రారంభం కాగా, తొలి సీజన్ విజేతగా నిలిచిన భారత్.. గత ఏడాది జరిగిన వరల్డ్ కప్‌లోనూ టైటిల్ సాధించింది.

T20 World Cup 2026 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) గురువారం నాడు ఇక్కడ జరిగిన చివరి ఆసియా EAP క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో జపాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం క్వాలిఫై అయిన 20వ, చివరి జట్టుగా నిలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన జపాన్ జట్టు 9 వికెట్లకు 116 పరుగులు మాత్రమే చేసింది. UAE కేవలం 12.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఒమన్ లో జరిగిన ఆసియా-తూర్పు ఆసియా- పసిఫిక్ క్వాలిఫైయర్‌లో టాప్ 3లో చోటు దక్కించుకోవడం ద్వారా UAE జట్టు టీ20 ప్రపంచ కప్ ఆడేందుకు క్వాలిఫై అయ్యింది.
బుధవారం నాడు తమ స్థానాన్ని ఖాయం చేసుకున్న నేపాల్, ఒమన్‌తో కలిసి గ్లోబల్ టోర్నమెంట్ కోసం 20 జట్ల తుది జాబితా యూఏఈ చేరికతో పూర్తి చేసింది. T20 ప్రపంచ కప్ ఆడేందుకు క్వాలిఫై అయిన 20 జట్లు భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే, నేపాల్, ఒమన్, UAE, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా, కెనడా.
సూపర్ 8 చేరడంతో నేరుగా అర్హత
ఆస్ట్రేలియా, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్ గత ప్రపంచ కప్‌లో సూపర్-8 కు చేరడంతో తదుపరి ఎడిషన్ కోసం క్వాలిఫై అయ్యాయి. అదే సమయంలో పాకిస్తాన్, ఐర్లాండ్, న్యూజిలాండ్ జట్లు తమ ర్యాంకింగ్ ఆధారంగా తమ స్థానాలను ఖాయం చేసుకున్నాయి. అమెరికా క్వాలిఫయర్ నుండి కెనడా, యూరప్ క్వాలిఫైయర్ నుంచి ఇటలీ, నెదర్లాండ్స్ స్థానం దక్కించుకున్నాయి. వీటితో పాటు ఆఫ్రికా క్వాలిఫైయర్ నుంచి నమీబియా, జింబాబ్వే క్వాలిఫై అయ్యాయి. మరోవైపు ఆతిథ్య దేశాలుగా భారత్, శ్రీలంక జట్లు వచ్చే వరల్డ్ కప్ ఆడేందుకు అర్హత సాధించాయి.
తొలి, చివరి వరల్డ్ కప్ మనవే..
ICC T20 ప్రపంచ కప్ 2007లో ప్రారంభం కాగా.. తొలి కప్ భారత్ నెగ్గింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద విజయం సాధించి భారత్ తొలి టీ20 వరల్డ్ కప్ నెగ్గడాన్ని క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మరిచిపోరు. టీ20 వరల్డ్ కప్ గత ఎడిషన్ విజేత భారత్. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి దాదాపు 17 ఏళ్ల తరువాత టీమిండియా విజేతగా నిలిచింది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి భారత్ బరిలోకి దిగుతుంది.




















