T20 World Cup 2024: నసావు పిచ్‌పైనే భారత్ , పాక్ మ్యాచ్ - తేడా వస్తే రద్దు అవుతుందా, ఐసీసీ ఏం చెబుతోంది!
Nassau County pitch: రానున్న భారత్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ అభిమానులను బెంబేలెత్తిస్తోంది. మ్యాచ్ జరగనున్న నసావు పిచ్‌పై బ్యాటింగ్, బౌలింగ్‌కు మధ్య బ్యాలెన్స్ లేకపోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
India Vs Pak Match Updates: టీ20 వరల్డ్ కప్-2024(T20 World Cup)లో భారత్(Team India) అద్భుతంగా ప్రారంభించింది. న్యూయార్క్ నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి తొలివిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక తరువాత గ్రూప్-ఏలో భాగంగా భారత్ తన తదుపరి మ్యాచ్‌ను ఆదివారంనాడు పాకిస్థాన్‌తో ఆడనుంది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ వేదిక మార్చాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే జూన్ 9న జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వివాదాస్పద నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియమే ఆతిథ్యం ఇవ్వనుంది.
మండిపడుతున్న మాజీలు
టీ 20 ప్రపంచకప్ మెగా టోర్నీల్లో వాడుతున్న ఈ డ్రాప్ ఇన్ పిచ్ (Drop In Potch )ఆటగాళ్ళను ఇబ్బందులు పెడుతోంది. పిచ్‌పై అస్థిరమైన బౌన్స్ కనపడుతుండటంతో బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. పిచ్‌పై బ్యాటింగ్, బౌలింగ్‌కు మధ్య బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం, సెకండ్ బ్యాటింగ్ చేసేవారికి ఎక్కువ సానుకూలత ఉండడంపై క్రికెట్ నిపుణుల నుంచి ఫ్యాన్స్ వరకు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు ఐర్లాండ్(Ireland)తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్(Rohit Sharma) రిటైర్ హర్ట్‌గా వెనుదిరగడానికి కారణం కూడా ఈ పిచ్చే. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్ చాలా పేలవంగా కనిపించిందని చెబుతున్నారు. ఇలాంటి పిచ్‌పై బ్యాటింగ్ చేయడం ఆటగాళ్లకు పెద్ద సవాల్ అని , ప్రపంచకప్‌లాంటి పెద్ద టోర్నీల్లో ఇలాంటి నాసిరకం పిచ్ ఏర్పాటు చేయడంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మండిపడ్డారు. అమెరికన్ ప్రేక్షకులను టెస్ట్ క్రికెట్‌కు అలవాటు చేయాలని ఇలాంటి పిచ్ హడావిడిగా తయారు చేసి ఉంటారని టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఎద్దేవా చేశాడు. న్యూయార్ పిచ్ ఒక మంత్రగత్తెలా ఉందని నవజ్యోత్ సిద్ధూ విమర్శించారు. ఇర్ఫాన్ పఠాన్ కూడా పిచ్ పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇక ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే అయితే ఇలాంటి పిచ్ పై భారత్-పాక్ మ్యాచ్‌ను ఊహించుకోవడం కష్టం అన్నాడు.
నసావు పిచ్ పై ఐసీసీ ఏమందంటే ?
అటు ఆటగాళ్ళు, ఇటు అభిమానులు తీవ్రంగా ఆరోపణలు చేస్తుండటంతో నసావు పిచ్‌పై ఐసీసీ స్పందించింది. నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు ఉపయోగించిన పిచ్‌లపై ఎక్కువ మ్యాచ్ లు ఆడకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నామంది. అయినా భారత్ vs ఐర్లాండ్ మ్యాచ్ తరువాత నుంచి ప్రపంచ స్థాయి గ్రౌండ్స్ బృందాలు పరిస్థితిని సరిదిద్ది, ఈ వేదికను సరైన పిచ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నాయని వెల్లడించింది.