Shaun Marsh : క్రికెట్‌కు షాన్ మార్ష్ గుడ్ బై , 23 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు
Shaun Marsh: ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్లు ఒక్కొక్కరిగా ఆటకు వీడ్కోలు పలుకుతున్నారు. డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ ఇప్పటికే వీడ్కోలు పలకగా... తాజాగా షాన్ మార్ష్ కూడా అదే బయట పట్టాడు.
ఆస్ట్రేలియా(Austrelia)లో సీనియర్ క్రికెటర్లు ఒక్కొక్కరిగా ఆటకు వీడ్కోలు పలుకుతున్నారు. డేవిడ్ వార్నర్(David Warner), అరోన్ ఫించ్ ఇప్పటికే వీడ్కోలు పలకగా... తాజాగా విధ్వంసకర ఆటగాడు షాన్ మార్ష్(Shaun Marsh) కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పవర్ హిట్టర్‌గా పేరొందిన మార్ష్ బిగ్‌బాష్ లీగ్(Big Bash League)కు గుడ్ బై చెప్పాడు. దాంతో, ఈ స్టార్ ఆటగాడి 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు తెరపడింది. 17 ఏళ్ల వయసులో జట్టులోకి వచ్చిన మార్ష్ 40 ఏళ్ల వయసులో ఆటకు వీడ్కోలు పలికాడు. మార్ష్ ఆసీస్ తరఫున 38 టెస్టులు, 73 వన్డేలు, 15 టీ2లు ఆడాడు. టెస్టుల్లో 2,265 రన్స్, వన్డేల్లో 2,773 పరుగులు చేశాడు. టీ20ల్లో 255 రన్స్ కొట్టాడు. బిగ్‌బాష్ లీగ్ 2023-24 సీజన్‌లో మార్ష్ ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 45.25 సగటుతో రాణించిన అతడు మూడు హాఫ్ సెంచరీలతో 181 రన్స్ కొట్టాడు. ఐపీఎల్‌లోనూ మార్ష్ సత్తా చాటాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కింగ్స్ లెవన్ పంజాబ్ తరఫున ఆడిన మార్ష్ 616 రన్స్ బాదాడు. దాంతో, జాతీయ జట్టుకు ఎంపికై వన్డేలు, టీ20ల్లో అరంగేట్రం చేశాడు.
వార్నర్ కూడా...
ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) టెస్టులకు వీడ్కోలు పలికాడు. పాకిస్తాన్‌తో మూడో టెస్టు అనంతరం సుదీర్ఘ ఫార్మట్ నుంచి డేవిడ్ భాయ్ తప్పుకొన్నాడు. నాలుగో రోజు ఆట సందర్భంగా వార్నర్ బ్యాటింగ్ కు వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డేవిడ్ భాయ్ వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించేశాడు. భారత్‌పై వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) గెలిచిన మధుర క్షణాలే తన వన్డే కెరీర్‌కు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నట్లు వార్నర్ తెలిపాడు. ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన వార్నర్ టెస్ట్, వన్డే ఫార్మట్లకు వీడ్కోలు పలికాడు. కంగారు జట్టుకు ఒంటి చేత్తో మరపురాని విజయాలు అందించిన డేవిడ్ భాయ్.... కెరీర్‌ను ముగించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి వికెట్ల ముందు గోడ కట్టి... ప్రతికూల పరిస్థితుల్లో కంగారు జట్టుకు ఎన్నోసార్లు అద్భుత ప్రారంభాలను వార్నర్ అందించాడు. టెస్టు, వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్.. టీ20ల్లో మాత్రమే ఆడనున్నాడు.
క్లాసెన్ కూడా
దక్షిణాఫ్రికా(South African ) విధ్వంసకర ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klaasen) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్(Test Cricket) నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి క్రికెట్ అభిమానులను షాక్‌గు గురిచేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని క్లాసెన్ తెలిపాడు. టెస్ట్ కెరీర్‌కు వీడ్కోలు పలికే విషయమై ఆలోచిస్తూ పలు నిద్ర లేని రాత్రులు గడిపానని, తన నిర్ణయం సరైందా కాదా అని చాలా మదన పడ్డానని, అంతిమంగా టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నానని క్లాసెన్ వెల్లడించాడు. మొత్తానికి తాను తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైందని, తన ఫేవరెట్ ఫార్మాట్ నుంచి అర్ధంతరంగా తప్పుకుంటున్నందుకు చాలా బాధగా ఉందని తెలిపాడు.