Sanju Samson: నా కొడుకుపై కుట్ర చేశారు - మిగతా ప్లేయర్లతో సమానంగా చూడట్లేదు, సంజూ తండ్రి సంచలన ఆరోపణలు
Sanju Father: కేసీఏలోని కొంతమంది పెద్దలు తన కొడుకుపై కుట్ర చేశారని విశ్వనాథ్ పేర్కొన్నాడు. రాహుల్, రిషభ్ పంత్‌ల నుంచి గట్టి పోటీ ఎదురైందని.. వాళ్లిద్దరినే చేర్చుకుని, సంజూను పక్కనపెట్టారన్నారు.

ICC Champions Trophy News: ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఎంపికవ్వని సంగతి తెలిసిందే. వన్డే ఫార్మాట్లో ఇప్పటికే చాలామంది ప్లేయర్లు ఉన్న కారణంగా కొత్త వారిని తీసుకోలేదని సెలెక్టర్లు చెబుతుండగా, కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) వ్యవహార ధోరణి కారణంగానే తన కుమారుడు ఐసీసీ టోర్నీలో ఆడే అవకాశం కోల్పొయ్యాడని సంజూ తండ్రి విశ్వనాథ్ పేర్కొంటున్నాడు. తన కుమారునిపై కొందరు కుట్ర చేశారని, అందుకే అతను కనీసం కేరళ జట్టుకు కూడా ఆడలేకపోతున్నాడని విమర్శించాడు. ఇప్పటివరకు ఏం జరిగినా పన్నెత్తి మాట్లాడలేదని, అయితే ఈసారి మాత్రం చాలా బాధ కలుగుతుందని, ఈ విషయాన్ని తాడో పేడో తేల్చుకుంటానని పేర్కొన్నాడు. ప్రస్తుతం సంజూ.. ఇంగ్లాండ్‌తో తొలి టీ20 కోసం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.
సంజూకో రూల్.. ఇతరులకో రూలా..?
కేసీఏ ఏర్పాటు చేసిన క్యాంపుల్లో పాల్గొనలేదని సంజూపై వేటు వేసిన పెద్దలు, మిగతా ఆటగాళ్ల విషయంలో ఈ పని ఎందుకు చేయలేదని విశ్వనాథ్ పేర్కొన్నాడు. సంజూకో రూల్, ఇతర ఆటగాళ్లకో రూలా అని ప్రశ్నించాడు. కేసీఏ ప్రెసిండెంట్ జయేశ్ జార్జి, సెక్రటరీల గురించి తాను మాట్లాడటం లేదని, అయితే కేసీఏలోని కొంతమంది పెద్దలు ఈ విషయంలో కుట్ర చేశారని పేర్కొన్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన సంజూకు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌ల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. దీంతో స్క్వాడ్‌లో వాళ్లిద్దరినే చేర్చుకుని, సంజూను పక్కనపెట్టారు. నిజానికి గత పదేళ్లుగా వన్డేల్లో అడపాదడపా ఆడుతున్న సంజూకు మంచి రికార్డే ఉంది. 16 వన్డేల్లో 516 పరుగులు చేసిన సంజూ.. ఒక సెంచరీ, మూడు ఫిఫ్టీలు బాదాడు. 56కి పైగా సగటు, 99కిపైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. తాజాగా సంజూని పక్కన పెట్టడంపై దిగ్గజ క్రికెటర్, లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ విచారం వ్యక్తం చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లోనే సంజూకు మొండిచేయి ఎదురైందని వ్యాఖ్యానించాడు. జట్టులో 15 మందికే స్థానం ఉంటుందని గుర్తు చేశాడు.
సంజూ కంటే మెరుగైన బ్యాటర్ అని..
ముఖ్యంగా పంత్‌తోనే సంజూకు పోటీ ఎదురైందని, అయితే నిమిషాల్లో ఆటను మార్చే సామర్థ్యం పంత్‌కు సాధ్యమని, అందుకే అతడికే సెలెక్టర్లు ఓటేశారని గావస్కర్ తెలిపాడు. నిజానికి పంత్ కంటే సంజూ మంచి బ్యాటరని, అయితే వికెట్ కీపింగ్‌తో పాటు దూకుడైన ఆటతీరుతో పంత్ సెలెక్టర్ల మనసు దోచాడని చెప్పుకొచ్చాడు. అయినా జాతీయ జట్టులోకి ఎంపిక కానందుకు సంజూ ఫీల్ కావాల్సిన అవసరం లేదని, దేశ ప్రజలంతా తన ఆటతీరును ఎప్పటీకీ స్మరించుకుంటారని తెలిపాడు. ఆటలో ఇవన్నీ సహజమని, ముందుకు వెళ్లాలని ఏదో ఒకరోజు ఫలితముంటుందని బెస్టాఫ్ లక్ చెప్పాడు. టీ20 జట్టులో రెగ్యులర్ ఓపెనర్‌గా ఉన్న సంజూకి, అటు టెస్టులు, ఇటు వన్డేల్లో స్థానం దక్కడం లేదు. అయితే ఇటీవల పొట్టి ఫార్మాట్‌లో తను సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు. మరోవైపు తాము ఏర్పాటు చేసే క్యాంపులకు హాజరవుతేనే, రాష్ట్ర జట్టులో చోటు కల్పిస్తామని కేసీఏ ప్రెసిడెంట్ జయేశ్ జార్జి తెలిపారు.




















