Mohammed Azharuddin: తెలంగాణ మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్- మైనార్టీ సంక్షేమం లేదా క్రీడా శాఖ కేటాయించే ఛాన్స్!
Mohammed Azharuddin: టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేశారు. తెలంగాణ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్, సీఎంతోపాటు పలువురు మంత్రులు నాయకులు పాల్గొన్నారు.

Mohammed Azharuddin: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మహ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అజారుద్దీన్ కృతజ్ఞత తెలియజేశారు. సహచర మంత్రులు, నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
అజారుద్దీన్ రాకతో తెలంగాణ కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 15కు చేరింది. ఆయనకు ఏ శాఖలు కేటాయిస్తారనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతానికి చాలా శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. మైనార్టీ సంక్షేమం, విద్యా, హోంశాఖ అన్నీ కూడా రేవంత్ తన వద్దే ఉంచుకున్నారు. ఇందులో ఏ శాఖను ఆయనకు ఇస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే మైనార్టీ సంక్షేమ శాఖ లేదా క్రీడా శాఖ ఇస్తారని ప్రచారం నడుస్తోంది.
1963 ఫిబ్రవరి 8న అజారుద్దీన్ హైదరాబాద్‌లో జన్మించారు. అబిడ్స్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్య, నిజాం కాలేజీలో బీకాం పూర్తి చేశారు. 1984లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టి ప్రత్యేకమైన స్టైల్‌తో గుర్తింపు తెచ్చారు. అరంగేట్రం చేసిన తొలి మూడు టెస్టుల్లోనే సెంచరీలతో అప్పట్లో రికార్టుల మోత మోగించారు. అరంగేట్రం చేసిన ఐదేళ్లకే టెస్టు కెప్టెన్ అయ్యారు. 16 ఏళ్లపాటు క్రికెట్ ఆడిన అజారుద్దీన్ అద్భుతమైన విజయాలు సొంతం చేసుకున్నారు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు.
2009లో కాంగ్రెస్ పార్టీలో చేరిన అజారుద్దీన్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత తెలంగాణలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ మధ్య ఆయన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా మండలికి పంపించింది. ఇప్పుడు మంత్రి పదవితో గుర్తింపు తీసుకొచ్చింది.





















