Sachin Tendulkar: అది స్టేడియం కాదు నా రెండో ఇల్లు, సచిన్ భావోద్వేగం
Wankhede Stadium: వాంఖడే స్టేడియం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Sachin Tendulkar turns nostalgic as Wankhede Stadium turns 50: మహారాష్ట్ర ముంబై(Mumbai)లోని చరిత్రాత్మక వాంఖడే స్టేడియం(Wankhede Stadium) 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. అర్ధ శతాబ్దం పాటు ఎందరో క్రీడాకారులను భారత క్రికెట్‌కు అందించింది. అందులో సచిన్, కాంబ్లీ సహా ఎందరో దిగ్గజాలు ఉన్నారు. వాంఖడే స్టేడియం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాంఖడే స్టేడియం మార్చి 10తో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో రంజీ ట్రోఫీ ఫైనల్ చేరిన ముంబై, విదర్భ కెప్టెన్లు అజింక్యా రహానే, అక్షయ్ వాడ్కర్‌లకు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక జ్ఞాపికను అందించింది.
1973లో వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడిన మాజీ క్రికెటర్లను కూడా ఈ సందర్భంగా సత్కరించారు. ఈ సందర్భంగా సచిన్ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. పదేళ్ల బాలుడిగా ఉన్నప్పుడు వాంఖడే స్టేడియాన్ని మొదటిసారి చూశానని సచిన్ ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు. ఐదేళ్ల తర్వాత ఇదే స్టేడియంలో తన కేరీర్ ప్రారంభిస్తానని అనుకోలేదు. ఆ తర్వాత 15 ఏళ్ల సమయంలో ఇదే స్టేడియంలో ముంబై తరఫున మొదటిసారి గుజరాత్‌పై ఆడాను. 2011లో ఇదే స్టేడియంలో వరల్డ్ కప్ ఆడి గెలవడం తన జీవితంలో మరిచిపోలేని క్షణాలని సచిన్ అన్నాడు. ఇక్కడే 200వ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం కూడా వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. అందుకే వాంఖడే తనకు స్టేడియం మాత్రమే కాదని... రెండో ఇల్లు కూడా అని సచిన్ భావోద్వేగానికి గురయ్యాడు.
వాంఖడేలో విగ్రహం
అశేష అభిమానులను సంపాదించుకున్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. కోట్లాదిమంది క్రికెట్ అభిమానులకు దేవుడైన సచిన్ నిలువెత్తు విగ్రహం ఆవిష్కృతమైంది. సచిన్ చివరి మ్యాచ్ ఆడిన ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇప్పటికే స్టేడియంలో సచిన్ పేరిట ఉన్న స్టాండ్ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సచిన్ స్ట్రెయిట్ డ్రైవ్ షాట్ కొడుతున్న పోజులో ఉన్న ఈ విగ్రహం ఆకట్టుకుంటోంది. సచిన్ సమక్షంలోనే ఈ విగ్రహావిష్కరణ జరిగింది. యువ క్రికెటర్లకు స్ఫూర్తి నింపేందుకు... నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చేందుకు... సచిన్ నిలువెత్తు విగ్రహం కొలువుదీరింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన సచిన్ విగ్రహావిష్కరణతో మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. సచిన్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‍నాథ్ షిండే, ఎన్‍సీపీ చీఫ్, ఐసీసీ మాజీ ఆధ్యక్షుడు శరద్ పవార్, బీసీసీఐ సెక్రటరీ జైషా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఎంసీఏ అధ్యక్షుడు అమోల్ కాలే పాల్గొన్నారు. సచిన్ టెండూల్కర్ భార్య అంజలి, కూతురు సారా కూడా ఈ ప్రత్యేక కార్యక్రమానికి వచ్చారు.
సచిన్ హోమ్ గ్రౌండ్‍లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత శిల్పి ప్రమోద్ కాంబ్లే ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. ప్రపంచకప్‌లో గురువారం భారత్, శ్రీలంక జరుగనుండగా ఒకరోజు ముందే సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సచిన్ 50 ఏళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో వాంఖడే స్టేడియంలో అతడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.