Sachin Tendulkar: అమీర్! నువ్వే స్ఫూర్తి, సచిన్ భావోద్వేగం
Sachin Tendulkar: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తాను చెప్పినట్లుగానే జమ్మూకాశ్మీర్‌కు చెందిన పారా క్రికెటర్ అమీర్ హుస్సేన్ ను కలిశాడు.
![Sachin Tendulkar: అమీర్! నువ్వే స్ఫూర్తి, సచిన్ భావోద్వేగం Sachin Tendulkar Meets Para Cricketer Amir Hussain In Kashmir Sachin Tendulkar: అమీర్! నువ్వే స్ఫూర్తి, సచిన్ భావోద్వేగం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/25/dc096f79ccfb1e763a78843875e36a831708821273034872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sachin Met Armless Cricketer Amir And Gifts Bat: క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్, భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. జమ్ముకశ్మీర్‌కు చెందిన పారా క్రికెటర్ అమీర్ హుస్సేన్ ను కలిశాడు. రెండు చేతులు లేకపోయినా క్రికెట్ ఆడుతున్న అమీర్‌ను కలుస్తానని చెప్పిన సచిన్.. ఆ మాటను నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి కశ్మీర్ పర్యటనలో ఉన్న సచిన్ అమీర్ ఇంటికి వెళ్లాడు. అతడిని అభినందించిన అనంతరం తాను సంతకం చేసిన బ్యాట్‌ను అతడికి బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను స్వయంగా సచిన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రియల్ హీరో అమీర్‌ను కలవడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. అమీర్ నువ్వే స్ఫూర్తి అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.
జీవితమే ఓ ఆదర్శం
సాధారణంగా ఎంతో మంది యువకులు తమకు అదృష్టం లేదని జీవితంలో ఎంత పని చేసినా ఫలితాలు రావడం లేదని.. ఇక తమ జీవితం ఇంతే అని నిస్పృహకు లోనవుతూ ఉంటారు. అలాంటి వారందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచే ఓ క్రికెటర్ సాగించిన అద్భుత ప్రయాణమిది. గెలవాలన్న పట్టుదల సాధించాలన్న సంకల్పం తానేంటో నిరూపించుకోవాలన్న కసితో క్రికెటర్ అమీర్ హుస్సేన్ (Cricketer Aamir Hussain) సాగించిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తి మంత్రమైంది. మరెందరికో దిశా నిర్దేశం చేసింది. కష్టాలను ఎదిరించి.. కన్నీళ్లను దిగమింగి... ఆ క్రికెటర్ సాగించిన ప్రస్థానం. క్రికెట్ గాడ్ సచిన్(Sachin)ను కూడా విస్మయ పరిచింది.
కాలుతోనూ బౌలింగ్
క్రికెట్ ఆడాలంటే రెండు చేతులు కావాలి. బ్యాటింగ్ చేయాలన్నా.. బౌలింగ్ వేయాలన్నా చేతులు తప్పనిసరి. ఒక్క చేయి ఉన్నా కొంచెం కష్టంగా అయినా క్రికెట్ ఆడొచ్చు. మరి రెండు చేతులు లేకపోతే క్రికెట్ ఆడడం అసాధ్యమని అనుకుంటున్నారు కదూ కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు జమ్మకశ్మీర్‌కు చెందిన అమీర్ హుస్సేన్(Amir Hussain Lone). అతని సంకల్ప బలం ముందు విధి కూడా ఓడిపోయింది. అతని నిర్విరామ కృషి ముందు వైకల్యం మోకరిల్లింది. ఎనిమిదేళ్ల పసిప్రాయంలో విధి తన రెండు చేతులను తీసుకుపోయినా అతని సంకల్పం ముందు వైకల్యం కూడా చిన్నబోయింది.
కుంగిపోలేదు నిలబడ్డాడు ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రి మిల్లులో జరిగిన ప్రమాదంలో అమీర్ హుస్సేన్ రెండు చేతులూ కోల్పోయాడు. ఈ ప్రమాదంలో అమీర్ కుంగిపోలేదు. నిరాశతో ఆగిపోలేదు. ఇక తన జీవితం వ్యర్థమని నిస్పృహకు లోను కాలేదు. తనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన క్రికెట్‌ను సాధన చేశాడు. మెడ, భుజం సాయంతో బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేస్తున్నాడు. మంచి షాట్లు ఆడుతూ డిఫెన్స్ ఆడుతూ రాణించాడు. అంతేనా కుడి కాలి వేళ్ల మధ్య బంతిని ఇరికించుకుని, కాలిని తిప్పి బౌలింగ్ వేసి ఔరా అనిపిస్తున్నాడు. అతనిలో ప్రతిభను ఓ ఉపాధ్యాయుడు గుర్తించి ప్రోత్సహించడంతో అమీర్ పారా క్రికెట్లోకి వచ్చాడు. 2013 నుంచి అమీర్ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పుడు జమ్ముకశ్మీర్ పారా క్రికెట్ జట్టుకు 34 ఏళ్ల అమీరే కెప్టెన్. 2013, 2018లో జాతీయ టోర్నీలో ఆడాడు. బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ ప్రాతినిథ్యం వహించాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)