Rishabh Pant Career Best Rank: కెరీర్ బెస్ట్ ర్యాంకుకు రిషభ్ పంత్.. గిల్, డకెట్ కూడా ముందంజ.. తాజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
ఇంగ్లాండ్ పై ట్విన్ సెంచరీలతో పంత్ తడాఖా చూపించాడు. దీంతో తాజా ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో తను కెరీర్ బెస్టుకు చేరుకున్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ ఐదు వికెట్లతో పరాజయం పాలైంది.

ICC Latest Test Rankings : ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలతో అలరించిన భారత విధ్వంసక వికెట్ కీపర్ రిషభ్ పంత్ తాజా టెస్టు ర్యాంకింగ్స్ లో కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్ కు చేరుకున్నాడు. తాజాగా ప్రకంటించిన ర్యాంకింగ్స్ లో ఏడో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్ లో 127, 118 పరుగులతో పంత్ రాణించిన సంగతి తెలిసిందే. దీంతో ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన జింబాబ్వే దిగ్గజం ఆండీ ప్లవర్ రికార్డును సమం చేశాడు. అలాగే 800 పాయింట్లు దాటిన తొలి భారత వికెట్ కీపర్ గా కూడా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్ లో భారత్ పై ఐదు వికెట్లతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంతో స్టోక్స్ సేన నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఎడ్జ్ బాస్టన్ లో జూలై 2 నుంచి ప్రారంభమవుతుంది.
Rishabh Pant becomes the first-ever Indian wicketkeeper to reach 800 ICC Test rating points. #RishabhPant #India #Test #Cricket #Rating #Rankings #Record #Wicketkeeper #SportsinfoCricket pic.twitter.com/qiyGKrc8cS
— SportsInfo Cricket (@SportsInfo11983) June 25, 2025
20వ ప్లేసులో గిల్..
ఇక ఇదే టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 147 పరుగులు చేసిన భారత కెప్టెన్ శుభమాన్ గిల్ కూడా తాజా టెస్టు ర్యాంకింగ్స్ లో 20వ స్థానానికి చేరుకున్నాడు. టెస్టు కెప్టెన్ గా అరంగేట్రంలోనే సెంచరీ చేసిన అరుదైన భారత కెప్టెన్ల జాబితాలో తను చోటు సంపాదించుకున్నాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో సత్తా చాటిన భారత స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా.. బౌలర్ల ర్యాంకింగ్స్ లో తన నెం.1 ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు. ఇదే టెస్టు రెండో ఇన్నింగ్స్ లో అజేయ అర్ధ సెంచరీతో రాణించిన జో రూట్ టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో తన 66వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండో స్థానంలో ఇంగ్లాండ్ కే చెందిన హేరీ బ్రూక్ నిలిచాడు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో బెన్ స్టోక్స్ ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్ లో బ్యాట్ తో ఫర్వాలేదనిపించిన స్టోక్స్.. బౌలింగ్ లో ఆకట్టుకున్నాడు.
8వ స్థానానికి డకెట్..
ఇక తొలి టెస్టులో 149 పరుగుల భారీ సెంచరీ చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఏకంగా 8వ స్థానానికి ఎగబాకాడు. రెండో ఇన్నింగ్స్ లో 371 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కు జాక్ క్రాలీతో కలిసి అద్భుత భాగస్వామ్యాన్ని అందించాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 180పైచిలుకు పరుగులు జత చేయడంతో ఇంగ్లాండ్ గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. దీంతో ఇండియాపై రికార్డు స్థాయిలో రెండోసారి 370+ పరుగుల టార్గెట్ ను ఇంగ్లాండ్ ఛేదించింది. అలాగే ఐదుగురు బ్యాటర్లు సెంచరీలు చేసినా కూడా మ్యాచ్ ఓడిపోయిన చెత్త రికార్డును భారత్ మూటగట్టుకుంది. 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.




















