Ashwin About Retirement: రిటైర్మెంట్ ప్రకటనపై స్పందించిన అశ్విన్ - అలా జట్టులో చోటు దక్కించుకోవడం ఇష్టం లేదని వ్యాఖ్య
Ravichandra Ashwin: దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ తన రిటైర్మెంట్‌పై తాజాగా స్పందించాడు. తాను అనుకున్న విధంగా ప్రకటన చేసినట్లు తెలిపాడు. తన కెరీర్‌లో 106 టెస్టులాడిన అశ్విన్.. 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు.
Spin Legend Ashwin: భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు అనంతరం తను ఆటకు టాటా చెబుతున్నట్లు ప్రకటించాడు. అయితే ఉన్నట్లుండి ఇంత సడెన్‌గా అశ్విన్ ఎందుకు ప్రకటన చేశాడో ఎవరికీ అర్థం కాలేదు. బీసీసీఐ నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. టెస్టుల్లో 537 వికెట్లు తీసిన యాష్.. ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన అశ్విన్‌ను కనీసం ఫేర్ వెల్ టెస్టులోనైనా ఆడించాలని పలువురు డిమాండ్లు చేశారు. తాజాగా తన రిటైర్మెంట్, ఫేర్వెట్ టెస్టుపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా తన స్పందనను తెలియజేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరలైంది. అభిమానులు లైకులు, కామెంట్లతో తమ స్పందనను తెలియజేస్తున్నారు.
జట్టులో చోటెక్కడిది..?
నిజానికి సొంతగడ్డపై అశ్విన్‌కు తుదిజట్టులో చోటుకు తిరుగులేనప్పటికీ, విదేశాల్లో మాత్రం అప్పుడప్పుడు చుక్కెదురవుతోంది. చాలాకాలంగా తను ఫస్ట్ ఛాయిస్ స్పిన్నర్‌గా విదేశాల్లో టీమిండియా మేనేజ్మెంట్ పరిగణించడం లేదు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో ఇది మరింత తేట తెల్లమైంది. తొలి టెస్టులో అశ్విన్‌కు బదులుగా వాషింగ్టన్ సుందర్‌ను ఆడించిన టీమిండియా.. రెండో టెస్టులో అశ్విన్‌కు చోటు కల్పించారు. ఆ టెస్టులో ఒక వికెట్‌తో ఫర్వాలేదనిపించిన యాష్.. మూడో టెస్టులో మాత్రం బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీంతో సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా దీనిపై మాట్లాడుతూ.. తనకు చాలా క్రికెట్ ఆడాలనుందని, అయితే జట్టులో చోటు కోసం చాలా పోటీ నెలకొందని పేర్కొన్నాడు. మరోవైపు అభిమానులు ఎందుకు రిటైర్ కావడం లేదు..? అని ప్రశ్నించడానికి ముందరే ఎందుకు ఇంత త్వరగా రిటైర్ అయ్యాడా..? అనే విధంగా తన నిర్ణయం ఉండాలని భావించినట్లు పేర్కొన్నాడు. అందుకే తను అలా షాకింగ్‌గా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించినట్లు పేర్కొన్నాడు.
అలా చోటు దక్కించుకోవడం ఇష్టం లేదు..
ఆటగాళ్లు చివరి టెస్టు ఆడటం కోసం ప్రత్యేకంగా తుది జట్టులో చోటు కేటాయించడం తనకు ఇష్టం లేదని అశ్విన్ పేర్కొన్నాడు. అలాంటి వాటికి తాను వ్యతిరేకమని పేర్కొన్నాడు. ఇక అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం తన ఇంట్లో వాళ్లకు కూడా తెలియదని సమాచారం. ఆసీస్ టూర్లో ఈ ప్రకటన వస్తుందని వాళ్లు ఏమాత్రం ఊహించలేదని తెలుస్తోంది. ఇక కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రమే ప్రకటనకు ముందు సంప్రదించినట్లు సమాచారం. ఇక అశ్విన్ రిటైర్మెంట్ విషయం తెలిసి విరాట్ కోహ్లీ షాకయ్యాడు. వీడ్కోలు ప్రకటన తర్వాత అశ్విన్ ను ఆలింగనం చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ గురించి గతంలో ప్రస్తుత హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో ఈ జనరేషన్లో గోట్‌గా ఖ్యాతి కెక్కిన సంగతి తెలిసిందే. 106 టెస్టుల్లో 537 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన భారత టెస్టు బౌలర్‌గా అశ్విన్ ఘనత వహించాడు. ఇందులో 8 సార్లు పది వికెట్ల ప్రదర్శన, 37 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో దుమ్ము రేపాడు. అయితే అశ్విన్ కెరీర్ ఒక్కటి తక్కువైందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. అతడిని పరిమిత ఓవర్ల క్రికెట్లో మరింత బాగా వాడుకుని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాడు. 106 టెస్టులాడిన అశ్విన్.. 116 వన్డేలు, 65 టీ20లు మాత్రమే ఆడాడు. ఇదే విషయంపై గంభీర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఏదేమైనా రిటైర్మెంట్ ప్రకటనపై అశ్విన్ పూర్తి స్పష్టతతోనే ఉన్నాడని తెలుస్తోంది.