Rohit Vs BCCI: రోహిత్ సంచలన నిర్ణయం! - పాక్‌లో టోర్నీ ప్రారంభ వేడుకలకు హాజరయ్యే ఛాన్స్?, డైలమాలో బీసీసీఐ
Rohit Sharma: 12 ఏళ్ల తర్వాత మరోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ మేరకు జట్టును సిద్దం చేసుకుంటోంది. అలాగే 2017 ఫైనల్లో ఓటమికి పాక్‌కు బుద్ధి చెప్పాలని భావిస్తోంది.
ICC Champions Trophy News: భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు అంతగా బాగోలేవు. ఆ ఇంటిపై కాకి ఈ ఇంటిపై వాలడం లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరిసారిగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగి కూడా దశాబ్ధం దాటిపోయింది. తమ దేశంలో పర్యటించాలని ఎంతగా ప్రాథేయపడుతున్నా బీసీసీఐ.. పాక్ ఆఫర్‌ని ఎప్పటికప్పుడు తిరిస్కరిస్తోంది. ద్వైపాక్షిక సిరీస్‌లే కాకుండా వేరే ఏ టోర్నీకైనా ఆ దేశంలో టీమిండియా పర్యటించడం లేదు. వచ్చే నెలలో పాకిస్థాన్‌లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీలో కూడా భారత్ పాల్గొనడం లేదు. హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ జరుగుతోంది. దుబాయ్‌లో భారత్ ఆడే లీగ్ మ్యాచ్‌లతో పాటు నాకౌట్‌కు చేరితే ఆ మ్యాచ్‌లను కూడా అక్కడ నిర్వహిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితిలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో పాకిస్థాన్‌లో పర్యటించనుండటం చర్చనీయాంశం అయింది. బీసీసీఐ ధోరణిని కాదని రోహిత్ పర్యటించడం వెనకాల బలమైన కారణం ఉంది.
సంప్రదాయంగా..
నిజానికి ఏదైనా ఐసీసీ లేదా ఏసీసీ టోర్నీ జరుగుతున్నప్పుడు టోర్నీ ప్రారంభ వేడుకలకు ఆ టోర్నీలో పాల్గొనే జట్ల కెప్టెన్లు హాజరుకావడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో పాక్‌లో జరిగే ఈ ఆరంభానికి రోహిత్ శర్మ హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 17వ తేదిన టోర్నీ ఆరంభానికి రోహిత్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, రోహిత్ హాజరుకావడం పక్కా అని తెలుస్తోంది. అదే రోజు నుంచి వివిధ దేశాల మధ్య వార్మప్ మ్యాచ్‌లు కూడా జరుగుతాయి. మరో వైపు 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాక్‌లో ఐసీసీ టోర్నీ జరగబోతోంది. చివరిసారిగా శ్రీలంక, భారత్‌లతో కలిసి 1996 వన్డే ప్రపంచ కప్‌ను పాక్ నిర్వహించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని గట్టి పట్టుదలగా ఉంది.
తొలి ప్రత్యర్థి బంగ్లాదేశ్..
ఇక ఈ టోర్నీని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాక్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్టు ఉన్నాయి. తన లీగ్ మ్యాచ్‌లను ఫిబ్రవరి 20న బంగ్లాతో, 23న పాక్‌తో, మార్చి 2న కివీస్‌తో ఆడుతుంది. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూపులో తొలి రెండు స్థానాల్లో గెలిచిన జట్లు నేరుగా సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఒకవేళ భారత్.. సెమీస్, ఫైనల్ చేరుకున్నట్లయితే రెండు నాకైట్ మ్యాచ్‌లు దుబాయిలోనే జరుగుతాయి. లేకపోతే ఇవి పాక్‌లో జరుగుతాయని తెలుస్తోంది. ఇక 2013లో చివరిసారి ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ నెగ్గింది. ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. అలాగే 2017లో ఫైనల్‌కు చేరిన భారత్.. పాక్ చేతిలో ఓడిపోయింది. ఇక ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. కటాఫ్ తేది వరకు ర్యాంకింగ్స్‌లో టాప్ 7 ఉన్న జట్లు నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయి. ఆతిథ్య జట్టు హోదాలో పాక్‌కు నేరుగా ఎంట్రీ లభించింది. వచ్చే నెల 19న న్యూజిలాండ్ - పాక్ మధ్య పోరుతో ఛాంపియన్స్ ట్రోఫీ పోరు మొదలవుతుంది.