అన్వేషించండి
Advertisement
Pakistan vs Bangladesh Highlights: పాక్ పరాజయాల పరంపరకు బ్రేక్ , బంగ్లాపై విజయంతో సెమీస్ ఆశలు సజీవం!
ODI World Cup 2023: ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పరాజయాల పరంపరకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. వరుస ఓటములపై సర్వత్రా విమర్శల జల్లు కురుస్తున్న వేళ బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ ఏకపక్ష విజయం సాధించింది.
ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పరాజయాల పరంపరకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. వరుస ఓటములపై సర్వత్రా విమర్శల జల్లు కురుస్తున్న వేళ బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ ఏకపక్ష విజయం సాధించింది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత వచ్చిన విజయంతో పాక్ జట్టు ఊపిరి పీల్చుకుంది. కోల్‌కత్త ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకుంది. పాక్ బౌలర్ల ధాటికి 45.1 ఓవర్లలో 204 పరుగులకే బంగ్లా కుప్పకూలింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. 32.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని సాధించింది. ఈ ఏకపక్ష విజయంతో సాంకేతికంగా ఉన్న సెమీస్ అవకాశాలను పాక్ సజీవంగా ఉంచుకుంది.
కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన పాక్ బౌలర్లు
ఈ మ్యాచ్‌లో టాస్‌గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అలా బ్యాటింగ్‌కు దిగారో లేదో బంగ్లాకు.. పాక్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిదీ షాక్ ఇచ్చాడు. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకముందే ఓపెనర్ తన్జీద్ హసన్‌ను అఫ్రిదీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో బంగ్లా ఒక్క పరుగు చేయకుండానే తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు ఆరు పరుగులకు చేరిందో లేదో తన తర్వాతి ఓవర్లో షహీన్ షా అఫ్రిదీ మరోసారి దెబ్బకొట్టాడు. 3 బంతుల్లో నాలుగు పరుగులు చేసిన నజ్ముల్ హొస్సేన్ శాంటోను అఫ్రిదీ అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ముష్పికర్ రహీమ్ పెవిలియన్ చేరాడు. దీంతో ఆరు ఓవర్లకు 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి బంగ్లా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కానీ లిట్టన్‌దాస్‌తో జత కలిసిన మహ్మదుల్లా పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. నాలుగో వికెట్‌కు ఈ జోడి 79 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ జోడీని ఇఫ్తికార్ అహ్మద్ విడదీశాడు. లిట్టన్ దాస్‌ను ఇఫ్తికార్ అవుట్ చేశారు. 64 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు చేసి లిట్టన్ దాస్ అవుటయ్యాడు. దీంతో 102 పరుగుల వద్ద బంగ్లా నాలుగో వికెట్ కోల్పోయింది. కాసేపటికే అర్ధ శతకం చేసి క్రీజులో స్థిరపడిన మహ్మదుల్లాను అవుట్ చేసి షహీన్ షా అఫ్రిదీ మరోసారి బంగ్లాను దెబ్బ కొట్టాడు. 70 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సుతో 56 పరుగులు చేసిన మహ్మదుల్లాను షహీన్ షా అఫ్రిదీ అవుట్ చేయగా.. 64 బంతుల్లో 4 ఫోర్లతో 43 పరుగులు చేసి అర్ధ సెంచరీ దిశగా సాగుతున్న షకీబుల్ హసన్‌ను హరీస్ రౌఫ్ అవుట్ చేశాడు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో బంగ్లా 45.1 ఓవర్లలో 204 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిదీ 3, హరీస్ రౌఫ్ రెండు, మహ్మద్ వసీమ్ 3 వికెట్లు తీశారు.
అనంతరం 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 128 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (68; 69 బంతుల్లో 9×4, 2×6), ఫకర్ జమాన్ (81; 74 బంతుల్లో 3×4,7×6) అర్ధశతకాలతో చెలరేగారు. వీళ్లిదరూ వెంటవెంటనే అవుటైనా మిడిలార్డర్‌లో వచ్చిన మహ్మద్ రిజ్వాన్ (26) నాటౌట్, ఇఫ్తికర్ అహ్మద్ (17) నాటౌట్‌తో లక్ష్యాన్ని పూర్తి చేశారు. పాక్ కోల్పోయిన మూడు వికెట్లు మిరాజే తీశాడు. 7మ్యాచుల్లో మూడింట విజయం సాధించిన పాకిస్థాన్.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion