ODI World Cup 2023: అందరి కన్నా ముందే వన్డే ప్రపంచకప్ టికెట్లు కావాలా! ఏం చేయాలో చెప్పిన ఐసీసీ!
ODI World Cup 2023: క్రికెట్ ప్రేమికులకు ఇక పండగే! ఐసీసీ వన్డే ప్రపంచకప్ (ICC ODI World cup 2023) మ్యాచుల టికెట్ల అమ్మకాలు మొదలవుతున్నాయి.
ODI World Cup 2023:
క్రికెట్ ప్రేమికులకు ఇక పండగే! ఐసీసీ వన్డే ప్రపంచకప్ (ICC ODI Worldcup 2023) మ్యాచుల టికెట్ల అమ్మకాలు మొదలవుతున్నాయి. మెగా టోర్నీకి సరిగ్గా 40 రోజుల ముందు, అంటే ఆగస్టు 25 నుంచి టికెట్ల విక్రయం చేపడతామని ఐసీసీ తెలిపింది. రీషెడ్యూలును ప్రకటించిన తర్వాత ఈ విషయం చెప్పింది.
టీమ్‌ఇండియా మినహా మిగతా అన్ని మ్యాచుల టికెట్ల విక్రయం ఆగస్టు 25 నుంచి మొదలవుతుంది. మొదట వార్మప్ ఆ తర్వాత లీగ్ మ్యాచుల టికెట్లు అమ్ముతారు. ఆపై ఆరు దశల్లో టీమ్‌ఇండియా తలపడే మ్యాచులు టికెట్లు ఇస్తారు. సెప్టెంబర్ 30న గువాహటిలో ఇంగ్లాండ్, అక్టోబర్ 3న తిరువనంతపురంలో శ్రీలంక లేదా నెదర్లాండ్స్‌తో రోహిత్ సేన వార్మప్ మ్యాచులు ఆడుతుంది. మొదట ఈ పోటీల టికెట్లు అమ్ముతారు.
ఆగస్టు 25: టీమ్‌ఇండియా మినహా మిగతా జట్ల వార్మప్, లీగ్ మ్యాచులు టికెట్ల విక్రయం
ఆగస్టు 30: గువాహటి, తిరువనంతపురంలో టీమ్‌ఇండియా ఆడే వార్మప్ మ్యాచుల టికెట్ల విక్రయం
ఆగస్టు 31: ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌తో టీమ్‌ఇండియా మ్యాచుల టికెట్ల విక్రయం
సెప్టెంబర్ 1: న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకతో టీమ్ఇండియా మ్యాచుల టికెట్ల అమ్మకాలు
సెప్టెంబర్ 2: దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో టీమ్‌ఇండియా మ్యాచుల టికెట్ల అమ్మకాలు
సెప్టెంబర్ 3: అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్ x పాకిస్థాన్ మ్యాచు టికెట్ల అమ్మకాలు
సెప్టెంబర్ 15: సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచు టికెట్ల అమ్మకాలు
'ఆగస్టు 15న టికెట్ల విక్రయానికి ముందు అభిమానులు https://www.cricketworldcup.com/registerలో తమ ఆసక్తిని తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు అందరికన్నా ముందుగా వారికి టికెట్ల అమ్మకాలపై సమాచారం వస్తుంది. వన్డే ప్రపంచకప్ మ్యాచులు ప్రత్యక్షంగా చూసేందుకు వీలవుతుంది. ఆటను ఆస్వాదించొచ్చు' అని ఐసీసీ తెలిపింది.
'ఐసీసీ వన్డే ప్రపంచకప్ టికెట్ల విక్రయ సమాచారం అందరికన్నా ముందుగా తెలుసుకొనేందుకు వచ్చే వారమే పేర్లు నమోదు చేసుకోవాలని లక్షల మంది అభిమానులను కోరుతున్నాం' అని ఐసీసీ ఈవెంట్స్ అధినేత క్రిస్ టెట్లీ అన్నారు. 'సవరించిన క్రికెట్ మ్యాచుల వేళలను ప్రకటించడంతో ఆటగాళ్లు, అభిమానులు సాధ్యమైనంత ఎక్కువగా వన్డే క్రికెట్‌ను ఆస్వాదించగలరు' అని పేర్కొన్నారు.
సాధారణంగా ఐసీసీ ప్రపంచకప్‌ల షెడ్యూలును ఏడాది ముందుగానే ప్రకటిస్తారు. అయితే ఈ సారి సరిగ్గా వంద రోజులు ముందు ఇచ్చారు. మళ్లీ కొన్నాళ్లకు తొమ్మిది మ్యాచులు షెడ్యూలును సవరించారు. ఇందుకు ప్రాధాన కారణం పాకిస్థాన్. రాజకీయ కారణాలతో ఆ జట్టు భారత్‌కు వస్తాం.. రాలేము.. అంటూ ద్వంద్వనీతిని ప్రదర్శించింది. ఆసియాకప్ ఆడేందుకు భారత్ వస్తేనే తాము వస్తామంటూ ప్రకటించింది. మరికొన్ని సార్లు మాట మార్చింది. దాంతో ఐసీసీ బృందం అక్కడికి వెళ్లి హామీ తీసుకొని వచ్చింది.