NZ vs SL, T20 WC 2022: బౌల్ట్ బుల్లెట్స్! 4 వికెట్లతో ఊచకోత - లంకపై 65 తేడాతో కివీస్ విక్టరీ!
NZ vs SL, T20 WC 2022: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో న్యూజిలాండ్ మరో అద్భుత విజయం అందుకుంది. 168 పరుగుల టార్గెట్ ఛేదనకు దిగిన శ్రీలంకను 65 తేడాతో చిత్తుగా ఓడించింది.
NZ vs SL, T20 WC 2022: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో న్యూజిలాండ్ మరో అద్భుత విజయం అందుకుంది. సిడ్నీ మైదానంలో బ్యాటు, బంతి, ఫీల్డింగ్‌తో చెలరేగింది. మందకొడి పిచ్‌పై 168 పరుగుల టార్గెట్ ఛేదనకు దిగిన శ్రీలంకను 65 తేడాతో చిత్తుగా ఓడించింది. ట్రెంట్ బౌల్ట్ (4/13), మిచెల్ శాంట్నర్ (2/21) బంతితో చెలరేగి 19.2 ఓవర్లకే 102కి ఆలౌట్ చేశారు. లంకేయుల్లో దసున్ శనక (35; 32 బంతుల్లో 4x4, 1x6), భానుక రాజపక్స (34; 22 బంతుల్లో 3x4, 2x6) కాసేపు పోరాడారు. అంతకు ముందు కివీస్‌లో గ్లెన్ ఫిలిప్స్ (104; 64 బంతుల్లో 10x4, 4x6) అద్వితీయ సెంచరీ అందుకున్నాడు. డరైల్ మిచెల్ (22) అతడికి అండగా నిలిచాడు. పాయింట్లు, రన్‌రేట్ పెంచుకొని గ్రూప్ 1లో కివీస్ పటిష్ఠ స్థితిలో నిలిచింది.
బౌల్ట్ బుల్లెట్లు!
సిడ్నీలో శ్రీలంకకు ఏమీ అచ్చిరాలేదు. మొదట గ్లెన్ ఫిలిప్స్‌కు రెండుసార్లు లైఫ్ ఇచ్చారు. ఫీల్డింగ్ చేయడంలో ఇబ్బంది పడ్డారు. ఇక ఛేదనలోనూ వారికి వరుస షాకులు తగిలాయి. పవర్‌ప్లే ముగిసే సరికే 4 వికెట్లు నష్టపోయి 24తో నిలిచింది. పరుగుల ఖాతా తెరవక ముందే ఓపెనర్ పాథుమ్ నిసాంకను సౌథీ డకౌట్ చేశాడు. ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్ చెలరేగాడు. వరుసగా కుశాల్ మెండిస్ (4), ధనంజయ డిసిల్వా (0), చరిత్ అసలంక (4)ను పెవిలియన్ పంపించేశాడు. ఈ క్రమంలో రాజపక్స కాస్త ఎదురుదాడికి ప్రయత్నించాడు. పదో ఓవర్ చివరి బంతికి అతడిని ఫెర్గూసన్ ఔట్ చేశాడు. కరుణ రత్నె, హసరంగ వికెట్లూ పడటంతో లంకేయుల ఓటమి ఖరారైంది. ఆఖర్లో కెప్టెన్ దసున్ శనక నెట్ రన్‌రేట్ కాపాడేందుకు ట్రై చేశాడు. కొన్ని చక్కని షాట్లు ఆడిన అతడిని 16.6వ బంతికి బౌల్ట్ పెవిలియన్‌కు పంపి మ్యాచును ముగించాడు.
Points in the bank! Trent Boult leads the bowling effort with 4-13 at the @scg to defend against @OfficialSLC. Wickets also for Santner, Sodhi, Southee and Ferguson. Card | https://t.co/evB7YxqHcD #T20WorldCup pic.twitter.com/pFnJPFzFK6
— BLACKCAPS (@BLACKCAPS) October 29, 2022
ఫిలిప్స్ సెంచరీ!
మందకొడి పిచ్ కావడంతో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పవర్‌ప్లే ముగిసే సరికే 3 వికెట్లు నష్టపోయి విలవిల్లాడింది. ఇన్నింగ్స్ నాలుగో బంతికి ఫిన్ అలెన్ (1)ను థీక్షణ బౌల్డ్ చేశాడు. జట్టు స్కోరు 7 వద్ద డేవాన్ కాన్వే (1)ను ధనంజయ డిసిల్వా పెవిలియన్ పంపించాడు. మరికాసేపటికే కెప్టెన్ కేన్ విలియమ్సన్ (8) రజిత ఔట్ చేశాడు. ఇలాంటి సిచ్యువేషన్‌లో గ్లెన్ ఫిలిప్స్ క్రీజులో నిలబడ్డాడు. లంకేయులు ఇచ్చిన లైఫ్‌లును చక్కగా వినియోగించుకున్నాడు. చక్కని బంతుల్ని గౌరవిస్తూనే చెత్త బంతుల్ని వేటాడాడు.
మిచెల్‌తో కలిసి ఫిలిప్స్ నాలుగో వికెట్‌కు 64 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 39 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న అతడు ఆపై మరింత చెలరేగాడు. మరో వైపు వికెట్లు పడుతున్నా డెత్ ఓవర్లలో సిక్సర్లు, బౌండరీలు బాదేసి 61 బంతుల్లో సెంచరీ బాదేశాడు. టీ20 ప్రపంచకప్పుల్లో రెండో సెంచరీ బాదిన న్యూజిలాండర్‌గా రికార్డు సృష్టించాడు. 19.4వ బంతికి భారీ షాట్ ఆడబోయిన అతడిని కుమార లాహిరు ఔట్ చేయడంతో కివీస్ 167/7తో నిలిచింది.