అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
AUS vs NZ: వాటే మ్యాచ్, చివరిబంతి వరకూ ఉత్కంఠ- ఆస్ట్రేలియాపై పోరాడి ఓడిన న్యూజిలాండ్
ODI World Cup 2023: ప్రపంచకప్‌లో మరో హై టెన్షన్ మ్యాచ్. గెలుపు కోసం ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ జట్లు.. కొదమ సింహాల్లా పోరాడాయి.
ప్రపంచకప్‌లో మరో హై టెన్షన్ మ్యాచ్. గెలుపు కోసం ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ జట్లు.. కొదమ సింహాల్లా పోరాడాయి. ప్రపంచకప్‌లోనే అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌లో.... ఆస్ట్రేలియా నిర్దేశించిన 389 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు కివీస్ చివరి బంతి వరకూ పోరాడింది. భారీ లక్ష్యాన్ని చూసి ఏమాత్రం వెరవని న్యూజిలాండ్.. తమ జట్టు ఎందుకు ప్రత్యేకమో ఈ పోరాటంతో మరోసారి నిరూపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌట్ అయింది. 389 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. విజయానికి కేవలం అయిదు పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఆగిపోయింది. ఓడిపోయినా భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ పోరాటం క్రికెట్ ప్రేమికుల హృదయాలను దోచుకుంది.
ఆస్ట్రేలియాది అదే జోరు
ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన కంగారులకు అదిరే ఆరంభం లభించింది. ఆది నుంచి ఆస్ట్రేలియా దూకుడుగా ఆడింది. ట్రావిస్ హెడ్ మెరుపు సెంచరీతో విధ్వంసం సృష్టించగా... డేవిడ్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గ్లెన్ మ్యాక్స్వెల్, ప్యాట్ కమిన్స్ కూడా విధ్వంసం సృష్టించడంతో ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. హిమాచల్ క్రికెట్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ట్రావిస్ హెడ్ 67 బంతుల్లోనే 109 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, ఏడు భారీ సిక్సర్లు ఉన్నాయి. డేవిడ్ వార్నర్ 65 బంతుల్లోనే 5 ఫోర్లు ఆరు సిక్సర్లతో 81 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. హెడ్, వార్నర్ జోడి 19.1 ఓవర్లలోనే 175 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పి ఆస్ట్రేలియా భారీ స్కోరుకు పునాది వేశారు. వీరిద్దరూ అవుటైన తర్వాత ఆస్ట్రేలియా పరుగుల వేగం తగ్గింది. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ 24 బంతుల్లో 41 పరుగులు, ప్యాట్ కమిన్స్ 14 బంతుల్లోనే 37 పరుగులు చేసి జట్టు స్కోరును 388 పరుగులకు చేర్చారు. ఓ దశలో తేలిగ్గా నాలుగు వందలు పరుగులు చేసేలా కనిపించిన ఆస్ట్రేలియా 388 పరుగులకే పరిమితమైంది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్డ్ 3, గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లు తీశారు.
ఔరా న్యూజిలాండ్
389 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్... అద్భుత పోరాటంతో లక్ష్యాన్ని ఛేదించినంత పని చేసి కంగారులకు చెమటలు పట్టించింది. డేవిడ్ కాన్వే-విల్ యంగ్ జోడి తొలి వికెట్‌కు 7 ఓవర్లలోనే 61 పరుగులు చేసి శుభారంభం అందించారు. 28 పరుగులు చేసిన కాన్వే, 32 పరుగులు చేసిన యంగ్ వెనుదిరగడంతో 72 పరుగులకు కివీస్ రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఈ ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర అద్భుత సెంచరీతో న్యూజిలాండ్‌ను లక్ష్యం దిశగా నడిపించాడు. 89 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లతో రచిన్ రవీంద్ర 116 పరుగులు చేసి అవుటయ్యాడు. డేరిల్ మిచెల్ కూడా 54 పరుగులతో రాణించాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో కివీస్ లక్ష్యం దిశగా సాగింది. కానీ రచిన్‌ను అవుట్ చేసిన కమిన్స్ ఆస్ట్రేలియాను మళ్లీ పోరాటంలోకి తెచ్చాడు. మిచెల్ కూడా అవుటవ్వడంతో కంగారులకు విజయంపై నమ్మకం కలిగింది. కానీ జేమ్స్ నీషమ్ అంత తేలిగ్గా వదలలేదు.
నీషమ్ అద్భుత పోరాటంతో కంగారులను కంగారు పెట్టించాడు. 39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగులు చేసిన నీషమ్ చివరి ఓవర్ వరకూ ఆస్ట్రేలియాను వణికించాడు. 388 పరుగులు చేసినా చివరి బంతి వరకూ కంగారులకు విజయంపై ధీమా లేకుండా పోయింది. చివరి ఓవర్‌లో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. ఈ ఓవర్‌లో నీషమ్ అవుట్ అవ్వడంతో న్యూజిలాండ్ ఆశలకు తెరపడింది. చివరి బంతికి విజయానికి ఆరు పరుగులు చేయాల్సి ఉండగా ఫెర్గ్యూసన్ ఎలాంటి అద్భుతం చేయలేకపోయాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
సినిమా
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement