Rohit Sharma: చెడ్డ కెప్టెన్ అవ్వడానికి ఒక్క మ్యాచ్ చాలు : రోహిత్ శర్మ
Rohit Sharma: తాను చెడ్డ కెప్టెన్‌గా అవడానికి ఒక్క మ్యాచ్ చాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు. బుధవారం మీడియా సమావేశంలో రోహిత్ మాట్లాడారు.
Rohit Sharma: తాను చెడ్డ కెప్టెన్‌గా అవడానికి ఒక్క మ్యాచ్ చాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు. బుధవారం మీడియా సమావేశంలో రోహిత్ మాట్లాడారు. గ్రౌండ్‌లో బౌండరీలు బాదే రోహిత్ పాత్రికేయులకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. మాజీ ఆటగాళ్లు సూచించినట్లుగా, ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాలని స్వార్థపూరితంగా ఉండాలా అంటూ అడిగిన ప్రశ్నకు రోహిత్ తనదైన శైళిలో వ్యంగ్యంగానే సమాధానమిచ్చారు.
జట్టును మంచి స్థితిలో ఉంచాలని కోరుకుంటానని రోహిత్ చెప్పారు. స్కోర్‌బోర్డ్ సున్నా నుంచి మొదలవుతుందని, ఆ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని అన్నారు. చివరి గేమ్ పవర్ ప్లేలో ఒత్తిడికి గురయ్యామని, మూడు వికెట్లు కోల్పోయామని చెప్పొకొచ్చాడు. అందుకే ఆట తీరు మార్చవలసి వచ్చిందని, జట్టుకు ఏమి అవసరమో బ్యాట్స్‌మెన్‌గా దానిపైనే తన దృష్టి ఉంటుందని తెలిపారు.
ఆట పరిస్థితిని, స్కోర్‌బోర్డ్, సమయానుకూలంగా కొన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తామని, కొన్నిసార్లు అవి పని చేస్తాయని, మరికొన్ని సార్లు పని చేయవని, అలాంటప్పుడు అన్నింటిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. మనం ఎలాంటి ప్రయత్నం చేసినా అది జట్టు ప్రయోజనాల కోసమేనని, ఆ విషయం తనకు తెలుసు అన్నారు. ఒక చెడ్డ ఆటగాడిగా, కెప్టెన్‌గా అవడానికి ఒక్క మ్యాచ్ చాలన్నారు.
మ్యాచ్-డే రోజు మీరు ఏమి చేస్తారని అడిగిన ప్రశ్నకు రోహిత్ సమాధామిస్తూ.. రేపు మనం ఏం చేయబోతున్నామో చెప్పదలచుకోలేదన్నారు. కొన్ని సమయాల్లో మైదానం అనూహ్యంగా మారుతుందన్నారు. బౌలర్లకు ఎక్కువగా అనుకూలిస్తుందన్నారు. ప్రత్యర్థిని గడగడలాడిస్తున్న టాప్ స్పెల్‌ను చూడవచ్చని, బౌలర్లు బంతిని సరైన ఏరియాలో వేస్తే కష్టమేనని చెప్పారు. బౌలర్లు, స్పిన్నర్లు, బ్యాటర్లకు ఇక్కడ ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందన్నారు.
అవసరమైతే ఇప్పటికీ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్‌లతో ఆడవచ్చని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఈ ప్రపంచకప్‌లో స్పిన్నర్లు రాణించారని, మిడిల్ ఓవర్లలో పరుగుల ప్రవాహాన్ని అడ్డుకున్నారని తెలిపారు. బౌలర్లు ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నారని, వారికి విశ్రాంతి అక్కర్లేదని చెప్పారు.
ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంశలు వెల్లువెత్తున్నాయి. కీలక మ్యాచ్‌ల్లో రాణిస్తున్నారు. భారత్ గెలుపు కోసం కోసం గణాంకాలను ఏమాత్రం పట్టించుకోరు. అలాగే నాయకుడిగా జట్టును ముందుండి నడిపిస్తున్నారు. బౌలింగ్ మార్పులు, ఫీల్డిండ్ ప్లేస్ మెంట్లు సెట్ చేస్తూ అందరి ప్రసంశలను పొందుతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను భారత్ చిత్తు చేయడంలో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు.
నేను మీకు తెలియదా?
మీడియా సమావేశంలో ముందుగా మీడియా మేనేజర్ మాట్లాడారు. అనంతరం రోహిత్ శర్మను పరిచయం చేశారు. ఆ సమయంలో రోహిత్ తన చేతుల్లో ముఖాన్ని దాచిపెట్టి.. ‘డ్యూడ్, ఈ కుర్రాళ్లకు నేను తెలియదా?’ అంటూ నవ్వించారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన పోరులో రోహిత్ శర్మ రాణించాడు. భారత్ గెలుపుతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
బుధవారం కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి క్యూరేటర్‌తో సుదీర్ఘంగా మాట్లాడటం, పిచ్‌ను అంచనా వేయడానికి ప్రయత్నించడం కనిపించింది. లక్నోలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితో మెరిసిన జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ నెట్స్‌లో ప్రాక్టిస్ సెషన్స్‌లో పాల్గొనలేదు.