Dinesh Kartik Ravi Aswin: టీ20 మెగా టోర్నీ దినేశ్ కార్తీక్, అశ్విన్ కి చివరిదా!
Dinesh Kartik Ravi Aswin: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సీనియర్ ఆటగాళ్లు దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్ లకు చివరి పొట్టి క్రికెట్ టోర్నీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Dinesh Kartik Ravi Aswin: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సీనియర్ ఆటగాళ్లు దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్ లకు చివరి పొట్టి క్రికెట్ టోర్నీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మెగా టోర్నీ అనంతరం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లతో జరగనున్న సిరీస్ లకు సెలక్టర్లు వీరిని ఎంపిక చేయలేదు. దీంతో ఈ టోర్నీనే వారికి చివరిది అయ్యే అవకాశం ఉంది. 2024 టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ సెలక్టర్లు జట్టును ఎంపిక చేశారు. ఎక్కువగా యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు.
ఇదే లాస్ట్!
37 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ దినేశ్ కార్తీక్ కు ఇది రెండో ఇన్నింగ్స్ లాంటిదని చెప్పవచ్చు. చాలాకాలంగా భారత జట్టుకు దూరమైన కార్తీక్.. ఐపీఎల్ లో ఫినిషర్ గా మెరుపులు మెరిపించి జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. ఆసియా కప్ లో రాణించి టీ20 ప్రపంచకప్ కు జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే ఆడిన 3 మ్యాచుల్లోనూ పెద్దగా పరుగులు చేయలేదు. దక్షిణాప్రికాతో జరిగిన మ్యాచులో వెన్నునొప్పితో చివరి 4 ఓవర్లలో కీపింగ్ చేయలేదు. అతని స్థానంలో పంత్ మైదానంలోకి వచ్చాడు. ప్రస్తుతం కార్తీక్ వెన్ను నొప్పి గురించి సరైన సమాచారం లేకపోయినప్పటికీ.. ఈ టోర్నీలో మిగిలిన మ్యాచుల్లో అతడు ఆడేది అనుమానమే.
అశ్విన్ కు నో ఛాన్స్
36 ఏళ్ల అశ్విన్ కు కూడా ఇదే చివరి టీ20 సిరీస్ అవ్వవచ్చు. మెగా టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచుల్లో ఓ మోస్తరుగా వికెట్లు తీసిన అశ్విన్.. పాకిస్థాన్ తో హై వోల్టేజ్ మ్యాచులో విన్నింగ్ షాట్ తో జట్టును గెలిపించాడు. కివీస్, బంగ్లా సిరీస్ లకు అశ్విన్ ను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. కుర్రాళ్లను సానబెట్టే పనిలో ఉన్న బీసీసీఐ అశ్విన్ ను పొట్టి ఫార్మాట్ కు పక్కన పెట్టినట్లే అనిపిస్తోంది.
పంత్ ఓపెనింగ్!
ప్రపంచకప్ లో టీమిండియా తర్వాతి మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఉంది. ఇందులో రిషభ్ పంత్ కు చోటు దక్కొచ్చు. అయితే అతను ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడన్నది ప్రస్తుతం సస్పెన్స్ లో ఉంది. కేఎల్ రాహుల్ వరుసగా విఫలమవుతున్న తరుణంలో ఓపెనింగ్ కు వస్తాడా.. లేక తనకు అలవాటైన స్థానంలోనే ఆడతాడా అన్నది మ్యాచ్ రోజు తెలుస్తుంది.
టీ20 ప్రపంచకప్ లో ఇప్పటివరకు 3 మ్యాచులు ఆడిన భారత్.. 2 విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. సెమీస్ కు చేరుకోవాలంటే ప్రతి పాయింట్ కీలకమైన దశలో బంగ్లాతో మ్యాచులో టీమిండియా తప్పక గెలవాల్సిందే.
Will Rishabh Pant replace Dinesh Kartik in T20 World Cup match against Bangladesh?? pic.twitter.com/0w4lsvhBGw
— BharatFlux (@BharatFlux) October 31, 2022