IPL Media Rights Day-2: BCCI పంట పండింది- ఐపీఎల్ మీడియా హక్కులు @ రూ.43 వేల కోట్లు!
IPL Media Rights Day-2: ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో రెండో రోజు రికార్డ్ స్థాయిలో బిడ్డింగ్స్ దాఖలైనట్లు తెలుస్తోంది.
![IPL Media Rights Day-2: BCCI పంట పండింది- ఐపీఎల్ మీడియా హక్కులు @ రూ.43 వేల కోట్లు! IPL Media Rights Day-2: Bidding value for TV, digital goes upto Rs 43,255 crore IPL Media Rights Day-2: BCCI పంట పండింది- ఐపీఎల్ మీడియా హక్కులు @ రూ.43 వేల కోట్లు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/13/8a7a9b0c7c4ef354c90b00362ce74bc7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IPL Media Rights Day-2: ఐపీఎల్ మీడియా రైట్స్ వేలంతో బీసీసీఐకు భారీ ఆదాయం సమకూరేలా కనిపిస్తోంది. ఐపీఎల్ మీడియా రైట్స్ వేలంలో బిడ్డర్లు పోటీ పడి బిడ్స్ దాఖలు చేశారు. టీవీ, డిజిటల్ హక్కుల కోసం వేలంలో నువ్వా నేనా అన్నట్లు పాల్గొన్నారు. ఐదేళ్లకాలానికి ఉన్న ఈ రైట్స్ కనీస ధరని బీసీసీఐ రూ.32 వేల కోట్లుగా నిర్ణయించింది. అయితే ఫస్ట్ డే రూ. 40 వేల కోట్లు దాటగా, రెండో రోజు రూ.43 వేల కోట్లు దాటినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ధరలు ఇలా
టీవీ ప్రసార హక్కుల కోసం ఒక్కో మ్యాచ్కు రూ. 49 కోట్లు, డిజిటల్ హక్కులు రూ. 33 కోట్లుగా బేస్ ధర ప్రైజ్ను బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఆదివారం జరిగిన వేలంలో ఒక్క మ్యాచ్కు వంద కోట్లకు పైగా దాఖలవడంతో బీసీసీఐతో పాటు ఆటగాళ్లు, క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
టీవీ ప్రసార హక్కుల కోసం ఒక్కో మ్యాచ్ కు రూ. 57 కోట్లు, డిజిటల్ హక్కులు రూ. 48.04 కోట్లుగా బిడ్లు దాఖలయ్యాయి. ఈ లెక్కన ఒక్కో మ్యాచ్కు రూ. 105.04 కోట్లుగా బిడ్లు దాఖలయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అంటున్నారు.
దిగ్గజాల పోటీ
టీవీ, డిజిటల్ ప్రసార హక్కుల కోసం డిస్నీస్టార్, రిలయన్స్ వయాకామ్ 18, సోనీ నెట్‌వర్క్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి దిగ్గజ కంపెనీలు పోటీపడుతున్నాయి. వీటితో పాటు టైమ్స్ ఇంటర్నెట్, రిలయన్స్ జియో కూడా బిడ్స్ దాఖలు చేశాయి.
డిజిటల్ హక్కుల కోసం టైమ్స్ ఇంటర్నెట్, రిలయన్స్ జియో బిడ్డింగ్స్ వేయగా సూపర్ స్పోర్ట్ ఇంటర్నేషనల్ టెర్రిటరీ హక్కుల కోసం బిడ్డింగ్స్ వేసింది. ప్రస్తుతం పోటీ నుంచి అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు తప్పుకోగా మొత్తంగా 10 కంపెనీలు పోటీపడుతున్నాయి.
అప్పట్లో
ఇంతకుముందు 2019-23 సంవత్సరాలకు గాను స్టార్ నెట్ వర్క్‌కు టీవీ, డిజిటల్‌తో కూడిన మీడియా హక్కులను 255 కోట్ల డాలర్లకు ఇచ్చింది. ఈ సంవత్సరం రిలయన్స్‌కి చెందిన వయాకాన్ 18, డిస్నీ స్టార్, సోనీ నువ్వా నేనా అన్నట్లు వేలం పాటలో పాల్గొంటున్నాయి.
మీడియా హక్కులను పొందడం ద్వారా అడ్వర్టైజ్మెంట్ (ప్రకటనలు)ల రూపంలో భారీ ఆదాయాన్ని పొందడానికి ప్రసారదారులకు అవకాశముంటుంది. ఇక బెట్టింగ్ సంస్థలు ప్రకటనల మీదే కోట్లు ఖర్చు చేస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)