KKR vs GT Preview: బదులు తీర్చుకునేందుకు గుజరాత్ గ్యాంగ్ రెడీ - ఈ‘డెన్’లో కోల్‌కతా లొంగేనా?
IPL 2023: ఐపీఎల్ -16 లో నేడు డబుల్ హెడర్ జరుగనుంది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3.30 గంటలకు కోల్‌కతా నైట్ రైడర్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య రివేంజ్ డ్రామకు తెరలేవనుంది.
KKR vs GT Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నేడు మరో రివేంజ్ మ్యాచ్. ఈనెల 9న తలపడ్డ రెండు జట్ల మధ్య నేడు మరో హైఓల్టేజ్ పోరు జరుగనుంది. ఆఖరి ఓవర్లో 29 పరుగులు అవసరం కాగా ఐదు భారీ సిక్సర్లతో దుమ్మురేపిన కోల్‌కతా నైట్ రైడర్స్.. తమ స్వంత మైదానం ఈడెన్ గార్డెన్స్ లో గుజరాత్ టైటాన్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ రెండు జట్ల మధ్య నేటి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి మ్యాచ్ జరుగనుంది.
గుజరాత్‌కు రివేంజ్..
నేటి మ్యాచ్ కంటే ముందు గుజరాత్.. కేకేఆర్‌తో ఈనెల 9న అహ్మదాబాద్‌లో ఆడింది. 204 పరుగుల లక్ష్యంలో కేకేఆర్.. రింకూ సింగ్ ఐదు సిక్సర్ల విధ్వంసంతో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్ వేసిన జీటీ బౌలర్ యశ్ ధయాల్ ఇంకా కోలుకోలేదు. ఈ ఓటమికి గుజరాత్ నేడు ఈడెన్ లో బదులు తీర్చుకోవాలని ఫిక్స్ అయింది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా గుజరాత్.. కేకేఆర్ కంటే స్ట్రాంగ్ గా ఉంది. గుజరాత్ టాపార్డర్ శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, హార్ధిక్ పాండ్యా, సాయి సుదర్శన్‌లతో పాటు మిడిల్ లో డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియాలు టచ్ లోనే ఉన్నారు.
బౌలింగ్‌లో కూడా షమీకి తోడుగా వెటరన్ పేసర్ మోహిత్ శర్మ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. పంజాబ్, లక్నోలతో జరిగిన గత రెండు మ్యాచ్ లలో అతడే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. రషీద్ ఖాన్ మాయాజాలం కూడా తోడవడంతో గుజరాత్.. మొన్న లక్నోపై 135 పరుగులను కూడా కాపాడుకుంది. ఇప్పుడు కేకేఆర్ కు కూడా బదులిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది.
Kolkata, khoob bhalo 😍. Eden Gardens, khoob khoob bhalo 💙#TitansFAM, #KKRvGT ke liye match predictions, #AavaDe!@hardikpandya7 @DavidMillerSA12 @ShubmanGill @rashidkhan_19 pic.twitter.com/msKoPNaEBd
— Gujarat Titans (@gujarat_titans) April 29, 2023
కేకేఆర్‌కు కీలకం..
ఆడిన 8 మ్యాచ్ లలో మూడు మాత్రమే గెలిచిన కేకేఆర్.. ఇకనుంచి ఆడబోయే ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఆ జట్టుకు గుజరాత్ తో మ్యాచ్ తో పాటు రానున్న ఐదు మ్యాచ్ లు ఎంతో కీలకం. కానీ ఆ జట్టు బ్యాటింగ్ లో నిలకడ లేదు. జేసన్ రాయ్ మెరుపులు మెరిపిస్తున్నా.. మరో ఓపెనర్ జగదీశన్ ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. వెంకటేశ్ అయ్యర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం కేకేఆర్ కు లాభించేదే. కెప్టెన్ నితీశ్ రాణా కూడా టచ్ లోనే ఉన్నాడు. ఆఖర్లో వస్తున్నా రింకూ సింగ్ నిలకడగానే బాదుతున్నాడు. కానీ ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్ లు ఇంకా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.
బౌలింగ్ లో కూడా ఆ జట్టు బౌలర్లు ప్రత్యర్థులకు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. వైభవ్ అరోరా, ఉమేశ్ యాదవ్ లు విఫలమవుతున్నారు. కానీ స్పిన్నర్లు సుయాశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లు రాణిస్తుండటం కేకేఆర్ కు కలిసొచ్చేదే. మరి నేటి మ్యాచ్ లో వీళ్లు గుజరాత్ బ్యాటర్లను ఏ మేరకు నిలువరిస్తారనేది కీలకం.
All set, boys! Let's do this 🎮💜@chakaravarthy29 | @David_Wiese | #KKRvGT | #AmiKKR | #TATAIPL pic.twitter.com/Q1W5q0vM7b
— KolkataKnightRiders (@KKRiders) April 29, 2023
పిచ్ రిపోర్టు : ఈడెన్ గార్డెన్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇక్కడ జరిగిన గత నాలుగు మ్యాచ్ లలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ వల్ల స్పిన్ కు కూడా అనుకూలించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఛేజింగ్ చేసే టీమ్ కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
హెడ్ టు హెడ్ : ఇప్పటివరకు ఈ రెండు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. చెరో మ్యాచ్ గెలుచుకున్నాయి.
తుది జట్లు (అంచనా):
కోల్‌కతా నైట్ రైడర్స్ : జగదీశన్, జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్, డేవిడ్ వీస్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ