హిట్‌మ్యాన్ ఔట్- గిల్ హాఫ్ సెంచరీ- దూకుడుగా ఆడుతున్న టీమిండియా
INDvsAUS 4th Test: అహ్మదాబాద్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న భారత జట్టు దూకుడుగా ఆడుతోంది. మూడో రోజు తొలి సెషన్‌లో హిట్‌మ్యాన్ నిరాశపరిచాడు.
INDvsAUS 4th Test: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ దీటుగా బదులిస్తోంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఆ జట్టు తొలుత 480 పరుగులు చేసి ఆలౌట్ అవగా రెండో రోజు ఆఖరి సెషన్‌లో బ్యాటింగ్ కు వచ్చిన భారత జట్టు కూడా దూకుడుగానే ఆడుతోంది. శనివారం తొలి సెషన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (58 బంతుల్లో 35, 3x4, 1x6) క్రీజులో కుదురుకున్నట్టే కనిపించినా మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ (119 బంతుల్లో 65 నాటౌట్, 5x4, 1x6), ఛటేశ్వర్ పుజారా (46 బంతుల్లో 22 నాటౌట్, 1x4) లు ఆడుతున్నారు.
క్రీజులో నిలబడితే పరుగులు..
బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ పై ఆస్ట్రేలియన్లు ఓపికగా క్రీజులో నిలబడితే పరుగులు సాధించొచ్చన్న మంత్రాన్ని భారత బ్యాటర్లు కూడా పఠిస్తున్నారు. ఓవర్ నైట్ స్కోరు 36-0 వద్ద మూడో రోజు ఆట ఆరంభించిన భారత జట్టు.. ఉదయం కొంతసేపు దూకుడుగానే ఆడింది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన 12 వ ఓవర్లో గిల్ రెండు బౌండరీలు బాదాడు. అతడే వేసిన 14వ ఓవర్లో రోహిత్ శర్మ ఓ ఫోర్ తో పాటు సిక్సర్ కూడా కొట్టాడు.
షాకిచ్చిన కున్హేమన్..
క్రీజులో కుదురుకున్న రోహిత్ మీద భారత అభిమానులు మరోసారి భారీ ఆశలే పెట్టుకున్నారు. పిచ్ కూడా అనుకూలంగా ఉండటంతో ఈ మ్యాచ్‌లో కూడా అతడు మరో సెంచరీ చేస్తాడని అనిపించింది. కానీ అనూహ్యంగా కున్హేమన్ వేసిన 20వ ఓవర్ ఆఖరి బంతికి రోహిత్.. లబూషేన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 74 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
గిల్ హాఫ్ సెంచరీ..
రోహిత్ నిష్క్రమించినా వన్ డౌన్ లో వచ్చిన పుజారాతో కలిసి గిల్ భారత ఇన్నింగ్స్ ను నడిపిస్తున్నాడు. స్టార్క్ వేసిన 28వ ఓవర్లో రెండో బంతిని బౌండరీకి తరలించిన గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పుజారా కూడా నిలకడా ఆడుతుండంతో తొలి సెషన్ ముగిసేపట్పటికి భారత్.. వికెట్ నష్టపోయి 129 పరుగులు చేసింది. లంచ్ విరామం తర్వాత కూడా ఇదే జోరును కొనసాగిస్తే భారత జట్టు భారీ స్కోరు చేసేందుకు బాటలు పడతాయి. ఈ సెషన్ లో భారత్ 27 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 93 పరుగులు చేసింది. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు ఇప్పటికే 55 పరుగులు జోడించారు. నేడు మరో రెండు సెషన్ల ఆట మిగిలిఉన్న నేపథ్యంలో భారత జట్టు భారీ స్కోరుపై కన్నేసింది.