Virat Kohli Magic: కోహ్లీ మ్యాజిక్‌ను కాపీ కొట్టిన సిరాజ్ - అప్రమత్తమైన ఆసీస్ బ్యాటర్, మ్యాచ్‌లో సరదా సన్నివేశం
Ind Vs Aus Test Series: బ్రిస్బేన్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. భారత పేసర్ సిరాజ్ ఎత్తుగడను ఆసీస్ బ్యాటర్ తిప్పికొట్టాడు.
Mohammed Siraj News: భారత పేసర్ మహ్మద్ సిరాజ్ కయ్యానికి కాలు దువ్వేందుకు రెడీగా ఉంటాడని తెలిసిందే. ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటనలో ఆసీస్ ప్లేయర్లతో దూకుడుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఇక రెండో టెస్టులో ట్రావిస్ హెడ్‌తో వివాదం సిరీస్‌కే హైలెట్. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చేతిలో మందలింపునకు కూడా గురయ్యాడు. మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత కూడా ఐసీసీ విధించింది. ఇక మూడో టెస్టులో తన నోరును అదుపులో పెట్టుకున్న సిరాజ్.. వికెట్లు దక్కేందుకు కొత్త పంథాను అవలంబిస్తున్నాడు.
How good is this exchange between Siraj and Labuschange? #AUSvIND pic.twitter.com/GSv1XSrMHn
— cricket.com.au (@cricketcomau) December 15, 2024
బెయిల్స్ మార్చిన సిరాజ్..
ఇక ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసినప్పటికీ, సిరాజ్‌కు లక్ కలిసి రాలేదు. చాలాసేపు పదునైన బంతులతో బ్యాటర్ల సామర్థ్యాన్ని పరీక్షించిన ఈ పేసర్.. తాజాగా ఒక పని చేశాడు. తన బౌలింగ్ వేసి తిరిగి పెవిలియన్ ఎండ్ వైపు వెళ్తుండగా, ఒక్కసారిగా అంపైర్ సమీపానికి వచ్చాడు. అక్కడే నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మార్నస్ లబుషేన్ ఇది గమనించి, తన వద్దకే సిరాజ్ వస్తున్నాడని అప్రమత్తమయ్యాడు. అయితే సిరాజ్ కామ్‌గా నడుచుకుంటూ వెళ్లి, వికెట్లపై ఉన్న బెయిల్స్ మార్చాడు. ఇలానైనా లక్కు కలిసొచ్చి, వికెట్ల కాలంలో తన పేరు కనిపిస్తోందేమోనని సిరాజ్ ఆశించాడు. అయితే సిరాజ్ అక్కడి నుంచి వెళ్లిపోగానే, లబుషేన్ వెంటనే బెయిల్స్ మార్చి తిరిగి యథావిథిగా పెట్టాడు. గతంలో ఇలా బెయిల్ మార్వగానే వికెట్లు పడిన సందర్భాలు ఉండటంతో, లబుషేన్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలైంది. సోషల్ మీడియాలో సిరాజ్ వేసిన ప్లాన్స్ పై అభిమానులు జోక్స్ వేసుకుంటూ షేర్ చేసుకుంటున్నారు. మరవైపు గతంలో విరాట్ కోహ్లీ కూడా ఇలా బెయిల్స్ మార్చి తన జాదూను చూపించాడు. సౌతాఫ్రికాతో టెస్టు సందర్భంగా కోహ్లీ.. ఇలా బెయిల్ మార్చగా, అదే ఓవర్లో వికెట్ పడటం గమనార్హం. ఇంకా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగానూ కోహ్లీ.. ఇలా బెయిల్ మార్చి వైరలయ్యాడు. ఈ సంప్రదాయాన్ని 2023 యాషెస్ సందర్భంగా బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. బెయిల్ మార్వడంతో అప్పటవరకు ఆడుతున్న బ్యాటర్ లబుషేన్ ఔటవ్వడం కొసమెరుపు.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టులో భారత్ త్వరగానే వికెట్లు తీసింది. ముఖ్యగా ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. రెండు వికెట్లతో సత్తా చాటాడు. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (21), నాథన్ మెక్ స్విన్నీ(9)లను పెవిలియన్‌కు పంపాడు. ఉస్మాన్ కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, స్విన్నీ స్లిప్పులో దొరికిపోయాడు. ఇక క్రీజులో ఆడుతున్న లబుషేన్ (12) తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కు ఔటయ్యాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, హెడ్ భారీ భాగస్వామ్యంతో స్కోరుబోర్డును ముందుకు నడిపిస్తున్నారు.