IND Vs NED: భారత జైత్రయాత్రలో మరో రికార్డు, ఆస్ట్రేలియా తర్వాత మనమే
ODI World Cup 2023: ప్రపంచకప్‌లోని ఓ ఎడిషన్‌లో వరుసగా అత్యధిక మ్యాచులు గెలిచిన రికార్డును టీమిండియా మెరుగుపర్చుకుంది. వరుసగా తొమ్మిది విజయాలు సాధించి నాకౌట్ దశకు చేరుకుంది.
India Longest Winning Streaks In ODI World Cup 2023: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా అప్రతిహాత విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టింది. లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఏకపక్ష గెలుపులతో సాధికారికంగా నాకౌట్ దశకు చేరింది. ఈ దశలో ఎన్నో రికార్డులను అధిగమించింది. మరెన్నో రికార్డులను తిరగరాసింది. రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయస్స్ అయ్యర్, రాహుల్ బ్యాట్‌తో సత్తా చాటి రికార్డులను సృష్టించారు. బుమ్రా, షమీ, సిరాజ్‌కు ఈ ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ జైత్రయాత్రలో టీమిండియా మరో ఆరుదైన రికార్డును తన పేరిట లిఖించింది. ప్రపంచకప్‌లోని ఓ ఎడిషన్‌లో వరుసగా అత్యధిక మ్యాచులు గెలిచిన రికార్డును టీమిండియా మెరుగుపర్చుకుంది. ఇంతకుముందు 2003 టోర్నీలో భారత్ వరుసగా 8 మ్యాచులు గెలిచింది. ఈ సారి ఆ రికార్డును అధిగమించి వరుసగా తొమ్మిది విజయాలు సాధించి నాకౌట్ దశకు చేరుకుంది. 2003, 2007 ఎడిషన్‌లలో ఆస్ట్రేలియా వరుసగా 11 మ్యాచుల్లో గెలుపొందింది. ఇప్పటికే తొమ్మిది మ్యాచ్‌లు గెలిచిన రోహిత్ సేన మిగిలిన ఆ రెండు మ్యాచ్‌లు కూడా గెలిచి ప్రపంచకప్‌ను సాధించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
తొలి మ్యాచులో ఆస్ట్రేలియాను 6 వికెట్లతో ఓడించింది మొదలు.. నెదర్లాండ్స్‌ను 160 పరుగుల తేడాతో చిత్తు చేసే వరకూ టీమిండియా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అఫ్ఘానిస్థాన్‌పై 8 వికెట్లు, పాకిస్థాన్‌పై 7 వికెట్లు, బంగ్లాదేశ్‌పై 7 వికెట్లు, న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో వరుస విజయాలు సాధించింది. ఈ ప్రపంచకప్‌కే హైలెట్‌గా భావించిన మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ను 100 రన్స్, శ్రీలంకను 302 రన్స్, సౌతాఫ్రికాపై 243 రన్స్, నెదర్లాండ్స్‌పై 160 రన్స్ తేడాతో గెలుపొందింది. ఒక ఎడిషన్‌లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ఐదో స్థానంలో న్యూజిలాండ్ ఉంది. 2015 ఎడిషన్‌లో కివీస్ వరుసగా 8 మ్యాచుల్లో గెలిచింది.
ప్రపంచకప్‌లో భాగంగా నవంబర్ 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచులు జరగనున్నాయి. తొలి సెమీస్‌లో భారత్-న్యూజిలాండ్, రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియాలు తలపడతాయి. ఇందులో గెలిచిన జట్లు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. నవంబర్ 19న జరిగే తుది పోరుతో ఈ ఎడిషన్ విజేత ఎవరో తేలిపోనుంది.
ఇక వన్డే ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న భారత్.... మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లీగ్ దశలోని తొమ్మిది మ్యాచ్‌లను గెలిచి.. పూర్తి ఆత్మ విశ్వాసంతో నాకౌట్‌లో అడుగు పెట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు శ్రేయస్స్ అయ్యర్, రాహుల్ శతకాలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో250 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఏకపక్షంగా గెలిచినా నెదర్లాండ్స్ పోరాటం అభిమానులను ఆకట్టుకుంది.