IND W vs SA W Final: అమ్మాయిలు అదుర్స్.. ప్రపంచ చాంపియన్ గా టీమిండియా.. ఫైనల్లో సౌతాఫ్రికాపై గ్రాండ్ విక్టరీ.. దీప్తి, షెఫాలీ ఆల్ రౌండ్ షో..
భారత అమ్మాయిలు అదరగొట్టారు. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ ను సాధించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి, తొలిసారి ప్రపంచ విజేతగా నిలిచారు.

IND W vs SA W Final Womens World Cup 2025: అమ్మాయిలు సాధించారు. రెండుసార్లు అందకుండా పోయిన వన్డే ప్రపంచకప్ టోర్నీని ముచ్చటగా మూడోసారి ఒడిసి పట్టారు. సొంతగడ్డపై తొలిసారిగా ప్రపంచ చాంపియన్లుగా నిలిచారు. రెండేళ్ల కిందట సొంతగడ్డపై పురుషుల జట్టుకు వన్డే ప్రపంచకప్ లో ఎదురైన ఓటమికి బదులా అన్నట్లుగా ఈసారి మాత్రం అభిమానులకు గెలుపు రుచి చూపించారు. ఫైనల్లో సౌతాఫ్రికాపై 52 పరుగులతో ఘనవిజయం సాధించారు.
𝐂.𝐇.𝐀.𝐌.𝐏.𝐈.𝐎.𝐍.𝐒 🏆
— BCCI Women (@BCCIWomen) November 2, 2025
Congratulations to #TeamIndia on winning their maiden ICC Women's Cricket World Cup 🇮🇳
Take. A. Bow 🙌#WomenInBlue | #CWC25 | #Final | #INDvSA pic.twitter.com/rYIFjasxmc
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (78 బంతుల్లో 87, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచింది. అయాబోంగా ఖాక కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ లో 45.3 ఓవర్లలో 246 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వర్ట్ సూపర్ సెంచరీ (98 బంతుల్లో 101, 11 ఫోర్లు, 1 సిక్సర్) తో జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. దీప్తి శర్మకు ఐదు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో వన్డే ప్రపంచకప్ ను తొలిసారి భారత్ దక్కించుకుంది. దీంతో ఈ కప్పును గెలుచుకున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సరసన భారత్ నిలిచింది.
Tested by setbacks. Tempered by comebacks. Triumphant in glory.
— Star Sports (@StarSportsIndia) November 2, 2025
Team India - the new World Champions! 🏆🔥 pic.twitter.com/X7PBxrAhl3
అడ్డుగోడలా వోల్వర్ట్..
ఈ టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ వోల్వర్ట్ ఈ మ్యాచ్ లోనూ తన మార్కును చూపించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ జట్టు విజయం కోసం విఫలయత్నం చేసింది. మరో ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ (23)తో కలిసి తొలి వికెట్ కు 51 పరుగులు జోడించి మంచి పునాది వేసింది. వీరిద్దరూ ఆరంభంలో ఆచితూచి ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. అయితే లేని సింగిల్ కోసం ప్రయత్నించి, అమన్ జ్యోత్ విసిరిన త్రో కు బ్రిట్స్ రనౌట్ అయింది. ఆ తర్వాత అన్నేక బోష్ డకౌట్ కావడంతో ప్రొటీస్ ఒత్తిడిలో పడింది. ఈ దశలో సూనే లూస్ (25) తో కలిసి మళ్లీ ఇన్నింగ్స్ ను నిర్మించేందుకు లారా ప్రయత్నించింది. వీరిద్దరూ మూడో వికెట్ కు 52 పరుగులు జోడించడంతో భారత శిభిరంలో కాస్త ఆందోళన నెలకొంది.
సర్ప్రైజ్ ప్యాకేజ్..
జట్టులోకి సర్ప్రైజ్ గా వచ్చిన షెఫాలీ.. బంతితోనూ మాయ చేసింది. వరుస ఓవర్లలో లూస్, ప్రమాదకర మరిజానే కాప్ (4)ను ఔట్ చేయడంతో భారత్ పై చేయి సాధించింది. అయితే ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో మాత్రం లారా అడ్డుగోడలా నిలిచింది. 45 బంతుల్లోనే ఫిఫ్టీ చేసిన లారా.. మరింత దూకుడుగా బ్యాటింగ్ చేసింది. అన్నేరి డెర్క్ సన్ (35) తో కలిసి ఐదో వికెట్ కు 61 పరుగులు జోడించడంతో ప్రొటీస్ మ్యాచ్ లోకి వచ్చింది. ఈ దశలో దీప్తి మాయ చేసింది. డెర్క్సన్ క్యాచ్ ను నేలపాలు చేసిన దీప్తి.. తనే అద్భుతమైన యార్కర్ తో తనను ఔట్ చేసింది. ఆ తర్వాత సెంచరీ పూర్తి చేసుకున్న లారా.. కాసేపటికే ఔటయ్యింది. అమన్ జ్యోత్ కౌర్ లాంగాన్ లో అద్భుతమైన క్యాచ్ పట్టడంతో లారా ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత కాసేపటికే దీప్తి జోరుతోప్రొటీస్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. రెండు వికెట్లతోపాటు సూపర్బ్ ఫిఫ్టీతో సత్తా చాటిన షెఫాలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. దీప్తికి ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డు దక్కింది.




















