Harmanpreet Kaur: అంపైర్లపై హర్మన్‌ప్రీత్ ఆగ్రహం - మర్యాదగా మాట్లాడితే బాగుండేదన్న బంగ్లా కెప్టెన్
భారత్, బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య శనివారం ముగిసిన మూడో వన్డే డ్రా గా ముగిసింది. ఈ మ్యాచ్‌లో అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.
Harmanpreet Kaur: భారత మహిళల క్రికెట్ జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ తమ దేశ అంపైర్లను, సౌకర్యాలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ కెప్టెన్ నైగర్ సుల్తానా తీవ్రంగా స్పందించింది. ఢాకా వేదికగా శనివారం ముగిసిన మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ ఔట్‌తో పాటు అంపైర్ తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. దీంతో మ్యాచ్ ముగిశాక హర్మన్‌ప్రీత్.. ప్రెజెంటేషన్ వేడుకలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
పూర్ అంపైరింగ్..
ప్రెజెంటేషన్ సెర్మనీలో హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. ‘మేం ఈ మ్యాచ్ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాం. క్రికెట్ గురించే కాదు. ఇక్కడ అంపైర్లు వ్యవహరిస్తున్న తీరు మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మేం మరోసారి బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు ఇటువంటి అంపైరింగ్‌కు ముందుగానే ప్రిపేర్ అయి వస్తాం. మేం మ్యాచ్‌ను బాగానే కంట్రోల్ చేశాం. కానీ అంపైరింగ్ నిర్ణయాలు చాలా నిరాశపరిచాయి.. ఇక ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన మా ఇండియన్ హై కమిషన్‌కు కనీస గౌరవమివ్వలేదు. మీరు మా మ్యాచ్ చూసేందుకు వచ్చినందుకు (వారి వైపునకు చూస్తూ) కృతజ్ఞతలు..’అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
Indian Captain Harmanpreet Kaur blasts Bangladesh Cricket board, calls the umpiring and management pathetic.
— Roshan Rai (@RoshanKrRaii) July 22, 2023
She also exposed the board for insulting the members of the Indian high commission by not inviting them on the stage.
Sherni standing up for 🇮🇳 without any fear. pic.twitter.com/HNHXB3TvdW
మర్యాద పాటిస్తే బాగుండేది..
హర్మన్ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ కెప్టెన్ నైగర్ స్పందిస్తూ.. ‘ఒక క్రీడాకారిణిగా నేను చెప్పేది ఏంటంటే.. ఆమె కాస్త మర్యాదగా వ్యవహరిస్తే బాగుండేది. ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయం. దానిపై నేను ఏ విధమైన కామెంట్స్ చేయదలుచుకోలేదు. వాస్తవానికి హర్మన్ నిష్క్రమించి వెళ్లేప్పుడు అక్కడ జరిగిన సంభాషణ కూడా నాకు తెలుసు. నేను దానిని రివీల్ చేయను. పరిస్థితి బాగోలేదనే మేం అక్కడ్నుంచి దూరంగా వచ్చేశాం. క్రికెట్ అనేది చాలా మర్యాదపూర్వకమైన ఆట. అందుకే దీనిని జెంటిల్‌మెన్ గేమ్ అని కూడా అంటాం..’అని తెలిపింది.
The controversial dismissal of Harmanpreet Kaur #CricketTwitter #BANvIND pic.twitter.com/XEGdTMgRJd
— Female Cricket (@imfemalecricket) July 22, 2023
ఏం జరిగింది..?
ఢాకా వేదికగా భారత్ - బంగ్లాల మధ్య జరిగిన మూడో వన్డేలో అంపైరింగ్ నిర్ణయాలు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. 226 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. లక్ష్యం దిశగా సాగే క్రమంలో తడబడింది. హర్మన్‌ప్రీత్.. 21 బంతుల్లో 14 పరుగులు చేశాక నహిదా అక్తర్ వేసిన 33వ ఓవర్ నాలుగో బంతికి స్వీప్ షాట్ ఆడబోయింది. ఆ క్రమంలో బంతి స్లిప్ ఫీల్డర్ చేతిలో పడింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్.. ఎల్బీడబ్ల్యూగా ఔటిచ్చాడు. దీంతో హర్మన్ ఆవేశంతో తన బ్యాట్‌తో స్టంప్స్‌ను బాదింది. ఆ తర్వాత డగౌట్‌కు వెళ్తూ అంపైర్‌తో వాగ్వాదానికి దిగింది. బంతి.. ప్యాడ్ కంటే ముందే బ్యాట్‌కు తాకిందని ఆమె వాదన. అలా చూసినా అది ఔట్ కిందే లెక్క. అప్పటికే స్లిప్స్‌లో ఫీల్డర్ క్యాచ్ అందుకుంది. కాగా ఈ సిరీస్‌లో డీఆర్ఎస్ అందుబాటులో లేకపోవడంతో హర్మన్ నిష్క్రమించాల్సి వచ్చింది.
మ్యాచ్ టై, సిరీస్ డ్రా..
226 పరుగుల ఛేదనలో భారత్.. 45 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. విజయానికి ఐదు ఓవర్లలో 20 పరుగులు అవసరం అనగా బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడమే గాక సింగిల్స్‌ను అడ్డుకున్నారు. భారత్ కూడా క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. చివరి ఓవర్లో భారత విజయానికి 3 పరుగులు అవసరమవగా.. మేఘనా తొలి బంతికి సింగిల్ తీసింది. రెండో బంతికి రోడ్రిగ్స్ సింగిల్ తీయడంతో మూడో బంతిని మేఘనా ఎదుర్కుంది. మూడో బాల్.. మేఘనా బంతికి దగ్గరగా వెళ్తూ కీపర్ నైగర్ చేతిలో పడింది. బంగ్లా ఫీల్డర్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్ ఇచ్చారు. దీంతో మ్యాచ్ టై గా ముగిసింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 1-1 తో ఇరు జట్లూ పంచుకున్నాయి.