IND vs SL 1st T20 Highlights: బ్యాటింగ్లో బాదేసి, బౌలింగ్ లో కుమ్మేసి - తొలి T20లో లంకపై భారత్ ఘన విజయం
IND vs SL 1st T20I Live Score | శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఛాంపియన్ టీమిండియా ఘన విజయం సాధించింది. దాంతో సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది భారత్ జట్టు.
టీ20 సిరీస్‌లో భారత్ అదరగొట్టింది. విజయంతో సిరీస్ లో టీమిండియా బోణీ కొట్టింది. శ్రీలంకతో జరిగిన తొలి T20 మ్యాచ్‌లో బౌలర్లు అదరగొట్టారు. శ్రీలంకపై భారత్ జట్టు 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్ లో విజయంతో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. 26 బంతుల్లో 58 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 213 పరుగులు చేసి ప్రత్యర్థి లంకకు భారీ టార్గెట్ ఇచ్చింది. చేజింగ్ లో ఓ దశలో పటిష్టంగా కనిపించినా, చివర్లో భారత్ బౌలర్లు చెలరేగడంతో లంకకు ఓటమి తప్పలేదు. 19.2 ఓవర్లలో 170 రన్స్ కి లంక జట్టు all-out అయింది. టీమిండియా కోచ్ గా గంభీర్ విజయంతో మొదలుపెట్టాడు.
For leading from the front with the bat, #TeamIndia Captain Suryakumar Yadav becomes the Player of the Match 🏆👏
— BCCI (@BCCI) July 27, 2024
Scorecard ▶️ https://t.co/Ccm4ubmWnj… #SLvIND | @surya_14kumar pic.twitter.com/s2LGOFsrsw
టాస్ ఓడిన భారత్, ఓపెనర్ల శుభారంభం
తొలి టీ20లో టాస్ నెగ్గిన శ్రీలంక కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. టీమిండియాకు ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (40 పరుగుల; 21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (34 పరుగులు; 16 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) జట్టుకు అద్భుత ఆరంభానిచ్చారు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 74 పరుగుల మంచి భాగస్వామ్యం అందించాక.. వరుస బంతుల్లో గిల్, జైశ్వాల్ ఔటయ్యారు. 74 పరుగుల వద్ద 6వ ఓవర్ చివరి బంతికి గిల్, మరుసటి ఓవర్ తొలి బంతికి జైశ్వాల్ పెవిలియన్ చేరారు.
సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్
ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (58 పరుగులు; 26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) స్కోరు బోర్డును నడిపించాడు. కెప్టెన్ సూర్యకు కీపర్ రిషబ్ పంత్ (49 పరుగులు; 33 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) తోడవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కెప్టెన్ సూర్య కుమార్ తో పాటు పంత్, హార్ధిక్ పాండ్యా, రియాన్ పరాగ్ లను మతీశా పతిరాన ఔట్ చేశాడు. లేకపోతే భారత్ భారీ స్కోరు చేసేది. పాండ్యా (9), రియాన్ పరాగ్ (7), అక్షర్ పటేల్ 10 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 7 వికెట్లు నష్టానికి 213 పరుగులు చేసి లంకకు భారీ టార్గెట్ ఇచ్చింది. పతిరాన 4 వికెట్లు పడగొట్టాడు. దిల్షాన్, ఫెర్నాండో, హసరంగ తలో వికెట్ తీశారు.
లంకకు ఓపెన్లు శుభారంభం.. కానీ
భారీ టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఓపెనర్లు టీమిండియా బౌలింగ్ అటాక్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. పాథుం నిశాంక (79 పరుగులు; 48 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు), కుషాల్ మెండిస్ (45 పరుగులు; 27 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం అందించారు. అర్షదీప్ బౌలింగ్ లో మెండిస్ ఔటయ్యాడు. ఆపై దూకుడుగా ఆడుతూ సెంచరీ దిశగా వెళ్తోన్న నిశాంకను అక్షర్ బౌల్డ్ చేశాడు. ఓ దశలో శ్రీలంక 14 ఓవర్లకు 140/1 స్కోరుతో గెలుపు ఖాయమనుకున్నారు. నిశాంకతో పాటు కుశాల్ పెరీరా (20)ని సైతం అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో పెవిలియన్‌కు పంపాడు.
విజయం సాధిస్తుందనుకున్న లంక జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు లయ అందిపుచ్చుకోవడంతో లంక బ్యాటర్ వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో ముగ్గురు డకౌట్ అయ్యారు. ముగ్గురు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారంటే.. టీమిండియా బౌలర్లు ఏ స్థాయిలో చెలరేగి మ్యాచ్ గెలిపించారో అర్థం చేసుకోవచ్చు. అసలంక, శనక, మధుశంక డకౌట్ అయ్యారు. టాపార్డర్ రాణించడంతో లంక 19.2 ఓవర్లలో 170 రన్స్ చేసి ఆలౌటైంది. దాంతో 43 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. రియాన్ పరాగ్ 3 వికెట్లతో అదరగొట్టాడు, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీసి జట్టును గెలిపించారు.