IND vs NZ 3rd ODI: నేడు న్యూజిలాండ్ తో ఆఖరి వన్డే- భారత్ గెలిస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం!
న్యూజిలాండ్ తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ ను ఇప్పటికే 2-0తో దక్కించుకున్న టీమిండియా.. ఇప్పుడు క్లీన్ స్వీప్ పై కన్నేసింది. నేడు ఇండోర్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఆఖరిదైన మూడో వన్డే జరగనుంది.
IND vs NZ 3rd ODI: న్యూజిలాండ్ తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ ను ఇప్పటికే 2-0తో దక్కించుకున్న టీమిండియా.. ఇప్పుడు క్లీన్ స్వీప్ పై కన్నేసింది. మొదటి రెండు వన్డేల్లోనూ కివీస్ పై నెగ్గిన భారత్ మూడో వన్డేలోనూ నెగ్గి ప్రత్యర్థిని వైట్ వాష్ చేయాలని చూస్తోంది. నేడు ఇండోర్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఆఖరిదైన మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలుస్తుంది.
భారత్ ఆల్ ఓకే
ప్రస్తుతం టీమిండియా జట్టు అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా కనిపిస్తోంది. మొదటి వన్డేలో విజయం కోసం కాస్త కష్టపడ్డప్పటికీ.. రెండో వన్డేలో పూర్తి ఆధిపత్యంతో కివీస్ ను ఓడించింది. భారత టాపార్డర్ ఫుల్ ఫాంలో ఉంది. ముఖ్యంగా ఓపెనర్లు శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మలు మంచి ఫాంలో ఉన్నారు. అయితే శ్రీలంకపై చెలరేగిన కోహ్లీ ఈ సిరీస్ లో తన స్థాయి బ్యాటింగ్ చూపించలేదు. ఇక మిడిలార్డర్ కు ఇప్పటివరకు తన బ్యాటింగ్ పవర్ ను చూపించే అవకాశం రాలేదు. ఒకవేళ టాపార్డర్ విఫలమైతే వారెంత మేరకు రాణిస్తారో చూడాలి. బౌలింగ్ విషయానికొస్తే పేసర్లు, స్పిన్నర్లు సమష్టిగా రాణిస్తున్నారు. సిరాజ్ తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫాంలో ఉండగా.. రెండో వన్డేలో షమీ కూడా సత్తాచాటాడు. శార్దూల్, హార్దిక్ లు పర్వాలేదనిపిస్తున్నారు. స్పిన్నర్లు కుల్దీప్, వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది.
న్యూజిలాండ్ ఒక్కటైనా
వన్డేల్లో బలమైన జట్టుగా పేరున్న న్యూజిలాండ్ భారత్ చేతిలో వరుసగా 2 మ్యాచులు కోల్పోవడం ఆ జట్టుకు ఆందోళన కలిగించే విషయమే. ఇప్పుడు ఆ జట్టుపై క్లీన్ స్వీప్ గండం వేలాడుతోంది. కాబట్టి కివీస్ మరింత కసిగా ఆడుతుందనడంలో సందేహంలేదు. విలియమ్సన్ లేనప్పటికీ ఆ జట్టులో భీకరమైన బ్యాటర్లు ఉన్నారు. ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లేథమ్, డారిల్ మిచెల్, మైఖెల్ బ్రాస్ వెల్ లాంటి ఆటగాళ్లు తమ సత్తా మేరకు రాణించాల్సిన అవసరముంది. అలాగే బౌలింగ్ లోనూ ఇప్పటివరకు ఆ జట్టు తేలిపోయింది. ప్రధాన పేసర్ టిమ్ సౌథీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. టీమిండియా చేతిలో వైట్ వాష్ తప్పించుకోవాలంటే న్యూజిలాండ్ తన శక్తికి మించి పోరాడాల్సిందే.
సిరీస్ గెలిచినా గెలుపు కీలకమే
మూడో వన్డేలో గెలుపు ఇరు జట్లకు కీలకమైందే. ఇప్పటికే భారత్ సిరీస్ నెగ్గినా ఈ మ్యాచ్ లో గెలిస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం లభిస్తుంది. మరోవైపు వన్డేల్లో బలమైన జట్టుగా ఉన్న న్యూజిలాండ్ వైట్ వాష్ కు గురవడం ఆ జట్టుకు చేదు అనుభవమే అవుతుంది. కాబట్టి ఇందులో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని ఆ జట్టు ఆలోచిస్తోంది. కాబట్టి ఈ పోరు హోరాహోరీగా సాగుతుందనడంలో సందేహం లేదు.
ఎప్పుడు, ఎక్కడ చూడాలి
భారత్- న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ దూరదర్శన్, స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
పిచ్ ఎలా ఉంది?
మూడో వన్డే జరిగే ఇండోర్ మైదానం బ్యాటింగ్ కు అనుకూలం. అలాగే ఇక్కడ చిన్న బౌండరీలు ఉన్నాయి. కాబట్టి పరుగుల వరద పారడం ఖాయమే.
💬 💬 We have to prioritise certain formats at various stages: #TeamIndia Head Coach Rahul Dravid #INDvNZ pic.twitter.com/0pmJ4KEAJQ
— BCCI (@BCCI) January 23, 2023