KL Rahul Century: సెంచరీతో ఆదుకున్న కేఎల్ రాహుల్ - లార్డ్స్ టెస్టులో సచిన్ టెండూల్కర్ రికార్డ్ సమం
IND vs Eng KL Rahul Century | టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ 177 బంతుల్లో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లాండ్ గడ్డ మీద శతకంతో ఎలైట్ క్లబ్ లో చేరాడు.

IND vs Eng Lords Test Highlights | ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి తన అద్భుతమైన సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. కీలక సమయంలో సెంచరీతో మరోసారి క్లాస్ చూపించాడు. మొదటి టెస్టులో సెంచరీ సాధించిన రాహుల్ మూడో టెస్టులోనూ అదే ఫామ్‌ను కొనసాగిస్తూ కీలక సమయంలో శతక ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ తో కలిసి జట్టు ఇన్నింగ్స్ ను నడిపించాడు. క్రికెట్ మక్కాగా పిలిచుకునే లార్డ్స్ మైదానంలో మూడో రోజు ఆటలో భాగంగా శతకంతో మెరిశాడు. భారత ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్ గా నిలిచాడు రాహుల్.
కెఎల్ రాహుల్ మరో అద్భుత ప్రదర్శన
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ 177 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అద్భుతమైన షాట్ సెలక్షన్ తో పాటు చాలా కంట్రోల్డ్ గా బ్యాటింగ్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 బౌండరీలు ఉన్నాయి. సెంచరీ చేసిన వెంటనే 67.1 ఓవర్లలో ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ సెంచరీ ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో రాహుల్ సాధించిన రెండవ సెంచరీ, ఇది రెడ్-బాల్ క్రికెట్‌లో అతడి ఫామ్ ను చాటుతోంది.
ఇది లార్డ్స్‌లో కేఎల్ రాహుల్‌కు రెండవ సెంచరీ. కాగా, ఈ మైలురాయిని సాధించిన మొదటి భారత ఓపెనర్‌గా నిలిచాడు. రాహుల్ స్ట్రోక్‌ప్లేతో పాటు వికెట్ కాపాడుకుంటూ క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్(112 బంతుల్లో 74 పరుగులు)తో కలిసి నాలుగో వికెట్ కు 141 పరుగుల శతక భాగస్వామ్యం అందించాడు.
ఎలైట్ క్లబ్‌లో చేరిన రాహుల్
ఈ ఇన్నింగ్స్‌తో, కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన భారతీయ బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్ రికార్డు సమం చేశాడు. ఇద్దరూ ఇంగ్లీష్ గడ్డపై 4 టెస్ట్ సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లుగా నిలిచారు. రాహుల్ ద్రావిడ్ మాత్రమే ఇంగ్లాండ్ గడ్డమీద 6 టెస్ట్ సెంచరీలతో వారి కంటే ముందున్నాడు. విదేశీ పరిస్థితులలో రాహుల్ ప్రస్తుత ఫామ్ జట్టుకు కలిసొస్తుంది. జట్టుకు అవసరం ఉన్న సమయంలో తాను ఉన్నానంటూ కీలకమైన లార్డ్స్ టెస్టులో చేసిన సెంచరీ ఎప్పటికీ ప్రత్యేకమే.
వెంట వెంటనే పంత్, రాహుల్ ఔట్
లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (104) సెంచరీ, జేడీ స్మిత్, బైడెన్ కార్స్ హాఫ్ సెంచరీలతో పరవాలేదనిపించారు. భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా 5 వికెట్లతో రాణించాడు. నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ చెరో 2 వికెట్లు, జడేజా ఒక్క వికెట్ తీశాడు.
లంచ్ కు ముందు పంత్ వికెట్ కోల్పోయిన ఇండియా, లంచ్ తరువాత సెంచరీ వీరుడు రాహుల్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్ లో బ్రూక్ కు క్యాచిచ్చి ఔట్ కావడంతో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. టీమ్ ఇండియా (74.4 ఓవర్లలో 272/5) చిక్కుల్లో పడింది.
వేలి గాయంతో బాధపడుతున్న పంత్ గొప్ప పోరాట పటిమను ప్రదర్శించి 74 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రాహుల్ కెరీర్ లో 10వ టెస్ట్ సెంచరీ చేసిన వెంటనే ఔటయ్యాడు. జడేజా, నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేస్తున్నారు. క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ తలోవికెట్ వికెట్ తీయగా.. పంత్ రనౌటయ్యాడు.





















