Devdutt Padikkal: టీమిండియా పదిమందితోనే ఆడిందా?
IND vs ENG: క్రికెట్ నిబంధనల ప్రకారం ఒక ప్లేయర్ ఆట మధ్యలో గాయపడినా లేదా అనారోగ్యానికి గురైనా ప్రత్యర్థి కెప్టెన్ సమ్మతితో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌ను తీసుకునేందుకు అంపైర్ అనుమతినిస్తాడు. అయితే,
Ravichandran Ashwin replaced by Devdutt Padikkal : రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా(Team India)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తల్లి అనారోగ్యం కారణంగా స్టార్ స్పిన్నర్ అశ్విన్ (Spinner Ashwin)... మ్యాచ్ మధ్య నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. కుటుంబంలో తలెత్తిన మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో అతడికి జట్టుతో పాటు బోర్డు అండగా నిలుస్తుందని తెలిపింది.
అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు అశ్విన్ చెన్నైకి వెళ్లినట్లు బీసీసీఐ (BCCI) అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయాన్ని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ట్వీట్ చేశారు. అశ్విన్ తల్లి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానట్లు శుక్లా ట్వీట్ చేశారు. అశ్విన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించిన బీసీసీఐ... ఆటగాళ్ళ సంబంధికుల ఆరోగ్యం, శ్రేయస్సు చాలా ముఖ్యమైనదని ట్వీట్‌లో పేర్కొంది. అయితే అశ్విన్ స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అశ్విన్ స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశం ఉందా భారత జట్టు పదిమందితోనే ఆడాలా అన్నది చాలామందిలో ఆసక్తి రేపింది.
కేవలం ఫీల్డింగ్ మాత్రమే...
క్రికెట్ నిబంధనల ప్రకారం ఒక ప్లేయర్ ఆట మధ్యలో గాయపడినా లేదా అనారోగ్యానికి గురైనా సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌ను తీసుకునేందుకు అంపైర్ అనుమతినిస్తాడు. అత్యవసర పరిస్థితుల్లో ఏ ఆటగాడైనా జట్టును వీడితే ప్రత్యర్థి కెప్టెన్ సమ్మతితో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. అయితే, సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆటగాడు కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేయాలి. బౌలింగ్, బ్యాటింగ్‌కు అనుమతి లేదు. అంపైర్ల అనుమతితో వికెట్ కీపింగ్ చేయొచ్చు.
అశ్విన్ (Ravichandran Ashwin) అత్యవసర పరిస్థితుల్లో జట్టును వీడటంతో.. టీమ్‌ఇండియా ఇప్పుడు బెన్ స్టోక్స్ అనుమతితో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా దేవదత్ పడిక్కల్‌ను పెట్టుకుంది. అయితే పడిక్కల్ కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేయాలి. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు మాత్రమే బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఓ ఆటగాడు ఆన్ ఫీల్డ్‌లో గాయపడి మ్యాచ్ మొత్తానికి దూరమైతే అప్పుడు అతడి స్థానంలో కొత్త ప్లేయర్‌ను కంకషన్‌గా తీసుకునే అవకాశం ఉంది. కానీ, అశ్విన్ అలా వెళ్లలేదు కాబట్టి.. భారత జట్టుకు ఆ అవకాశం లేదు. అశ్విన్ దూరమవడంతో ప్రస్తుతం టీమ్‌ఇండియాకు ఫుల్‌టైమ్ బౌలర్లు నలుగురే ఉన్నారు.
యశస్వి శతక గర్జన
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్ పట్టు బిగించింది. రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ ఆధిపత్యం ప్రదర్శించగా... మూడోరోజు టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌లో బ్రిటీష్ జట్టును త్వరగానే అవుట్ చేసిన భారత జట్టు... అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా బ్యాటింగ్ చేసి టెస్ట్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ప్రస్తుతం 322 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్ చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి. యశస్వి జైస్వాల్ మరోసారి శతక గర్జన చేశాడు.