IND Vs BAN: బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డ భారత బ్యాటర్లు - ఏకంగా 400కు పైగా స్కోరు!
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఎనిమిది వికెట్లు నష్టపోయి 409 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (210: 131 బంతుల్లో, 24 ఫోర్లు, 10 సిక్సర్లు) డబుల్ సెంచరీ సాధించగా, విరాట్ కోహ్లీ (113: 91 బంతుల్లో, 11 ఫోర్లు, రెండు సిక్సర్లు) సెంచరీ చేశాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే అవుట్ కావడంతో భారత్ 15 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
ఇక ఇషాన్ కిషన్ అయితే బంగ్లాదేశ్ బౌలర్లకు పట్ట పగలే చుక్కలు చూపించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన రికార్డును సొంతం చేసుకున్నాడు. కేవలం 126 బంతుల్లోనే 200 స్కోరును ఇషాన్ అందుకున్నాడు. రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ సరసన చేరాడు. అయితే డబుల్ సెంచరీ అయిన కొద్ది సేపటికే ఇషాన్ కిషన్ అవుటయ్యాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటంతో ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో చోటు దొరికింది. ఝార్ఖండ్ డైనమైట్ ఈ అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకున్నాడు. ఆత్మవిశ్వాసం పెరిగాక ఇషాన్ కిషన్ ఇంకా రెచ్చిపోయాడు. షకిబ్, ఇబాదత్, తస్కిన్ సహా బౌలర్లందరికీ ఊచకోతను పరిచయం చేశాడు. కేవలం 85 బంతుల్లోనే కెరీర్లో తొలి సెంచరీ అందుకున్నాడు. అప్పటికీ తన ఆకలి తీరలేదు. గాయపడ్డ సింహం మాదిరిగా బ్యాటుతో గాండ్రించాడు. 16 బౌండరీలు, 8 సిక్సర్లతో 103 బంతుల్లోనే 150 మైలురాయికి చేరుకున్నాడు. మరోవైపు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అండతో వడివడిగా డబుల్ సెంచరీ వైపు అడుగులేశాడు. ముస్తాఫిజుర్ వేసిన 34.6వ బంతికి సింగిల్ తీసి ఎలైట్ కబ్ల్‌లో అడుగుపెట్టాడు. 126 బంతుల్లోనే ద్విశతకం అందుకున్నాడు. యంగెస్ట్, ఫాస్టెస్ట్ డబుల్ సెంచూరియన్‌గా రికార్డు సృష్టించాడు.
మరోవైపు విరాట్ కోహ్లీ కూడా ఇషాన్‌కు చక్కటి సహకారం అందించాడు. ఇదే క్రమంలో విరాట్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 190 బంతుల్లోనే 290 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే ఇషాన్ కిషన్ అవుటయ్యాక వచ్చిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ రాణించలేకపోయారు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఆఖర్లో మెరుపులు మెరిపించడంతో స్కోరు 400 మార్కును దాటింది. బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం నిలిచింది.
View this post on Instagram