Maha Kumbh 2025 : మహా కుంభమేళా 2025కు వెళ్లే 22 రైళ్ల జాబితా రిలీజ్ - పెరగనున్న కోచ్‌లు
Maha Kumbh 2025 : ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహా కుంభమేళా 2025 కోసం రైల్వే శాఖ 22 రైళ్ల జాబితాను విడుదల చేసింది. వాటి వివరాలను తాజాగా వెల్లడించింది.

Maha Kumbh 2025 : జనవరి 13, 2025 నుంచి ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహా కుంభమేళాకు అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. 45 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ఈ ఏడాది దాదాపు 45 కోట్ల భక్తులు తరలివస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ వేడుకలను పురస్కరించుకుని మహా కుంభమేళా భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రైల్వే శాఖ 22 రైళ్ల జాబితాను విడుదల చేసింది. ఈ రైళ్లు దేశంలోని వివిధ నగరాల నుండి నడవనున్నాయి. 2025 మహా కుంభమేళా సందర్భంగా 10వేల కంటే ఎక్కువ జనరల్, 3వేల కంటే ఎక్కువ ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వే సన్నాహాలు చేసినట్లు ఇటీవల రైల్వే తెలిపింది. ఈ 3వేల ప్రత్యేక రైళ్లలో 1800 రైళ్లు తక్కువ దూరానికి, 700 రైళ్లను సుదూర ప్రాంతాలకు, 560 రైళ్లను రింగ్ రైల్‌లో నడపనున్నారు.
ప్రయాగ్‌రాజ్‌కు స్పెషల్ ట్రైన్స్
జనవరి 13న పుష్య పౌర్ణమి మొదలుకుని, ఫిబ్రవరి 26న మహా శివరాత్రి వరకు ఈ కుంభమేళా జరుగుతుంది.12 ఏళ్లకోసారి జరిగే ఈ ఉత్సవానికి ఎప్పటిలానే దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రత్యేక రైళ్లపై స్పందించిన ప్రయాగ్‌రాజ్‌లోని ఉత్తర మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఉపేంద్ర చంద్ర జోషి.. ప్రయాగ్‌రాజ్-అయోధ్య-వారణాసి-ప్రయాగ్‌రాజ్, ప్రయాగ్‌రాజ్-సంగం ప్రయాగ్-జాన్‌పూర్-ప్రయాగ్-ప్రయాగ్‌రాజ్, గోవింద్‌పురి-ప్రయాగ్‌రాజ్-చిత్రకూట్-గోవింద్‌పు, ఝాన్సీ-గ్రోవ్‌రాజ్‌పూర్ చిత్రకూట్ -ఝాన్సీ మార్గాల్లో రింగ్ రైల్ కోసం ప్రణాళిక సిద్ధంగా ఉంది అని చెప్పారు. ప్రయాగ్‌రాజ్ జంక్షన్, సుబేదర్‌గంజ్, నైని, ప్రయాగ్‌రాజ్ చివ్కీ, ప్రయాగ్ జంక్షన్, ఫఫమౌ, ప్రయాగ్‌రాజ్ రాంబాగ్, ప్రయాగ్‌రాజ్ సంగం, ఝూన్సీతో సహా తొమ్మిది రైల్వే స్టేషన్‌లతో పాటు ఫెయిర్ ఏరియాలో మొత్తం 560 టికెటింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మహా కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని 15 రోజుల ముందు నుంచే రైల్వే టిక్కెట్లు తీసుకునే సౌకర్యాన్ని రైల్వే కల్పించిందని జోషి చెప్పారు. ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌లో ఆరు పడకల 'అబ్జర్వేషన్ రూం' ఏర్పాటు చేశామని, ప్రయాణికులకు వైద్య సహాయం అందించేందుకు ఆక్సిజన్ సిలిండర్, ఈసీజీ మిషన్, గ్లూకోమీటర్, నెబ్యులైజర్, స్ట్రెచర్ తదితర అన్ని రకాల పరికరాలను అందుబాటులో ఉంచామని జనరల్ మేనేజర్ తెలిపారు.
రైళ్లలో పెరగనున్న కోచ్ ల సంఖ్య
మహా కుంభమేళా 2025కి చేరుకోవడం ఇప్పుడు మరింత సులభమైపోయింది. భక్తుల రద్దీ దృష్ట్యా భారతీయ రైల్వే ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే ప్రధాన రైళ్లలో కోచ్‌లను పెంచబోతోంది. ఇందులో ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్, లక్నో మెయిల్ వంటి రైళ్లు ఉన్నాయి. దీని వల్ల కాన్పూర్-ఢిల్లీ మార్గం నుండి వచ్చే భక్తులు ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో సంగమ్‌నగర్‌కు సులభంగా చేరుకోవచ్చు. అదే సమయంలో, లక్నో నుండి వచ్చే భక్తులు లక్నో మెయిల్ ద్వారా ప్రయాగ్‌రాజ్‌కు రాగలరు. భారతీయ రైల్వే ప్రకారం, ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ప్రస్తుతం నడుస్తోన్న ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్, లక్నో మెయిల్‌లలో త్వరలో ఒక్కో కోచ్‌ను పెంచనున్నారు. కొన్ని స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ పొడవు తక్కువగా ఉంటుంది. కావున ఈ రైళ్లలో 23 కోచ్‌లు ఉంటాయి. ఇప్పుడు ప్లాట్‌ఫాం పొడవు ఎక్కువైంది. కావున 24 కోచ్‌లను ఏర్పాటు చేసేందుకు రైల్వేల నుంచి ఆమోదం కూడా లభించింది. ఇక ప్రయాణీకుల సౌకర్యార్థం ప్రయాగ్ జంక్షన్, ఫాఫమౌ, ప్రయాఘట్ సంగం స్టేషన్లలో సహయోగ్ కౌంటర్, ఖోయా పాయా కౌంటర్, ATVM, ఫుడ్ ప్లాజా, రిఫ్రెష్‌మెంట్ రూమ్, డిజిటల్ లాకర్ మరియు క్లాక్ రూమ్, మొబైల్ ఛార్జింగ్ కియోస్క్, ఏటీఎం (ATM), ఏసీ (AC) వెయిటింగ్ రూమ్ , బేబీ ఫీడింగ్ రూమ్ సహా అనేక ఏర్పాట్లు చేశారు.
వర్చువల్ పద్ధతిలో టిక్కెట్స్ బుకింగ్
టిక్కెట్స్ బుకింగ్ లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా రైల్వే శాఖ వర్చువల్ బుకింగ్ (Online QR Code)ను అందుబాటులోకి తెచ్చింది. రైల్వేశాఖ వాలంటీర్ల కోసం క్యూఆర్ స్కానర్లతో కూడిన జాకెట్లు, టీషర్ట్ లను అందివ్వనుంది. వీటి మీద ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఈజీగా టికెట్ బుక్ చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది. రైల్వే వాలంటీర్లు ధరించిన టీషర్టులు, జాకెట్ల మీద ఉన్న QR కోడ్‌ని స్కాన్ చేసుకుని.. మొబైల్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. టిక్కెట్స్ కోసం క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఈ కోడ్ స్కానర్ ఉపయోగపడుతుంది. ఈ విధానంతో రోజుకు 10 లక్షల డిజిటల్ టికెట్లను పొందే అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం.





















