Asia Cup 2023: మాతో ఆడకుంటే టీమిండియా నరకానికి పోతుంది - జావేద్ మియాందాద్ షాకింగ్ కామెంట్స్
ఆసియా కప్ ఆడేందుకు తమ దేశానికి రానని తెగేసి చెప్పిన భారత క్రికెట్ జట్టుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Asia Cup 2023: ఆసియా కప్ - 2023 నిర్వహణ వివాదం ముగిసి ఈ టోర్నీని సక్సెస్ చేసేందుకు పాకిస్త్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తో పాటు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ) లు సన్నాహకాలు చేస్తున్న వేళ పాకిస్తాన్ దిగ్గజం జావేద్ మియందాద్ టీమిండియాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. భద్రతా కారణాలను చెప్పి పాకిస్తాన్‌కు రాకుండా ఉన్నందుకు టీమిండియా నరకానికి పోతుందని ఘాటుగా వ్యాఖ్యానించాడు. పీసీబీ కూడా ప్రతీదానికి తలొగ్గుతూ దేశం పరువు తీస్తుందని వాపోయాడు.
మియాందాద్ మాట్లాడుతూ.. ‘2012లో పాకిస్తాన్ జట్టు ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు ఇండియాకు వెళ్లింది. 2016 లో కూడా టీ20 ప్రపంచకప్ కూడా అక్కడే జరిగితే పాక్ అక్కడ ఆడింది. ఇప్పుడు పాకిస్తాన్‌కు రావడం భారత్ వంతు. నాకే గనక నిర్ణయాధికారం ఉంటే పాకిస్తాన్ భారత్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడేందుకు అనుమతించను. త్వరలో భారత్ వేదికగానే జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌కు కూడా పంపించను..
మేం ఇండియాతో ఆడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. కానీ వాళ్లు (టీమిండియా) మాత్రం మాలాగా సానుకూల స్పందన ఉండదు. పాకిస్తాన్ క్రికెట్ పెద్దది. మేం ఇప్పటికీ మెరుగైన ఆటగాళ్లను ప్రపంచ క్రికెట్‌కు అందిస్తున్నాం. మాతో ఆడటానికి వాళ్లు (ఇండియా) ఇక్కడికి రాకుంటే నరకానికి పోతారు. మనం వన్డే వరల్డ్ కప్‌లో ఆడకున్నా పెద్దగా నష్టమేమీ లేదు..’అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.
"Pakistan's cricket is better than India's. India can go to hell if they do not want to come here. Pakistan should refuse to travel to India for the World Cup," Javed Miandad.
— Farid Khan (@_FaridKhan) June 18, 2023
Miandad has criticised Narendra Modi as well. #CWC23 #AsiaCup2023 pic.twitter.com/Ulo23pPACn
ఇరు దేశాల మధ్య క్రికెట్ ఒక వారధి అని మియాందాద్ అభిప్రాయపడ్డాడు. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు సహకరించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని.. రెండు దేశాల మధ్య అపార్ధాలను తొలగించగల గొప్ప సాధనం క్రికెట్ అని మియాందాద్ తెలిపాడు. కానీ ఆసియా కప్ కోసం బీసీసీఐ.. తమ జట్టును పాకిస్తాన్‌కు పంపకూడదనే నిర్ణయంతో తాము కూడా వన్డే వరల్డ్ కప్ లో భారత్ కు వెళ్లాలా..? వద్దా..? అన్నదానిపై బలమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నాడు.
కాగా ప్రపంచకప్ లో పాకిస్తాన్ భారత్‌కు వస్తుందా..? రాదా..? అన్న అంశంపై ఇటీవలే పీసీబీ చీఫ్ నజమ్ సేథీ మాట్లాడుతూ.. ‘భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌లకు సంబంధించి మేం (బీసీసీఐ, పీసీబీ) సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. అది ప్రభుత్వాల చేతుల్లో ఉన్న అంశం. ఆసియా కప్ ఆడేందుకు తమకు భద్రతా కారణాలున్నాయన్న బీసీసీఐ పరిస్థితిని మేం అర్థం చేసుకోగలం. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ లో మా పరిస్థితి కూడా అంతే.. మేం అక్కడికి వెళ్లాలన్నా మా ప్రభుత్వం అనుమతించాలి...
అహ్మదాబాద్‌లో ఆడతామా..? లేదా..? అన్న దానికంటే ముందు మేం అక్కడికి వెళ్తామా..? లేదా..? అన్నది మా ప్రభుత్వం తేల్చాలి. ఒకవేళ ప్రభుత్వం అనుమతించకుంటే మాత్రం అక్కడికి వెళ్లి ఎలా ఆడగలం..? ఇదే విషయంపై మేం గతంలో కూడా మా నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పాం. మా ప్రభుత్వం నిర్ణయంపై మా నిర్ణయం ఆధారపడి ఉంటుంది..’అని చెప్పిన విషయం తెలిసిందే.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial