ఆ మాట ధోని చెప్పాడా..? సీఎస్కే కెప్టెన్ రిటైర్మెంట్‌పై చహర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Deepak Chahar on Dhoni: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి, అభిమానులు ముద్దుగా ‘తాలా’ అని పిలుచుకునే మహేంద్రసింగ్ ధోని ఈ సీజన్ తర్వాత రిటైర్ అవబోతున్నాడా..?
మహేంద్రసింగ్ ధోని.. పరిచయం అక్కర్లేని పేరు. సుదీర్ఘకాలం పాటు జాతీయ జట్టుకు సేవలందించి 2020లో ఎవరూ ఊహించని సమయంలో రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే త్వరలో జరుగబోయే ఐపీఎల్ సీజనే ధోనికి చివరిది అని.. 2023 లోనే ధోని ఈ లీగ్ కు గుడ్ బై చెప్పనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కొనసాగింపా అన్నట్టుగా ధోని కూడా తన చివరి మ్యాచ్ చెన్నైలోనే ఆడతానని చెప్పడం.. అది ఇదే సీజన్ లో అని కూడా సీఎస్కే వర్గాలు కామెంట్స్ చేయడంతో ధోనికి ఇదే చివరి సీజన్ అన్న ప్రచారం సాగుతోంది.
బయట ఫ్యాన్స్ లోనే గాక ఐపీఎల్ లో టీవీ ప్రసార హక్కులు దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ కూడా ‘ధోని ఫేర్‌వెల్ సీజన్’ అని ప్రచారం చేస్తుండటంతో 2023 సీజనే సీఎస్కే సారథికి చివరిదని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై బౌలర్ దీపక్ చహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా తప్పుడు ప్రచారమేనని, అసలు రిటైర్మెంట్ గురించి ధోని గానీ టీమ్ మేనేజ్మెంట్ గానీ ఏమైనా చెప్పిందా..? అని ప్రశ్నించాడు.
అది ధోనికే తెలుసు : చహర్
ధోని రిటైర్మెంట్ గురించి చహర్ తాజాగా ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘ధోనికి ఇదే చివరి సీజన్ అని ఎవరు చెప్పారు..? వాస్తవానికి ధోని కూడా దాని గురించి ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. నాకు తెలిసి మహీ భాయ్ మరికొన్నాళ్లు ఐపీఎల్ ఆడతాడు. అతడు ఇప్పటికీ చాలా ఫిట్ గా ఉన్నాడు. ఆడాలని నేను కోరుకుంటున్నా. ఇక రిటైర్మెంట్ గురించి ధోనికే తెలుసు. టెస్టు క్రికెట్ లో ఎవరూ ఊహించని టైమ్ లో రిటైర్మెంట్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ కూ అలాగే ప్రకటించాడు. నా వరకైతే నేను ధోని మరికొన్నాళ్లు ఆడాలని కోరుకుంటున్నా.. ధోని సారథ్యంలో ఆడేందుకు చాలా మంది క్రికెటర్లు కలలు కంటారు. నాకు చాలా చిన్న వయసులోనే ఆ కల నెరవేరింది...’అని చెప్పాడు.
కాగా ఐపీఎల్- 16 కోసం ఇప్పటికే చెన్నై క్యాంప్ లో చేరిన ధోని.. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఐపీఎల్ లో ధోని బ్యాటింగ్ లో కూడా ఇరగదీస్తాడని అతడి అభిమానులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు.
Whistles are the order of this Summer! 🥳📆#TATAIPL #WhistlePodu 🦁💛 pic.twitter.com/VoAzUmDyEy
— Chennai Super Kings (@ChennaiIPL) February 17, 2023
వాస్తవానికి 2020 సీజన్ నుంచే ధోని రిటైర్మెంట్ గురించి జోరుగా చర్చ సాగుతోంది. ఆ సమయంలో ఓ కామెంటేటర్ ‘ఈ సీజన్ తర్వాత మీరు రిటైర్ అవబోతున్నారా..?’ అని ప్రశ్నించగా దానికి ధోని.. ‘డెఫినెట్లీ నాట్’అని చెప్పాడు. ఆ తర్వాత 2022లో రవీంద్ర జడేజాకు సారథ్య పగ్గాలు అప్పజెప్పడం, కానీ ఆ సీజన్ లో జడ్డూ అనుకున్నస్థాయిలో జట్టును నడిపించలేక అర్థాంతరంగా సీజన్ మధ్యలోనే వాటిని వదిలేసి తిరిగి ధోనికే అప్పగించాడు. దీంతో ధోని మళ్లీ కెప్టెన్ గా వచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరగడంతో చెన్నై ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశచెందారు.
అయితే ఈసారి మాత్రం తప్పకుండా ట్రోఫీ నెగ్గాలని, తద్వారా ధోనికి ఘనమైన వీడ్కోలునివ్వాలని ఆ జట్టు భావిస్తోంది. ఐపీఎల్-16లో చెన్నై-గుజరాత్ ల మధ్య మార్చి 31న జరిగే మ్యాచ్ తో ఈ సీజన్ మొదలుకానుంది.