Virat Kohli on Babar Azam: నిజమే..! అన్ని ఫార్మాట్లలో బాబర్ ఆజామ్ గ్రేట్ అంటున్న కోహ్లీ!
Virat Kohli on Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. మూడు ఫార్మాట్లలో రాణిస్తున్న టాప్ బ్యాటర్ అతడేనని పొగిడేశాడు.
Virat Kohli on Babar Azam:
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో రాణిస్తున్న టాప్ బ్యాటర్ అతడేనని పేర్కొన్నాడు. అతడి ఆటను ఎప్పుడూ ఆస్వాదిస్తానని అంటున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో అతడితో తొలిసారి మాట్లాడానని గుర్తు చేసుకున్నాడు.
క్రికెట్ అంటేనే జెంటిల్‌మెన్ గేమ్! మ్యాచుల్లో ఎంత కొట్లాడినా ఆట ముగియగానే హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటారు. ఆ తర్వాత కాసేపు కలిసి మాట్లాడుకుంటారు. దేశాల మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ ఆటగాళ్లు మాత్రం సోదర భావంతోనే మెలుగుతారు. సాధారణంగా విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి పాకిస్థాన్ ఆటగాళ్లు మాట్లాడుకోవడం చూస్తుంటాం. అలాగే అతడిని పొగడుతుంటూ ఆనందిస్తుంటాం. కానీ కింగ్ కోహ్లీ అవతలి వాళ్ల గురించి ఆదర్శంగా మాట్లాడటం అరుదే.
బాబర్ ఆజామ్‌తో (Babar Azaam) అనుబంధం గురించి విరాట్ కోహ్లీ తొలిసారి వెల్లడించాడు. '2019 వన్డే ప్రపంచకప్‌లో మాంచెస్టర్ మ్యాచ్ తర్వాత తొలిసారి బాబర్ ఆజామ్‌తో మాట్లాడాను. అండర్ 19 ప్రపంచకప్ నుంచే నాకు ఇమాద్ తెలుసు. బాబర్ నాతో మాట్లాడాలని అనుకుంటున్నట్టు అతడే నాకు చెప్పాడు. ఆ తర్వాత మేమిద్దరం కలిసి చాలాసేపు మాట్లాడుకున్నాం. అతడు నాతో ఎంతో ఆప్యాయంగా, గౌరవంగా మాట్లాడాను. తొలిరోజు నుంచీ అతడు ఇలాగే మాట్లాడటం నాకు తెలుసు' అని విరాట్ కోహ్లీ అన్నాడు.
'నిజాయతీగా చెప్పాలంటే ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఆడుతున్న టాప్ ఆటగాడు బాబర్. అతడు చాలా నిలకడగా ఆడతాడు. అతడి ఆటను నేనెంతో ఆస్వాదిస్తాను' అని విరాట్ వివరించాడు. వీరిద్దరూ కొన్నాళ్లుగా ఒకర్నొకరు గౌరవించుకుంటూ మాట్లాడుకోవడం తెలిసిందే.
ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో బాబర్ ఆజామ్ ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్నాడు. ఇప్పటి వరకు 104 టీ20లు, 100 వన్డేలు, 49 టెస్టులు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 12,346 పరుగులు, 30 సెంచరీలు కొట్టాడు. వన్డేల్లో అతడు క్రీజులో దిగిన ప్రతిసారీ అంచనా భారీగా ఉంటున్నాయి. అందుకు తగ్గట్టే అతడు రాణిస్తున్నాడు. అంత ఈజీగా ఔటవ్వడు. ఈ ఫార్మాట్లో 60 సగటుతో 5000 పైగా పరుగులు చేశాడు.
మరోవైపు విరాట్ కోహ్లీ 111 టెస్టుల్లో 29 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీల సాయంతో 8,676 పరుగులు చేశాడు. 275 వన్డేల్లో 46 సెంచరీలు, 65 అర్ధ శతకాలు కొట్టాడు. 12,898 పరుగులు సాధించాడు. ఇక 115 టీ20ల్లో ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీల సాయంతో 4008 రన్స్ అందుకున్నాడు. మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిసి 25,000కు పైగా పరుగులు సాధించాడు. 76 సెంచరీలు బాదేసి ఆల్‌టైమ్ గ్రేట్ జాబితాలో చేరాడు. సచిన్ తెందూల్కర్ 34,357 పరుగులు, 100 సెంచరీల మార్క్ అందుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు.
టీమ్‌ఇండియా, పాకిస్థాన్ (IND vs PAK) ఎప్పుడు ఆడినా ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటుంది. ఆసియాకప్‌లో భాగంగా ఈ రెండు జట్లూ మూడు మ్యాచుల్లో తలపడే అవకాశం ఉంది. లీగ్ దశలో ఒకసారి, సూపర్ 4లో మరోసారి ఆడటం ఖాయమే. అన్నీ కుదిరితే ఫైనల్ ఆడతాయి. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌లో అహ్మదాబాద్‌లో తలపడతాయి.