(Source: ECI/ABP News/ABP Majha)
Axar Patel: శ్రీలంకకు ఆ జయసూర్య, భారత్‌కు ఈ జయసూర్య - అక్షర్ పటేల్‌పై ప్రశంసలు
T20 World Cup 2024 Final IND vs SA: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. టీం లో బాపు అని ముద్దుగా పిలుచుకొనే అక్షర్ పటేల్ అదరగొట్టాడు.
Axar Patel the Jayasuriya of Nadiad: చిన్నప్పుడు స్పిన్ బౌలింగ్ చేయాలంటే విముఖత చూపినవాడు... భారత్‌కు ప్రపంచకప్ అందించాడు. బంతిని బలంగా కొట్టడాన్ని ఇష్టపడిన వాడు.. ఇప్పుడు అదే ఊపుతో బంతిని బాది టీ 20 ప్రపంచకప్‌ను గెలిపించాడు. చిన్నతనంలో తల్లి, అమ్మమ్మ క్రికెట్ ఆడటానికి అభ్యంతరం చెప్తే దొంగచాటుగా క్రికెట్ ఆడిన వాడు... ఇప్పుడు అదే క్రికెట్‌తో తన పేరు మార్మోగేలా చేశాడు. అతనే అక్షర్ పటేల్(Axar Patel). బక్క పలుచగా ఉన్న అక్షర్... ఇప్పుడు టీమిండియాలో అసలైన ఆల్‌రౌండర్. అక్షర్ పటేల్‌కు టీ 20 ప్రపంచకప్‌లో చోటు దక్కినప్పుడు అన్నీ విమర్శలే. వాషింగ్టన్ సుందర్-అక్షర్ పటేల్‌లో ఎవరిని జట్టులోకి తీసుకోవాలా అనే విషయంలో భారత సెలెక్టర్ల మధ్య తీవ్ర చర్చోపచర్చలు జరిగాయి. చివరికి అక్షర్‌కు చోటు దక్కింది.
ఆల్‌రౌండర్ కోటాలో జట్టులో చోటు దక్కించుకున్న అక్షర్... అదే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు. ప్రపంచ కప్ ఫైనల్‌లో టాప్ ప్లేయర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, పంత్ అవుటై తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు... విరాట్ వికెట్ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న వేళ.. అక్షర్ అద్భుతం చేశాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన కగిసో రబడా బౌలింగ్‌లో అక్షర్ కొట్టిన సిక్స్ అయితే అతని ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. విపరీతమైన ఒత్తిడిలో ప్రపంచకప్ ఫైనల్లో ఎదురుదాడికి దిగి భారత్‌కు గెలుస్తామన్న ఆత్మ విశ్వాసాన్ని అందించిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.