Asia Cup 2023: కరుణించని క్యాండీ - ఆసియా కప్ వేదికలలో మార్పులు! - సూపర్ - 4, ఫైనల్ అక్కడేనా?
వరుణుడు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న శ్రీలంకలో మ్యాచ్‌లు వర్షార్పణం అవుతున్న నేపథ్యంలో ఆసియా కప్ వేదికలు మారనున్నాయి.
Asia Cup 2023: ఆసియా కప్ - 2023లో వేదికలు మారనున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. నేడు పాకిస్తాన్ లోని లాహోర్ వేదికగా శ్రీలకం - అఫ్గానిస్తాన్ వేదికగా జరుగబోయే చివరి లీగ్ మ్యాచ్ తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. పాకిస్తాన్‌తో పాటు శ్రీలంక కూడా ఆతిథ్యమిస్తున్న ఆసియా కప్‌లో గ్రూప్ మ్యాచ్‌లు పల్లెకెలె (క్యాండీ) లో, కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో సూపర్-4 మ్యాచ్ లు జరిగేందుకు షెడ్యూల్ వచ్చినా అందులో మార్పులు ఉండనున్నాయని తెలుస్తున్నది. ఈ రెండు దశల మ్యాచ్‌లను కొలంబో నుంచి హంబన్‌టోటాకు మారనున్నట్టు సమాచారం.
కారణమిదే..
గత శనివారం ప్రపంచ క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడమే గాక ఇండియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత అస్సలు ఆడే అవకాశమే ఇవ్వలేదు. సోమవారం భారత్ - నేపాల్ మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితి. ఫలితం తేలిన ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా ఓవర్లను కుదించాల్సి వచ్చింది. అయితే సూపర్-4 మ్యాచ్‌లతో పాటు ఫైనల్ కొలంబో వేదికగా జరగాల్సి ఉన్నా అక్కడ కూడా వానలు దంచికొడుతున్నాయి. ఇది క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నది. సెప్టెంబర్‌లో క్యాండీ, కొలంబోలో వర్షాలు పడతాయని ముందస్తుగా తెలిసిన ఇక్కడ మ్యాచ్‌లను నిర్వహించ తలపెట్టినందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)పై దుమ్మెత్తిపోస్తున్నారు.
హంబన్‌టోటానే ఏకైక మార్గం..
సూపర్ - 4 తో పాటు ఫైనల్ జరుగనున్న కొలంబోలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. శ్రీలంక దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ఈ రెండు నగరాలను వానలు ముంచెత్తుతున్నాయి. అయితే కొలంబోలో రాబోయే పది రోజులలో వర్షాలు పడే అవకాశాలు 50 నుంచి 60 శాతంగా ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనాలు చెబుతున్నాయి. దీంతో ఇక్కడ కూడా పల్లెకెలె పరిస్థితులు తప్పవని ఏసీసీ అధికారులు భావిస్తున్నారు. అలా కాకుండా హంబన్‌టోటాలో నిర్వహిస్తే బెటర్ అన్న అభిప్రాయానికి ఏసీసీ వచ్చినట్టు తెలుస్తున్నది. హంబన్‌టోటాలో ప్రస్తుతానికి వర్షాలు లేకున్నా సెప్టెంబర్‌లో అక్కడ వర్షాలు కురిసే అవకాశాలు 20 శాతం మాత్రమే ఉండటం కాస్త తెరిపినిచ్చేదే. సూపర్ - 4తో పాటు ఫైనల్ కూడా ఇక్కడే నిర్వహించేందుకు ఏసీసీ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం.
Super 4 matches of the Asia Cup will happen at Hambantota. [Dainik Jagran] pic.twitter.com/3iIPB4uIDR
— Johns. (@CricCrazyJohns) September 4, 2023
అంత సామర్థ్యం ఉందా..?
ఆసియా కప్‌ను హంబన్‌టోటాకు తరలించేందుకు సిద్ధమైనా అక్కడ లాజిస్టిక్ సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. సూపర్ - 4లో భారత్ - పాక్‌తో పాటు గ్రూపన్ - బీ నుంచి కూడా భారీ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే సామర్థ్యం హంబన్‌టోటాకు ఉందా..? అన్న అనుమానాలు కూడ తలెత్తుతున్నాయి. దీనిపై ఏసీసీ కూడా యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నది. ఈ టోర్నీలో భాగంగా శ్రీలంకతో తదుపరి మ్యాచ్ జరిగేది ఈనెల 9న.. గ్రూప్ - బి నుంచి సూపర్ - 4కు వెళ్లబోయే జట్లు సెప్టెంబర్ 9న తలపడాల్సి ఉంది. ఆ లోపు అక్కడ ఏర్పాట్లను పూర్తిచేయాలని ఏసీసీ భావిస్తున్నది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial