BAN Vs PAK, Innings Highlights: పాక్ పేసర్ల ధాటికి బంగ్లా విలవిల - 193కే ఆలౌట్
BAN Vs PAK: ఆసియాకప్ 2023లో పాకిస్థాన్ దూసుకుపోతోంది. గడాఫీ స్టేడియంలో జరుగుతున్న పోరులో బంగ్లాదేశ్ 38.4 ఓవర్లకు 193 పరుగులకే కుప్పకూలింది.
BAN Vs PAK, Innings Highlights:
ఆసియాకప్ 2023లో పాకిస్థాన్ దూసుకుపోతోంది. మొదటి సూపర్ 4 మ్యాచులో అదరగొడుతోంది. ఆ జట్టు పేసర్ల ధాటికి ప్రత్యర్థులు బెంబేలెత్తుతున్నారు. రాకెట్ వేగంతో వస్తున్న బంతుల్ని ఎదుర్కోవడంలో తడబడుతున్నారు. గడాఫీ స్టేడియంలో జరుగుతున్న పోరులో బంగ్లాదేశ్ 38.4 ఓవర్లకు 193 పరుగులకే కుప్పకూలింది. హ్యారిస్ రౌఫ్ (4), నసీమ్ షా (3) దెబ్బకు విలవిల్లాడింది. బంగ్లాలో కెప్టన్ షకిబ్ అల్ హసన్ (53; 57 బంతుల్లో 7x4), ముష్ఫికర్ రహీమ్ (64; 87 బంతుల్లో 5x4) హాఫ్ సెంచరీలు బాదేశారు.
బాబోయ్.. పాక్ పేసర్లు!
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ భారీ స్కోరు చేయాలని అనుకుంది మెరుగైన టార్గెట్ ఇచ్చి పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టాలని భావించింది. కానీ వారి వ్యూహాన్ని పాక్ పేసర్లు పటా పంచలు చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ అల్లాడించారు. పరుగుల ఖాతా తెరవకముందే మెహదీ హసన్ మిరాజ్ (0)ను నసీమ్ షా ఔట్ చేశాడు. ఈ క్రమంలో మహ్మద్ నయీమ్ (20), లిటన్ దాస్ (16) నిలకడగా ఆడారు. క్రీజులో కుదురుకున్నారులే అనుకుంటుండగానే వీరిద్దరినీ పాక్ పెవిలియన్ పంపించింది. జట్టు స్కోరు 31 వద్ద లిటన్‌ను అఫ్రిది, 45 వద్ద నయీమ్, 47 వద్ద హృదయ్ (2)ను హ్యారిస్ రౌఫ్ ఔట్ చేశాడు.
శ్రమించిన షకిబ్, ముషి
పీకల్లోతు కష్టాల్లో పడ్డ బంగ్లాను కెప్టెన్ షకిబ్, సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ ఆదుకున్నారు. ఆచితూచి ఆడుతూనే పరుగులు రాబట్టారు. సింగిల్స్, డబుల్స్ తీశారు. అందివచ్చిన బంతుల్ని బౌండరీకి పంపించారు. ఐదో వికెట్‌కు 120 బంతుల్లో 100 పరుగుల భాగస్వామ్యం అందించారు. షకిబ్ 53 బంతుల్లో, ముషి 71 బంతుల్లో హాఫ్ సెంచరీలు అందుకున్నారు. వీరిద్దరూ బంగ్లా స్కోరు బోర్డు పరుగెత్తించే దశలో ఫమీమ్ అఫ్రామ్ షాకిచ్చాడు. జట్టు స్కోరు 147 వద్ద షకిబ్‌ను పెవిలియన్ పంపించాడు. మరికాసేపటికే షామిమ్ హుస్సేన్ (16) ఔటయ్యాడు. 190 వద్ద ముషిని రౌఫ్ ఔట్ చేయడంతో బంగ్లా టైగర్స్ పని ముగిసింది. మిగతా టెయిలెండర్లు వరుసగా ఔటవ్వడంతో స్కోరు 193కు చేరుకుంది.
బంగ్లాదేశ్: మహ్మద్ నయీమ్, హసన్ మిరాజ్, లిటన్ దాస్, తౌహిద్ హృదయ్, షకిబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, షమీమ్ హుస్సేన్, అఫిఫ్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, హసన్ మహ్మద్
పాకిస్థాన్: ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హఖ్, బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రౌఫ్
'మేం మొదట బ్యాటింగ్ చేస్తాం. ఎండ వేడిమి మినహాయిస్తే మరో కారణమేమీ లేదు. ముందు మేం పరుగులు చేస్తే పాకిస్థాన్‌ను ఒత్తిడిలోకి నెట్టొచ్చు. అఫ్గాన్‌పై అనుసరించిన వ్యూహాలనే ఇక్కడా అమలు చేస్తాం. మేం అత్యుత్తమంగా ఆడాల్సిన అవసరం ఉంది. ప్రత్యర్థి మమ్మల్ని ఏం చేస్తుందోనన్న భయం లేదు. వారి బలాలు, బలహీనతలు మాకు తెలుసు. శాంటో ఆడటం లేదు. అతడి స్థానంలో లిటన్ దాస్‌ను తీసుకొచ్చాం' అని బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అన్నాడు.
'టాస్ గెలిస్తే మేమూ మొదట బ్యాటింగే తీసుకోవాలని అనుకున్నాం. పిచ్‌పై కాస్త పచ్చిక ఉంది. దానిని మేం సద్వినియోగం చేసుకుంటాం. పేస్ డిపార్ట్‌మెంట్లో మేం చాలా బాగున్నాం. మాకు ఇక్కడ చాలా ఆడిన అనుభవం ఉంది. కాబట్టి ఎండ వేడిమి అనుకూలంగా మార్చుకుంటాం. నేనీ మ్యాచు గురించే ఆలోచిస్తున్నా. అన్వర్ సెంచరీల రికార్డును సమం చేసేందుకు ప్రయత్నిస్తా. చివరి మ్యాచులో ఫాస్ట్ బౌలర్లు మాకు అండగా నిలబడ్డారు. అందుకే మేం ఒక అదనపు పేసర్‌ను తీసుకున్నాం' అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు.