Yash Dayal FIR: పెళ్లి పేరుతో నమ్మించి లైంగిక వేధింపులు- ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్‌పై కేసు నమోదు
క్రికెటర్ యష్ దయాల్ పై ఘజియాబాద్ లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో మోసం చేసి లైంగిక వేధింపులు, మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది.

లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులు RCB క్రికెటర్ యష్ దయాల్‌పై కేసు నమోదు చేశారు. ఘజియాబాద్‌కు చెందిన ఒక మహిళ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు యశ్ దయాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యశ్ దయాల్ గత కొంతకాలం నుంచి తనను శారీరక, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపణలు చేసింది. ఆదివారం అర్ధరాత్రి ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలు ముఖ్యమంత్రి ఫిర్యాదుల పరిష్కార పోర్టల్‌లో ఈ విషయాన్ని లేవనెత్తడంతో పోలీసులు ప్రాథమికంగా వివరాలు సేకరించిన తరువాత బౌలర్ యశ్ దయాల్ పై చర్యలు చేపట్టారు.
పెళ్లి పేరుతో లైంగిక దోపిడీ
IANS నివేదిక ప్రకారం.. మహిళ యష్ దయాల్‌తో ఐదు సంవత్సరాలుగా సంబంధం కలిగి ఉంది. క్రికెటర్ పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. ప్రేమ పేరుతో మోసం చేసిన తను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తాను యశ్ దయాల్ కుటుంబానికి తెలుసునని, క్రికెటర్ ను కూడా తన కుటుంబసభ్యులకు పరిచయం చేశానని చెప్పింది. యశ్ దయాల్ కుటుంబం సైతం తనను "కోడలిగా" అంగీకరించారని, దాంతో తన నమ్మకం రెట్టింపు అయిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. కానీ శారీరక అవసరాలు తీర్చుకున్నాక, పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని ఘజియాబాద్ కు చెందిన యువతి ఆరోపించింది..
Ghaziabad, UP: An FIR has been registered against cricketer Yash Dayal at PS Indirapuram, under BNS Section 69, on charges of sexual exploitation, physical violence, mental harassment and cheating by making false promises of marriage.
— ANI (@ANI) July 7, 2025
కొన్ని రోజుల కిందట బాధితురాలు ఫిర్యాదు చేయగా.. ఆమె నుంచి వివరాలు సేకరించిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 కింద యశ్ దయాల్ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కుటుంబం తనను అంగీకరించడంతో పెళ్లి పేరుతో తనతో లైంగిక సంబంధం పెట్టుకుని.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని యశ్ దయాల్‌పై మహిళ సంచలన ఆరోపణలు చేసింది.
బాధితురాలి ప్రకానం.. యశ్ దయాల్ పలువురు మహిళలతో సంబంధం కలిగి ఉన్నాడు. తనతో పాటు పలువురు యువతులను పెళ్లి పేరుతో యశ్ దయాల్ మోసం చేశాడు. సహాయం కోసం మహిళా హెల్ప్‌లైన్ 181కి ఫోన్ చేశానని ఆమె పేర్కొంది. పోలీస్ స్టేషన్ ఈ విషయం ముందుకు సాగలేదు. దాంతో తనకు న్యాయం చేయాలని ఆమె ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించింది. తన వాదనలకు మద్దతుగా ఫోటోలు, కాల్ రికార్డులు, ఇతర ఆధారాలను పోలీసులతో పంచుకున్నానని మహిళ పేర్కొంది. తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులను ఆదేశించింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఇంకెంత మంది మహిళల జీవితాలతో యశ్ దయాల్ ఆడుకుంటున్నాడోనని బాధితురాలు అంటోంది..
ఘజియాబాద్ పోలీసులు విచారణను ధృవీకరించారు
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ సాక్ష్యాలను, వాంగ్మూలాన్ని పరిశీలించిన తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. అయితే, యష్ దయాల్‌ను ఇప్పటివరకు అదుపులోకి తీసుకోలేదు. తదుపరి ధృవీకరణ, విధానపరమైన చర్యల తర్వాత ఏదైనా అరెస్టు చేస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు.
న్యాయం కోసం, గౌరవం కోసం పోరాడటానికి తాను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు బాధితురాలు చెప్పారు. ఇది ప్రతీకారేచ్ఛతో చేసిన పని కాదని ఫిర్యాదుదారు స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న ఇతర మహిళలకు ధైర్యాన్ని ఇవ్వాలని బయటకు వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.





















