Mulder Triple Century: లారా రికార్డు స్పెషల్.. అందుకే ఆ డెసిషన్ తీసుకున్నా.. సౌతాఫ్రికా కెప్టెన్ మల్దర్ స్పష్టత
Mulder 367 Not Out: టెస్టుల్లో జింబాబ్వే పై ట్రిపుల్ సెంచరీతో ఐదో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు సాధించిన మల్దర్.. తను 400 పైచిలుకు పరుగులను సాధించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు.

Brian Lara VS Wiaan Mulder: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో స్టన్నింగ్ ట్రిపుల్ సెంచరీ కొట్టిన సౌతాఫ్రికా కెప్టెన్ వియాన్ మల్డర్.. అందరినీ షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. కేవలం 297 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ కొట్టి, అత్యంత వేగవంతంగా ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. అత్యంత వేగవంతమైన రికార్డు భారత్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట (278 బంతులు) ఉన్న సంగతి తెలిసిందే. అయితే తనే కెప్టెన్ అయినప్పటికీ 367 పరుగుల నాటౌట్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీంతో బ్రియాన్ లారా నెలకొల్పిన అత్యధిక వ్యక్తిగత టెస్టు స్కోరు 400 పరుగుల రికార్డును కేవలం 33 పరుగుల తేడాతో మిస్సయ్యాడు. డిక్లేర్ చేశాక అందరి మనసులను వేధిస్తున్న ప్రశ్నకు మల్డర్ తాజాగా ఆన్సరిచ్చాడు.
Wiaan Mulder on declaring
— Werner (@Werries_) July 7, 2025
"I thought we had enough and we need to bowl. Secondly, Brian Lara is a legend let's be real. He got 401, or whatever it was, against England
For someone of that stature to keep that record is pretty special. I think if I get the chance again, I would… pic.twitter.com/97LxjltM1Z
చాలా స్పెషల్..
ఇంగ్లాండ్ పై లారా ఈ రికార్డును గతంలో నమోదు చేశాడు. అయితే ఆ రికార్డు ఎంతో స్పెషలని, అందుకే ఆ రికార్డును బ్రేక్ చేయాలని భావించలేదని మల్దర్ పేర్కొన్నాడు. కొన్ని రికార్డులు అలా ఉంటేనే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. తనకు మరోసారి అవకాశం వచ్చినా కూడా, ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు ప్రయత్నించబోనని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా కోచ్ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించాడు. లారా రికార్డు పదిలంగా ఉండేందుకే తను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడని తెలిపాడు. ఇక ఈ ఇన్నింగ్స్ తో సౌతాఫ్రికా తరపున అత్యధిక వ్యక్తిగత టెస్టు స్కోరు నమోదు చేసిన ప్లేయర్ గా మల్దర్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. 2012 లండన్ లోని ఓవల్ మైదానంలో 311 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో సత్తా చాటిన ఆమ్లా పేరిట నిన్నటి వరకు ఈ రికార్డు ఉండేది.
ఆల్ రౌండ్ ప్రతిభ..
ఈ మ్యాచ్ మల్దర్ కు అన్ని విధాల కలిసి వచ్చినట్లుగా ఉంది. బ్యాటింగ్ లో ట్రిపుల్ సెంచరీ చేసిన మల్దర్.. బౌలింగ్ లో రెండు వికెట్లు తీయడమే కాకుండా, ఒక క్యాచ్ ను కూడా అందుకున్నాడు. తన మరాథాన్ ట్రిపుల్ సెంచరీ ఇన్నింగ్స్ లో 334 బంతులు ఓవరాల్ గా ఆడిన మల్దర్.. 49 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. దీంతో సౌతాఫ్రికా తన ఇన్నింగ్స్ ని 626/5 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో జింబాబ్వే 170 పరుగులకు కుప్పకూలగా, ఫాలో ఆన్ ఆడుతూ.. రెండో ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆటముగిసేసరికి వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే ఆ జట్టు ఇంకా 405 పరుగులు చేయాలి. తొలి టెస్టులో కూడా సౌతాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే.




















