Ambati Rayudu: ఎంఎల్‌సీ నుంచి తప్పుకున్న అంబటి రాయుడు - ‘రాజకీయమే’ కారణమా?
భారత మాజీ క్రికెటర్, ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆంధ్రా ఆటగాడు అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
Ambati Rayudu: మాజీ క్రికెటర్, ఇటీవలే ముగిసిన ఐపీఎల్ - 16 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన ఆంధ్రా ఆటగాడు అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నెల నుంచి అమెరికా వేదికగా జరుగబోయే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) నుంచి తప్పుకుంటున్నాడు. ఈ మేరకు టెక్సాస్ సూపర్ కింగ్స్ ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా తెలిపింది. ఈ నెల 13 నుంచి మొదలుకాబోయే ఈ లీగ్ జులై 30వరకు అమెరికాలోని పలు నగరాల్లో మ్యాచులు జరుగనున్నాయి.
టీఎస్కే ప్రకటన..
రాయుడు ఎంఎల్‌సీ నుంచి తప్పుకుంటున్న విషయమై టీఎస్కే ట్వీట్ లో వివరణ ఇస్తూ.. ‘ఎంఎల్‌సీ ఫస్ట్ సీజన్ లో అంబటి రాయుడు అందుబాటులో ఉండటం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ సీజన్ కు దూరంగా ఉంటున్నాడు. కానీ ఇండియా నుంచి అతడు మా టీమ్ కు మద్దతుగా ఉంటాడు’ అని పేర్కొంది.
Squad Update!#WhistleForTexas #MajorLeagueCricket pic.twitter.com/ruRlq4dGrL
— Texas Super Kings (@TexasSuperKings) July 7, 2023
రాజకీయమే కారణమా..?
ఎంఎల్‌సీ ఫస్ట్ సీజన్ నుంచి రాయుడు తప్పుకోవడం వెనుక ఏపీ రాజకీయాలే కారణమన్న వాదన వినిపిస్తోంది. రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే రాయుడు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెండుసార్లు కలవడం.. ఇటీవల తన సొంత జిల్లా గుంటూరులో విస్తృత పర్యటనలు చేస్తూ వివిధ వర్గాలను కలవడం ద్వారా అతడి రాజకీయ ఎంట్రీ ఖాయమనే తెలుస్తున్నది. గుంటూరు పార్లమెంట్ సీటు లేదా అదే జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాయుడుని బరిలోకి దింపేందుకు అధికార వైఎస్సార్సీపీ ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగానే రాయుడు.. నిత్యం జనంతో మమేకమవుతున్నాడు. ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండటంతో త్వరలోనే రాయుడు రాజకీయ ఎంట్రీపై పూర్తి స్పష్టత రానున్నది.
ఇక ఎంఎల్‌సీ విషయానికొస్తే.. అమెరికా వేదికగా జరుగబోయే ఈ మెగా టోర్నీలో నాలుగు ఫ్రాంచైజీలను కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లే దక్కించుకున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలతో పాటు మరో రెండు స్థానిక ఫ్రాంచైజీలు బరిలో ఉన్నాయి. చెన్నై టీమ్ కు టెక్సాస్ సూపర్ కింగ్స్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు దక్షిణాఫ్రికా దిగ్గజం ఫాఫ్ డుప్లెసిస్ సారథిగా వ్యవహరించనున్నాడు. డుప్లెసిస్ తో పాటు మరో దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ మిల్లర్ కూడా టెక్సాస్ కే ఆడుతుండటం విశేషం.
No c a p tion needed! 💛@faf1307 @MLCricket #yellovetexas #MajorleagueCricket #WhistleForTexas pic.twitter.com/2X0yUkBNY7
— Texas Super Kings (@TexasSuperKings) June 16, 2023
మరోవైపు ఐపీఎల్, ఇండియన్ క్రికెట్ టీమ్ నుంచి రిటైర్ అవుతున్న క్రికెటర్లు విదేశీ లీగ్ లలో ఆడుతుండటం గురించి ఆందోళన వ్యక్తం చేసిన బీసీసీఐ.. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాయుడు ఎంఎల్‌సీ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial