Ajit Agarkar Quits DC: ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడిన అగార్కర్ - చీఫ్ సెలక్టర్ రేసులోకి దూకేందుకేనా?
చేతన్ శర్మ స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్.. ఆలిండియా చీఫ్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తున్నది.
Ajit Agarkar Quits DC: టీమిండియా మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ ఆలిండియా చీఫ్ సెలక్టర్ రేసులో ఉన్నాడా..? అంటే సమాధానం అవుననే వినిపిస్తున్నది. ఇటీవలే బీసీసీఐ.. స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ స్థానాన్ని (నార్త్ జోన్) భర్తీ చేసేందుకు గాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరిన విషయం తెలిసిందే. చేతన్ శర్మ స్థానంలో అజిత్ అగార్కర్.. ఆలిండియా చీఫ్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తున్నది. తాజాగా అగార్కర్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోచింగ్ స్టాఫ్ నుంచి కూడా తప్పుకోవడం ఈ వార్తలను మరింత బలాన్నిస్తుంది.
క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక గత కొంతకాలంగా కామెంటేటర్ విధులతో పాటు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్‌లో ఉన్న అగార్కర్.. గురువారం తన పదవికి రాజీనామా చేశాడు. అగార్కర్‌తో పాటు ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కూడా తన పదవి నుంచి తప్పుకున్నాడు. అయితే వాట్సన్ సంగతి పక్కనబెడితే అగార్కర్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తప్పుకోవడం వెనుక కారణం లేకపోలేదు.
ఒకవేళ చీఫ్ సెలక్టర్‌గా ఉంటే బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలి. ఇందుకే అగార్కర్ ఢిల్లీ కోచింగ్ స్టాఫ్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. బీసీసీఐ ఇటీవలే విడుదల చేసిన నోటీఫికేషన్ ప్రకారం.. కొత్తగా తీసుకోబోయే సెలక్టర్ పోస్ట్‌కు అన్ని అర్హతలూ అగార్కర్‌కు ఉన్నాయి. దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 30 గా నిర్ణయించిన విషయం తెలిసిందే. వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి కొత్త సెలక్టర్ ఎంపిక ప్రక్రియ ముగిసి సదరు అభ్యర్థి పేరును ప్రకటించడానికి జులై మూడు లేదా నాలుగో వారం వరకూ ఓపిక పట్టాల్సిందే. భారత జట్టు ఆగస్టులో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ టూర్‌కు కొత్త సెలక్టర్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
You’ll always have a place to call home here 💙
— Delhi Capitals (@DelhiCapitals) June 29, 2023
Thank You, Ajit and Watto, for your contributions. All the very best for your future endeavours 🙌#YehHaiNayiDilli pic.twitter.com/n25thJeB5B
అప్పుడే వచ్చే ఛాన్స్ మిస్..
చీఫ్ సెలక్టర్ రేసులో అగార్కర్ పోటీ పడటం ఇది మూడోసారి. 2021లో అతడు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూకు కూడా అటెండ్ అయ్యాడు. కానీ ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో పాటు బీసీసీఐ నుంచి కూడా అతడికి మద్దతుగా నిలిచేవాళ్లు కరువవడంతో అతడు తప్పుకున్నాడు. దీంతో ఈ అవకాశం చేతన్ శర్మకు దక్కింది. ఇక గతేడాది రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడయ్యాక కూడా కొత్త చీఫ్ సెలక్టర్ రేసులో కూడా అగార్కర్ నిలిచాడు. కానీ మరోసారి చేతన్ శర్మకే ఆ పదవి దక్కడంతో అగార్కర్‌కు నిరాశే మిగిలింది.
సాలరీ దగ్గరేనా..?
అగార్కర్‌కు కూడా వీరేంద్ర సెహ్వాగ్ మాదిరిగానే చీఫ్ సెలక్టర్‌కు దక్కే సాలరీ విషయంలోనే చర్చలు సాగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం చీఫ్ సెలక్టర్ కు కోటి రూపాయలు, మిగిలిన నలుగురు సెలక్టర్లకు ఒక్కొక్కరికి రూ. 90 లక్షల వేతనం అందుతోంది. అయితే అగార్కర్‌కు కామెంట్రీ, ఐపీఎల్, ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా యేటా ఇంతకంటే (కోటి) ఎక్కువే సంపాదిస్తున్నాడు. మరి వీరూ మాదిరిగానే అగార్కర్ కూడా సాలరీ దగ్గరే ఆగిపోతాడా..? లేక తన కోరికను నెరవేర్చుకుంటాడా..? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్...!
రేసులో వాళ్లు కూడా...!
చీఫ్ సెలక్టర్ రేసులో అగార్కర్‌తో పాటు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, 2005 నుంచి 2008 వరకూ చీఫ్ సెలక్టర్ గా పనిచేసిన 1983 వరల్డ్ కప్ విన్నింగ్ మెంబర్ దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా ఉన్నట్టు సమాచారం. జులై మొదటివారంలో దీనిపై ఓ స్పష్టత రానుంది.