Ajinkya Rahane Interview: నా క్రెడిట్ మరొకరు కొట్టేశారని రహానె విమర్శలు - కోహ్లీ, శాస్త్రీలో ఎవరో అది!
Ajinkya Rahane Interview: క్రికెటర్ అజింక్య రహానె (Ajinkya Rahane) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాపై టెస్టు సిరీసు క్రెడిట్‌ను మరొకరు కొట్టేశారని విమర్శించాడు.
Ajinkya Rahane Interview: టీమ్‌ఇండియా (Team India) సీనియర్ క్రికెటర్ అజింక్య రహానె (Ajinkya Rahane) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాపై టెస్టు సిరీసు విజయం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నానని పేర్కొన్నాడు. కానీ వాటి క్రెడిట్‌ను మరొకరు కొట్టేశారని అంటున్నాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఇంతకీ అతడు విమర్శించింది విరాట్ కోహ్లీనా లేక రవిశాస్త్రినా అని చర్చించుకుంటున్నారు.
నాకే తెలుసు
'ఆస్ట్రేలియాలో నేనేం చేశానో నాకే తెలుసు. అవి మరొకరికి చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ బహిరంగంగా ప్రకటించి క్రెడిట్ కొట్టేసే తత్వం నాకు లేదు. అవును డ్రెస్సింగ్ రూమ్, మైదానంలో నేను కీలక నిర్ణయాలు తీసుకున్నా. కానీ వాటి క్రెడిట్‌ను మరొకరు కొట్టేశారు. ఏదేమైనా నాకదో చారిత్రక సిరీసు. నిజంగా ఎంతో ప్రత్యేకం' అని అజింక్య రహానె అన్నాడు.
చారిత్రక విజయం
గతేడాది టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 36 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ ముగిశాక విరాట్ కోహ్లీ (Virat Kohli) సెలవుపై స్వదేశానికి వచ్చేశాడు. ఆ ఘోర ఓటమి నుంచి అజింక్య రహానె జట్టును గట్టెక్కించాడు. తనదైన రీతిలో రెండో టెస్టులో శతకం కొట్టేశాడు. తన నాయకత్వ ప్రతిభను చాటుకున్నాడు.
పంత్ మెరుపులు
ఇక గబ్బాలో జరిగిన నాలుగో టెస్టులో రిషభ్ పంత్ (Rishabh Pant), శుభ్‌మన్ గిల్ మెరుపులతో టీమ్‌ఇండియా 328 పరుగుల లక్ష్యం ఛేదించింది. ఆఖరి రోజు అందులో 324 పరుగులు చేయడం గమనార్హం. సిరీసును 2-1తో గెలవడంతో రహానెపై ప్రశంసలు కురిశాయి. కానీ తాజా ఇంటర్వ్యూలో ఆ క్రెడిట్‌ను మరొకరు కొట్టేశారని అతడు అన్నాడు.
క్రెడిట్ కొట్టేశారు
'ఆ సిరీసు తర్వాత కొందరు క్రెడిట్ కొట్టేశారు. నేనది చేశాను, నేనే ఆ నిర్ణయం తీసుకున్నాను, అది నిర్ణయం అంటూ కొందరు మాట్లాడారు. అవును, మేం జట్టు యాజమాన్యంతోనూ దాని గురించి చర్చ జరిగింది. కానీ నేను నవ్వుకొనేవాడిని. మైదానంలోనూ నేనలాగే ఉంటాను. నా గురించి ఎక్కువగా మాట్లాడుకోను, పొగిడేసుకోను. కానీ అక్కడేం చేశానో నా ఒక్కడికే తెలుసు' అని రహానె అన్నాడు.
Also Read: తన బిడ్డకు 'ఈడెన్ గార్డెన్' పేరు పెట్టిన విండీస్ క్రికెటర్.. ఎందుకో తెలుసా!
Also Read: ఇండియాలో ఇలాంటి బౌలింగా? పంత్ ఓపెనింగ్ వ్యూహం చెప్పిన రోహిత్