తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగరా మోగింది. 12,760 పంచాయతీలకు సర్పంచ్‌లు, 1,12,534 వార్డులకు వార్డు మెంబర్ల ఎన్నికలు జరగనున్నాయి. మూడు విడతల్లో ఈ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

Telangana Local Body Elections: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగరా మోగింది. 12,760 పంచాయతీలకు సర్పంచ్‌లు, 1,12,534 వార్డులకు వార్డు మెంబర్ల ఎన్నికలు జరగనున్నాయి. మూడు విడతల్లో ఈ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. తొలి విడత ఎన్నిక డిసెంబర్ 11వ తేదీన జరగనుండగా, రెండో విడతను డిసెంబర్ 14వ తేదీన, మూడో విడత ఎన్నిక డిసెంబర్ 17వ తేదీన నిర్వహించనుంది. అయితే, పార్టీలకు అతీతంగా ఈ ఎన్నికలు జరగనున్నప్పటికీ, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో తాము బలపర్చే అభ్యర్థుల ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తాము బలపర్చే అభ్యర్థుల గెలుపుకు వ్యూహాలు రచిస్తున్నాయి.
ప్రజల విశ్వాసాన్ని మరోసారి నిరూపించుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్
సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార కాంగ్రెస్, తమ పాలన పట్ల రెండేళ్ల తర్వాత కూడా ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందని రుజువు చేసుకోవడమే లక్ష్యంగా పంచాయతీ ఎన్నికల బరిలో హస్తం పార్టీ నేతలు దిగుతున్నారు. సాధారణ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీలను గ్రామ స్థాయిలో ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ వర్గాలు సిద్ధం అవుతున్నాయి. తమ పథకాల లబ్ధిదారులను తమ ఓటు బ్యాంకుగా మలుచుకోవాలనే ప్రధాన వ్యూహంతో కాంగ్రెస్ ఉంది. గ్రాస్ రూట్ (Grass Root) లెవల్లో పార్టీ పటిష్టం కావాలంటే ఈ ఎన్నికల్లో తమ పట్టును నిరూపించుకోవడమే ప్రధాన లక్ష్యంగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందు కోసం ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్థానిక నాయకులను ఏకతాటిపై తీసుకురావడం, నాయకుల మధ్య విభేదాలు ఉంటే పరిష్కరించడం, గ్రామాలను ప్రభావితం చేసే నేతలను తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇతర పార్టీలకు చెందిన గ్రామ స్థాయి నేతల్లో కీలకమైన వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పారదర్శక పాలనే నినాదంగా ముందుకు సాగేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో అవినీతి ఆరోపణలను ప్రజల ముందు ఉంచి, తమకు ఓటు వేస్తే గ్రామాల్లో పారదర్శక పాలన అందిస్తామనే ప్రచారం చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
గ్రామాల్లో పట్టు నిరూపించుకోవాలన్న పట్టుదలలో గులాబీ పార్టీ
అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లోనూ, రెండు ఉప ఎన్నికల్లోనూ చతికిలపడింది. రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్‌కు పట్టున్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, తమ బలం తగ్గిపోలేదని, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని ఈ పంచాయతీ ఎన్నికల్లో నిరూపించాలని పట్టుదలతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఉద్యమ కాలంలో తమను ఆదరించిన గ్రామాల్లో తిరిగి నాటి ఉద్యమ స్ఫూర్తి నింపి ఈ ఎన్నికల్లో గెలుపుబాట పట్టాలనేది గులాబీ పార్టీ నేతల వ్యూహం. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు అందించిన 'రైతు బంధు' వంటి పథకాలు, ఇంటింటికి నీటిని అందించిన 'మిషన్ భగీరథ' వంటి పథకాలు, ఇంట్లో పెళ్లికి లక్ష రూపాయలు అందించిన 'కల్యాణ లక్ష్మి' వంటి పథకాల విజయాలు ప్రజల ముందు ఉంచి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని బీఆర్ఎస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. వీటితో పాటు, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలోని వైఫల్యాల చిట్టాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్న ఆలోచనలో గులాబీ నేతలు ఉన్నారు. మాజీ మంత్రులు, గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇతర స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఈ పంచాయతీ ఎన్నికల బాధ్యతలను అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గ్రామాల్లో క్రియాశీలకంగా లేని నేతలను కలుస్తున్నారు. ఏది ఏమైనా, మెజారిటీ పంచాయతీలను గెలుచుకుని గ్రామాల్లో తాము పట్టు కోల్పోలేదని రుజువు చేసే పట్టుదలతో బీఆర్ఎస్ పార్టీ ఉంది.
ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే యోచనలో బీజేపీ
గత సాధారణ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో ఓ మోస్తరు విజయం సాధించిన బీజేపీ ఇక తన స్పీడ్ పెంచాలన్న ఆలోచనలో ఉంది. అందుకు పంచాయతీ ఎన్నికలను వేదికగా ఉపయోగించుకోవాలని కమలం పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. గ్రామాల్లో తమ బలం పెంచుకోవడానికి ఈ ఎన్నికలు దోహదపడతాయని వారు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే వ్యూహంతో కమలం నేతలు ఉన్నారు. 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి', 'ప్రధాన మంత్రి ఆవాస్ యోజన', రేషన్ బియ్యం పంపిణీ వంటి అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. దీంతో పాటు, గ్రామాల్లోని స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ, ఇందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని ప్రజల ముందు ఎత్తిచూపాలన్న ఆలోచనలో కమలం నేతలు ఉన్నారు. అంతే కాకుండా, రామ మందిర నిర్మాణం, 'ఆపరేషన్ సింధు' వంటి అంశాలను కూడా గ్రామాల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని, ఈ జాతీయ అంశాలు సైతం గ్రామాల్లో యువతను తమ వైపు తిప్పుకోవడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు. గ్రామ, మండల స్థాయిలో కార్యకర్తలను క్రియాశీలకంగా పని చేయించడం, రాష్ట్ర నేతలకు మండల, గ్రామ స్థాయి నాయకులను సమన్వయం చేసి ఈ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించాలనే యోచనలో బీజేపీ అగ్ర నాయకత్వం ఉంది.
అయితే, గ్రామీణ ఓటరు ఆలోచన ఎలా ఉన్నా, స్థానిక సమస్యలే అధిక స్థాయిలో ఈ పంచాయతీ ఎన్నికలను ప్రభావం చేయనున్నప్పటికీ, అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించే యోచనలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఉన్నాయి. స్థానిక పరిస్థితులను బట్టే సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల ఎంపిక ఉండాలని పార్టీలు ఇప్పటికే కింది క్యాడర్‌కు సంకేతాలు పంపాయి. ఈ దిశగా అన్ని పార్టీలు గెలుపు గుర్రాల కోసం వెతుకులాట ప్రారంభించాయి. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.






















