Rashid Khan on Taliban: అఫ్గానిస్థాన్‌లో చిక్కుకుపోయిన రషీద్ ఖాన్ కుటుంబం.. యువ క్రికెటర్‌కు కంటిమీద కునుకు లేదు
ప్రపంచ దేశాల నేతలు తమ దేశానికి సాయం చేయాలని అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఇటీవల కోరాడు. అమాయకులైన ప్రజలు, చిన్నారులు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని, తాలిబన్ల నుంచి రక్షించాలంటూ ట్వీట్ చేశాడు.
అఫ్గానిస్థాన్‌లో ఏం జరగకూడదని క్రికెటర్ రషీద్ ఖాన్ కోరుకున్నాడో.. చివరికి అదే జరిగింది. తమ దేశాన్ని కాపాడాలని కాపాడాలని ఇటీవల రషీద్ ఖాన్ ప్రపంచ దేశాలను కోరాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ ద్వారా సహాయాన్ని అర్థించాడు. సరిగ్గా అయిదో రోజునే తాలిబన్లు అఫ్గాన్ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తమ హస్తగతం చేసుకునేందుకు ఎలాంటి దాడులు చేయడం లేదని, శాంతియుతంగా అధికారం హస్తగతం చేయాలని ఆ ముష్కరులు సూచించారు. అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సైతం విదేశాలకు పారిపోయాడు.
కొన్ని రోజుల కిందటే రషీద్ ఖాన్ ట్వీట్..
తాను ఇంగ్లాండ్‌లో ఉన్నానని, కానీ తన దేశం ఆపదలో ఉందని.. సామాన్య ప్రజలు, చిన్నారులు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని ఇటీవల ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా తన కుటుంబం గురించి అఫ్గాన్ క్రికెట్ సంచలనం రషీద్ ఖాన్ అధికంగా ఆందోళన చెందుతున్నాడు. తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకోగా, తన కుటుంబం మాత్రం ఇంకా అక్కడే ఉందని రషీద్ బాధపడుతున్నాడు. రషీద్ ఖాన్‌తో పాటు మహ్మద్ నబీ సైతం ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్నారు. హండ్రెడ్ లీగ్‌లో భాగంగా రషీద్ ఖాన్ ట్రెంట్ రాకెట్స్‌కు, లండన్ స్పింట్స్‌కు నబీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. క్రికెటర్లు విదేశాలలో ఉన్నా, తమ కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతున్నానని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌తో తన బాధను షేర్ చేసుకున్నాడు. తన కుటుంబం, దేశం గురించి ఆందోళన చెందుతున్న రషీద్ ఖాన్ ప్రస్తుతం నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు.
Also Read: IND vs ENG: లార్డ్స్ మైదానంలో కోహ్లీ vsఅండర్సన్ మధ్య గొడవ... అసలేమైంది?
Peace 🤲🏻🤲🏻🤲🏻🇦🇫🇦🇫🇦🇫
— Rashid Khan (@rashidkhan_19) August 15, 2021
ఐపీఎల్‌లో అఫ్గాన్ ఆటగాళ్లు డౌటే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021) సీజన్ మిగతా మ్యాచ్‌లకు రషీద్ ఖాన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాబుల్‌లో ఎయిర్ పోర్టు మూసివేశారు, కానీ రషీద్, నబీ ఇంగ్లాండ్‌లో టీ20 లీగ్‌లు ఆడుతున్నారు. ఇంగ్లాండ్‌లో ఆడుతున్న హండ్రెడ్ లీగ్ ఆగస్టు 21న ముగియనుంది. మరోవైపు సెప్టెంబర్ 19న ఈ ఐపీఎల్ సీజన్ మిగతా మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. భారత్‌లో కరోనా కేసుల కారణంగా మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్‌ను యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. అఫ్గానిస్థాన్ క్రికెటర్లు ఐపీఎల్‌లో పాల్గొంటారో లేదో చెప్పడానికి ఇది సరైన సమయం కాదని బీసీసీఐ అధికార ప్రతినిధి పీటీఐతో అన్నారు. అయితే ఏ ఆటంకం లేకుండా అఫ్గాన్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో భాగస్వాములు కావాలని మాత్రం కోరుకుంటున్నామని చెప్పారు.
Also Read: Afghanistan Taliban Crisis: అఫ్గానిస్థాన్ ను అంత ఈజీగా తాలిబన్లు ఎలా చేతిలోకి తెచ్చుకున్నారు? అసలు తాలిబన్ అంటే ఏంటి?