Afghanistan Taliban Crisis: అఫ్గానిస్థాన్ ను అంత ఈజీగా తాలిబన్లు ఎలా చేతిలోకి తెచ్చుకున్నారు? అసలు తాలిబన్ అంటే ఏంటి?
అఫ్గానిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లింది. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లు అఫ్గాన్ పై పట్టు సాధించారు. అంత ఈజీగా ప్రభుత్వం ఎందుకు తాలిబన్లకు లొంగిపోయింది.
మెల్ల మెల్లగా మెుదలుపెట్టిన.. తాలిబన్లు చివరికి అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ పైనా.. పట్టుసాధించారు. ఒక్కో ప్రధాన నగరాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటూ.. వెళ్లారు. చివరకు ప్రభుత్వం లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే.. తాలిబన్లకు పగ్గాలను అప్పగించాల్సి వచ్చింది. మళ్లీ తాలిబన్ల పాలనలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. అఫ్గాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
అమెరికా, నాటో మిత్ర దేశాలు 20 ఏళ్ల కాలంలో అఫ్గాన్ బలగాలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆయుధాలను సమకూర్చాయి. అఫ్గాన్ సైన్యాన్ని శక్తిమంతంగా, సమర్థంగా మార్చినట్లు బ్రిటిష్, అమెరికా జనరల్‌లు ఎంతో మంది చెప్పేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ మాటలన్నీ ఏమయైపోయాయో అనిపిస్తోంది.
అఫ్గాన్ సైన్యం, వైమానిక దళం, పోలీసులు అన్నీ కలిపి అఫ్గాన్ భద్రతా దళాలు 3 లక్షల కంటే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. తాలిబన్‌లకు 60 వేల మంది సాయుధులున్నారు. అయితే ఇతర మిలీషియా బృందాలు, మద్దతుదారులతో కలిపి వారి బలగం 2 లక్షలకు పైగా ఉంటుందని అంచనా.
ఇంతకీ ఏం జరిగింది.
2001 సెప్టెంబరు ఉగ్రవాద దాడుల అనంతరం అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ జూనియర్ సారథ్యంలో అఫ్గానిస్థాన్‌పై దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఆ దేశ ఉత్తర భాగంలో తజక్‌లు, ఉజ్బెక్‌లు, హజిరాలు ఉంటారు. వాళ్లే తాలిబన్లకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడి పోరాటం చేశారు. ఆకాశం నుంచి నాటో దళాలు దాడులు చేసేవి.. కింద ఉత్తర కూటమి దాడులు చేసేది. దీంతో తాలిబన్లు పారిపోయారు. అనంతరం అమెరికా సపోర్ట్ తో అఫ్గానిస్థాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. సుమారు రెండు దశాబ్దాలకు పైగా ప్రజాస్వామ్య పాలనలో ఉన్నారు అఫ్గాన్ ప్రజలు.
అయితే.. తాలిబన్లకు మద్దుతుగా ఉండటంలో పాకిస్థాన్‌దే ముఖ్యమైన పాత్ర అని చెబుతారు. సరిహద్దుల్లో తాలిబన్లకు ఆయుధాలతో పాటు శిక్షణ 2001 నుంచి ఇప్పటివరకూ ఇచ్చింది.
అమెరికా దళాలు అఫ్గాన్ నుంచి సెప్టెంబరు 11న ఉపసంహరిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించడంతో తాలిబన్లు ఇక విరుచుపడ్డారు. అమెరికా సేనలు త్వరంగానే వెనక్కి వెళ్లడంతో.. అఫ్గాన్ సైన్యం మానసికంగా దెబ్బతిన్నది అని చెప్పొచ్చు. అప్పటి నుంచి తాలిబన్లు ఆక్రమించుకుంటూ వచ్చి.. ఇవాళ దేశ రాజధాని కాబూల్ ను ఆక్రమించారు. అక్కడ అధికారం చేపడుతున్నారు. మరోవైపు అఫ్గాన్ సైన్య బలం లక్షల్లో ఉండటంతో పాటు తాము ఇచ్చిన శిక్షణ, ఆధునిక ఆయుధాలు తాలిబన్లను నిలువరిస్తాయని అమెరికా అంచనా వేసింది. సైనికుల జీతాలు, ఆయుధ సంపత్తి కోసం వందల కోట్ల డాలర్లు అఫ్గాన్‌కు అందాయి. అందులో అధిక భాగం అమెరికా నుంచే వచ్చింది. కానీ బైడెన్ లెక్కలన్నీ తలకిందులయ్యాయి.
బుష్ హయాములో అఫ్గాన్‌పై సైనికదాడులు చేపట్టినప్పుడు కేవలం తాలిబన్లను అధికారం నుంచి దించివేయాలనే అమెరికా చూసింది. కొన్ని రోజుల తర్వాత.. విధానాన్ని మార్చుకొని ఆ దేశ పునర్ నిర్మాణం చేపట్టింది. లక్షల డాలర్లను అఫ్గానిస్థాన్ లో ఖర్చు పెట్టింది అమెరికా. ఎలాంటి ఉపయోగం లేదనుకున్న అమెరికా.. చివరకు సైన్యాన్ని ఉపసంహరించుకుంది. వెంటనే.. తాలిబన్లు అఫ్గాన్ పై జెండా ఎగరేశారు.
మెుదట చెప్పుకున్నట్టు.. అఫ్గాన్ ను ఓడించడంలో ఉత్తర కూటమి ముఖ్యమైన పాత్ర పోషించింది. కానీ.. అప్పటి యోధులు ఇప్పుడు లేరు. ఉన్నా.. వారంతా వయసైపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఇప్పటీ యూత్ కి అనుకోలేదు. దేశంలో ఉన్న ఎక్కువ యువతకు తాలిబన్లు పాలన గురించి తెలియదు. ఈ కారణంగా వాళ్లు ఎప్పుడూ ఆయుధ శిక్షణ కూడా తీసుకోలేదు. కానీ ప్రస్తుత పరిస్థితితో ఒక్కసారి ఆలోచనలు తలకిందులయ్యాయి.
తాలిబన్ అంటే...
1990ల ప్రారంభంలో ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ఏర్పాటైంది. తాలిబన్ అంటే విద్యార్థులు అని అర్థం. సోవియట్ ఆక్రమణకు వ్యతిరేకంగా అఫ్గాన్ ముజాహిద్దీన్ ఒక దశాబ్దం పాటు యుద్ధం చేశారు. అప్పట్లో వారికి అమెరికా, ఇతర దేశాల నుంచి నిధులు అందాయనే చెబుతారు.
1989లో సోవియట్ యూనియన్ దళాలు వెనక్కు వెళ్లడంతో వారిపై ఆధారపడి పరిపాలిస్తున్న అప్పటి అఫ్గాన్ ప్రభుత్వం పడిపోయింది. 1992 నాటికి ముజాహిదీన్ ప్రభుత్వం వచ్చింది.
సోవియట్ దళాలు వైదొలిగిన తరువాత దేశంలోని ఉత్తర ప్రాంతాల్లోని ఆదివాసుల హక్కుల కోసం తాలిబన్ పోరాడేది. వీరిలో కొందరు సోవియట్లకు వ్యతిరేకంగా పోరాడిన ముజాహిదీన్ పోరాట యోధులు ఉన్నారు. ఆ తరువాత ఇది అతివాద సున్నీ మత సంస్థల చేతుల్లోకి వెళ్లింది. దీనికి సౌదీ అరేబియా నుంచి నిధులు అందేవి. ముందు ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేసినప్పటికీ, ఆ తరువాత ఆధిపత్య ధోరణి అనే లక్ష్యంతో ముందుకు వెళ్లింది. కొన్ని కఠినమైన నియమాలను తాలిబన్లు అమలు చేసేవారు. అలా తర్వాత పరిస్థితులు మారాయి. 1994లో తాలిబన్లు దక్షిణ అఫ్గానిస్థాన్ నుంచి సైనిక ప్రచారాన్ని ప్రారంభించారు. 1996 నాటికి ఈ బృందం ప్రతిఘటన లేకుండా అఫ్గాన్ రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకుంది. అలా తాలినబ్లు పరిపాలన మెుదలైంది. మళ్లీ ఇప్పుడు అఫ్గానిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లింది.