Yogini Ekadashi 2023 Date: ఈ రోజు యోగినీ ఏకాదశి - విశిష్ఠత ఏంటి , ఏం చేయాలి!
ఏడాది కాలంలో హిందువులు పాటించే ఏకాదశిలలో యోగినీ ఏకాదశి ఒకటి. జ్యేష్ఠ బహుళ ఏకాదశినే యోగినీ ఏకాదశిగా ఆచరిస్తారు. ఈ ఏడాది (2023) జూన్ 14న వచ్చింది..
Yogini Ekadashi 2023: ఉపవాసంతో మనసు మీదస శరీరం మీదా అదుపుని సాధించి... భగవంతునికి చేరువకావడమే ఏకాదశి ఉపవాసాల వెనుక ఉన్న పరమార్థం. అందుకే ఏడాది పొడవునా ప్రతి ఏకాదశికీ ఏదో ఒక విశిష్టతను కల్పించారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున వచ్చే ఏకాదశి పేరే యోగినీ ఏకాదశి. ఈ యోగినీ ఏకాదశి గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకి ఉపదేశించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి.
యోగినీ ఏకాదశిపై పురాణ కథ
అలకాపురిని ఏలుతున్న కుబేరుడు పరమ శివభక్తుడు. నిత్యం శివార్చన సాగించనిదే రోజు గడిచేది కాదు. తన పూజ కోసం కావల్సిన పుష్పాలను సమకూర్చే పనిని కుబేరుడు..హేమమాలి అనే యక్షునికి అప్పగించాడు. తనకు అప్పగించిన పనిని హేమమాలి పరమ నిష్టతో ఆచరించేవాడు. మానససరోవరం నుంచి పుష్పాలను తీసుకువచ్చి కుబేరుని చెంత ఉంచేవాడు. హేమమాలికి, స్వరూపవతి అనే యక్షిణితో వివాహం జరిగింది.ఆమె సౌందర్యారాధనలో మునిగిపోయి ఉన్న హేమమాలి ఒకనాడు కుబేరుని శివారాధన గురించే మర్చిపోయాడు. అక్కడ అంతఃపురంలో ఉన్న కుబేరుడు ఎంతకీ పుష్పాలు తీసుకు రాకపోయేసరికి అసహనం కలిగింది.. హేమమాలి ఎందుకు రాలేదో కనుక్కుని రమ్మంటూ సేవకులను ఆదేశించాడు. తిరిగొచ్చి సేవకుడు చెప్పిన మాటలను విన్న కుబేరుని అసహనం కాస్తా క్రోధంగా మారిపోయింది. తక్షణమే హేమమాలిని తీసుకురమ్మని ఆదేశించాడు కుబేరుడు
Also Read: చాణక్య నీతి - భార్యాభర్తలు ఇలా ఉండకపోతే ఇంట్లో రోజూ యుద్ధమే
కుబేరుడి శాపం
నీ శరీరం మీద మోహంతో, మనసు సైతం మలినమైపోయింది. అందుకు ప్రతిఫలంగా కుష్టు వ్యాధిగ్రస్తుడవై భార్యకు దూరంగా భూలోకంలో జీవించు అని శపించాడు. కుబేరుని మాటలకు హేమమాలి గుండెపగిలిపోయింది. తొలి తప్పుని మన్నించమంటూ తన స్వామిని ఎంతగా వేడుకున్నా ఉపయోగం లేకపోయింది. ఇన్నాళ్లుగా శివారాధనలో పాల్గొన్న పుణ్యఫలంవల్ల హేమమాలికి మార్కండేయ రుషి ఆశ్రమం కనిపించింది. జరిగిన విషయం మొత్తం రుషికి వివరించి శాపవిమోచనం చెప్పమని అర్థించాడు. యోగినీ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే నువ్వు శాపవిమోచనాన్ని పొందుతావని సెలవిచ్చారు మార్కండేయ రుషి. అలా జ్యేష్ఠబహుళ ఏకాదశినాడు వచ్చే యోగినీ ఏకాదశి రోజున ఉపవాసమాచరించి మనసులో దైవాన్ని ప్రార్థించి శాపవిమోచనాన్ని సాధించాడు హేమమాలి.
Also Read: ఈ నక్షత్రంలో జన్మించిన వారి వ్యూహరచన బావుంటుంది, సలహాదారులుగా బాగా రాణిస్తారు!
శరీరంపై వ్యామోహం వీడాలి
ఎవరైతే యోగినీ అమావాస్యనాడు ఉపవాసాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారో వారు పాపకర్మల నుంచి విమోచనం పొందుతారని శ్రీ కృష్ణుడు వివరించాడు. హేమమాలి వృత్తాంతం కేవలం ఒక గాథ మాత్రమే కాదు..జీవికి తన శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని విడనాడాలన్న హెచ్చరిక కూడా. అందుకే శరీరం, మనసుని అదుపుచేసుకునేందుకు ఉపవాసాలు, పూజలు, వ్రతాలు. యోగినీ ఏకాదశి రోజున తెల్లవారుజామునే స్నానమాచరించి శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి ఘడియలు పూర్తయ్యేలోగా దానధర్మాలు చేసి భోజనం చేయాలి. ఇలా చేస్తే ఆరోగ్యం, ఆనందంతో పాటూ ఇంట్లో సానుకూల శక్తి, సిరిసంపదలు నిండి ఉంటాయంటారు పండితులు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.