Madurai Meenakshi: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?
పగలంతా శాంతస్వరూపిణిగా పూజలందుకునే మధురై మీనాక్షి చీకటి పడగానే సంహారం మొదలుపెట్టేది. పరిష్కారం లేని సమస్య అని పాండ్యరాజు, నగర ప్రజలు నిర్థారించుకున్న సమయంలో అక్కడ అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యులు.
శక్తిపీఠాల్లో మధురమీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైంది. మీనాల్లాంటి అందమైన విశాలనేత్రాలతో ఒకేఒక మరకతశిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది. ఆకుపచ్చ, నీలం కలగలిపిన మరకతమణి శరీరకాంతి అమ్మ ప్రత్యేకత. మధురనుపాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా, కులదేవతగా ఆరాధిస్తారు. "దేవీ భాగవతపురాణం" లో మణిద్వీపవర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. చతుష్షష్టి కళానిలయమైన "మీనాక్షి" రాత్రివేళల్లో ప్రాణహింసకు పాల్పడేది. ఆమెను శాంతింపచేయడానికి దేశం మొత్తంమీద వేదపండితులు, బుత్విక్కులను పిలిచిన పాండురాజులు యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. కానీ ఆ పూజలు చేసిన వారినే కబళించేసింది అమ్మవారు. చేసిది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదంటూ నిషేదాజ్ఞలు విధించారు. ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే.
Also Read: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం, ఆ దిక్కున తలపెడితే అకాల మృత్యువు- వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది..
అక్కడ క్షేత్రపాలకుడూ, అమ్మవారి అర్థభాగమైన సుందరేశ్వరుడు (శివుడు) కూడా అంతా చూస్తుండిపోయాడు. దేవేరి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు.తన శరీరంలో అర్థభాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవడమే అని భావించాడు. అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యులు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆహ్వానించిన పాండ్యరాజు సకలమర్యాదలు చేశాడు. అయితే ఈ రోజు రాత్రి తాను మధురమీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆదిశంకరాచార్యుల మాటవిని పాండ్యరాజు వణికిపోయాడు. "వద్దుస్వామీ! మేము చేసుకున్న ఏపాపమో, ఏ శాపఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలితీసుకుంటోందని రాజ్యంలో జరుగుతున్నదంతా చెప్పాడు. అంతా విన్న శంకరాచార్యులు "సన్యాసులకు గృహస్తులభిక్ష స్వీకరించేవరకే ఉండాలి కానీ ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళతాను అడ్డు చెప్పొద్దన్నారు. దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇకచూడనేమో అని పాండ్యరాజు ఆవేదనచెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయంలోకి తీసుకువెళ్లి తిరిగి అంత:పురానికెళ్ళాడు. పాండ్య రాజుకు ఆరాత్రంతా నిద్రలేదు. యువ సన్యాసిని అమ్మవారు బలితీసుకుంటుంది ఆ పాపం నా వంశాన్ని పట్టిపీడిస్తుందని బాధపడసాగాడు.
Also Read: భక్తి తొమ్మిది రకాలు.. ఇందులో మీరు అనుసరిస్తున్న విధానం ఏంటి..
చీకటిపడింది. గర్భగుడికి ఎదురుగాఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు. గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణారసాన్ని కురిపిస్తున్నట్టుంది. అప్పటి వరకూ అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఉన్నపాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి. ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి. గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంది. అర్థనారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరించింది. అడుగులో అడుగువేస్తోంది. ఇంతలో ఎదురుగా విశాలమైన మండపములో ధ్యాన సమాధిలోఉన్న యోగిని గమనించింది. "ఎవరితడు? ఇంత తేజస్సుతో బాలశివుడిలా ఉన్నాడేంటి, తనని చూస్తే అమ్మ ప్రేమ పెల్లుబుకుతోందేంటి అని అమ్మవారు తనకి తానే ప్రశ్నలు సంధించుకుంది. కానీ ఇదంతా గర్భగుడి గడప దాటేవరకే. మరుక్షణం ఓ నీడలాంటి రూపం ఆమెను ఆవహించింది. సాత్త్వికరూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోయింది. అప్పుడే కళ్లుతెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కళ్లారా చూశారు. తల్లి ఎంత అంద విహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కనపడుతుందన్నట్టు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతిండం మొదలుపెట్టారు. ఆదిశంకరాచార్యులను కబళించేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది. మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు. అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు..ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులను నువ్వు ఎవరు, నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తున్నావు అడ్డుతొలగు అంది. నువ్వు నాకు ఆహారం అవ్వాల్సింది కానీ నీ వాక్కు విని ఆగిపోయానని చెప్పింది మీనాక్షి అమ్మవారు.
Also Read: రాళ్లు మాట్లాడతాయా… విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానమా..!
అమ్మవారికి సాష్టాంగ దండప్రణామం చేసిన ఆదిశంకరాచార్యులు "అంబా శంభవి! చంద్ర మౌళి రబలా అంటూ స్తుతించారు. కరిగిపోయిన ఆ తల్లి ఏ వరం కావాలో కోరుకో అంది. "అమ్మా ! నాతో పాచికలాడతావా ?" అని పసి పిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. "తప్పక ఆడతాను నాయనా..కానీ ఆటన్నాక పందెం ఉండాలిగా అందుకే ఓ నిబంధన పెడతా అంది మీనాక్షి. నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞమేరకు సంవత్సరకాలం నడచుకుంటాను. నువ్వు ఓడిపోతే నేనువేసే ప్రశ్నలకు వివరంగా, విసుక్కోకుండా సమాధానం చెప్పాలంది. ( ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతాస్తోత్రాలు, కవచాలు, సహస్ర, అష్టోత్తర శతనామస్తోత్రాలు). అమ్మా ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి.. నేను ఓడితే మొదట ఆహారం అవుతా అన్నాడు శంకరాచార్యుడు. అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఓ కాంతికిరణం మెరుపులా వచ్చి ఆది శంకరునిలో ప్రవేశించడం ఆతల్లి గమనించలేదు.
Also Read: కార్తీక దీపాలు నదులు, చెరువుల్లోనే ఎందుకు వదులుతారు...
పాచికలు సృష్టించిన అమ్మవారు చిన్నవాడివి కదా ఆట మొదలుపెట్టు అంది. పరమేశ్వరుడితో తప్ప మరెవరితోను పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమానకాలం చాలా విలువైంది, మహత్తరమైంది అన్నారు శంకరాచార్యులు. నిన్ను స్మరిస్తూ ఆడతాను తల్లీ అంటూ ఆట మొదలుపెట్టారు శంకరాచార్యులు. సృష్టి, స్థితి, లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్లలో, చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి. విజయం నాదేకదా అంది మీనాక్షి అమ్మవారు. పరాజయంద్వారా పొందిన అవమానం, దైన్యం, దైవంయొక్క పాదాలను పట్టుకొనేలాచేస్తుంది. ఇది మాత్రం విజయంకాదా తల్లీ!" అన్నాడు ఆది శంకరాచార్య భక్తి పారవశ్యంతో అమ్మవారికి మ్రొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది. "నాయనా! నీ ప్రతిఅక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవితా స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతీదీ శృతిసమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక అని దీవించింది.
Also Read: దొంగలే పాలకులు.. పాలకులే దొంగలు...కలికాలం అంటే ఇదే
ఆట పూర్తయ్యేవరకూ గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్లి తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి. ఆ క్షణం ఆమె శాంతస్వరూపిణిగా మారి ఈ యోగిని ఓడించకూడదని అమ్మలా ఆలోచించింది. ఆదిశంకాచార్యులి తొలి విజయం ఇదే. సంహారానికి వెళుతున్న అమ్మవారిని వెనక్కు పంపించి మళ్లీ శాంతస్వరూపిణిగా మార్చారు. వరుస శ్లోకాల చెబుతూ, అమ్మను స్తుతిస్తూ ఆట తెల్లవారేవరకూ సాగింది. అప్పటికే తేరుకున్న మధర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు తాను ఓడిపోతే సంహారం ఆపేయాలంటూ ఆటమీద దృష్టి కేంద్రీకరించింది మీనాక్షి. అమ్మవారి కుండలినీ యోగశ్లోకాలు సహస్రనామ స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు. దూరంగా శివభక్తుల రాక, నమక, చమకాలు, అమ్మవారి సుప్రభాతగానాలు ప్రారంభమయ్యాయి. "నాయనా! చివరి పందెంనాది. నాపావులన్నీ మధ్య గడిలోకొచ్చాయి. నేను గెలిచాను" అంది అమ్మవారు. నీచేతిలో ఓటమి కంటే నీబిడ్డకు కావాల్సింది ఏముందన్న శంకరాచార్యులు ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మా! సంఖ్యాశాస్త్రపరంగా, అక్షరసంఖ్యాశాస్త్ర పరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపునాది" అన్నారు. "నవావరణలతో కూడిన శ్రీచక్రరూపం. శ్రీ చక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామసశక్తి మాయమైంది. శ్రీచక్రం నీదేహమైతే, సహస్ర నామావళి నీ నామం. నీ అపారకరుణతో, ఈ రాత్రంతా నాతపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్రరాజాన్ని నీవు తిరస్కరిస్తావా! నీవు చేసిన ఈ సృష్టినీ, నీఉనికిని, నీవేఅర్ధరహితమని నిరూపిస్తావా! అలాచేస్తే ఆస్తికత ఉండక, నాస్తికత ప్రబలి, సర్వసృష్టి నాశనం అవుతుందని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు. అప్పటి వరకూ పాచికలు ఆడేందుకు గీసిన గడులు శ్రీచక్రం అని కానీ తనను అందులో ప్రతిష్టించాడు ( బంధించాడు) అని కానీ అమ్మవారు గుర్తించలేదు.
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
అప్పుడు కళ్లు తెరిచిన పరమశివుడు... దేవీ! నీఅహాన్ని, నీ తామసస్వభావాన్ని అదుపుచేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యముగా బలైపోయారు. ఈప్రాణి కోటిని రక్షించేదెవరు? నీ తామసశక్తినెవరూ జయించలేరు. నేను ప్రయత్నంచేస్తే నాఅర్ధశరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేనూ సాక్షీ భూతాలుగా ఉండిపోయాము. నీ తామసశక్తిని అదుపుచేయగల యంత్రాన్ని, మంత్ర పూతంగా సిద్ధముచేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. ఏ మలినం అంటని బాల్యంలోనే సన్యసించి, సర్వదేవతా సాక్షాత్కారంపొంది, మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగల్గాలి. అందుకే ఆ సమయంకోసం వేచిఉన్నాను. ఇతడు నాఅంశంతో జన్మించిన అపర బాల శంకరుడు. నిరాడంబముగా సాగించిన అతని పర్యటనయొక్కఉద్దేశం అతని హృదయానికి, పరమశివుడనైననాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు. అప్పుడు అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటుచేసుకుంది. ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చరోయాడు. శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీపరమేశ్వరులను స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు. అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకరుల శ్రీచక్రప్రతిష్ఠతో మీఇంటి ఆడపడుచైన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగామారదని పాండ్యరాజుకి అభయం ఇచ్చాడు. అందుకే శ్రీచక్రాన్ని దర్శించినా, స్పర్శించినా, న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హతున్నవారికి సర్వకోరికలు నెరవేరుతాయంటారు. ఆదిశంకరులు చిత్రించి, ప్రాణప్రతిష్ఠచేసిన శ్రీచక్రం మధురమీనాక్షి ఆలయంలో భూమిలోకి వెళ్లి ప్రతిష్ఠితమైపోయింది. అందుకే ఆ ప్రాంగణంలో మోకరిల్లినా ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందంటారు భక్తులు.
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: 008 రకాల కూరగాయలు ఉన్నాయా... ఇప్పటి వరకూ తిన్నారా ఎవరైనా...!
Also Read: సంపాదన పెరగాలన్నా, వచ్చింది నిలవాలన్నా ఇలా చేస్తే మంచిదట...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి