Vastu Tips In Telugu: ఇంట్లో ట్యాపులు లీకవుతూనే ఉన్నాయా - అయితే ఈ సమస్యలు తప్పవు!
ఇంట్లో ఉండే ట్యాపులు, పైపులు లీకవుతూనే ఉన్నాయా..అది కూడా వాస్తు దోషమే అనే విషయం మీకు తెలుసా. ఇంకా నీటికి సంబంధించిన విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు వాస్తునిపుణులు..
Vastu Tips In Telugu: ఇల్లంతా వాస్తు ప్రకారమే నిర్మించాం అనుకుంటారు కానీ ఇంటి లోపల చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోరు. అది చిన్న పనే అయినప్పటికీ దానివల్ల జరిగే నష్టం అధికంగా ఉంటుందంటారు వాస్తునిపుణులు. ఓ సమస్య తీరగానే మరో సమస్య వెంటాడుతుంది, సంపాదించిన సొమ్ము చేతిలో నిలవదు, చీటికి మాటికి గొడవలు జరుగుతూనే ఉంటాయి, ప్రశాంతత అనే మాటకి చోటే ఉండదు. దీనికి కారణం ఇంట్లో చిన్న చిన్న వాస్తు నియమాలు పాటించకపోవడమే అంటారు వాస్తు నిపుణులు. అవేంటంటే...
ట్యాపులు లీకవుతున్నాయా!
ఇంట్లోకి కొత్తగా వచ్చినప్పుడు అన్నీ సరిగ్గానే ఉంటాయి కానీ వాడగా వాడగా ట్యాపులు, పంపులు లీకవుతూ ఉంటాయి. పైగా మార్కెట్లో కొన్ని నాసిరకం ట్యాపులు వినియోగించడం వల్ల కూడా ఈ సమస్య ఉంటుంది. అప్పటికప్పుడు ఏదో సరిచేసి వదిలేస్తారు. అయినప్పటికీ చుక్క చుక్క పడుతూనే ఉంటుంది. ఇదే పెద్ద వాస్తు దోషం అంటారు వాస్తునిపుణులు. ఇంట్లో ఉన్న ట్యాపులు, పంపులు లీకవుతూ ఉంటే ఎంత సంపాదించినా చేతిలో నిలవదని చెబుతారు. అందుకే లీకయ్యే ట్యాపులను వెంటనే మార్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
Also Read: వాస్తు ప్రకారం ఇంట్లో ఏ దిశకు ఏ రంగులు వేస్తే మంచిది!
నీరు నింపి పెట్టే పాత్రలు ఏ దిశగా ఉండాలి
ఇంట్లో నీరు నింపి పెట్టే పాత్రలు ఎప్పుడూ ఉత్తర దిశలో ఉంచాలని సూచిస్తున్నారు. కుబేరుడు అధిపతి అయిన ఈ దిశలో లీక్ అవని నీటిపాత్రలు పెడితే సంపద వృద్ధి చెందుతుందని చెబుతారు. ఇంట్లో సౌకర్యం, అవకాశం చూసుకుని తమకు వీలైనవైపు నీటిపాత్రలు ఉంచుతారు. అయితే ఉత్తరం, తూర్పు దిశల్లో పర్వాలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం లేదా పడమర దిశలో ఉంచకూడదు. ఇలా చేస్తే మానసిక ఒత్తిడి రోజురోజుకు పెరుగుతుంది.
Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!
నీటివాలు ఏ దిశగా ఉంటే ఏమవుతుంది
ఇంట్లో వాలు ఏ దిశగా ఉందో గమనించారా ఎప్పుడైనా... ఇంట్లో పొరపాటున నీళ్లు ఒలికితే ఏదో ఒక మూలకు వెళ్లి చేరుతాయి. అది ఏ మూలో గమనించండి. నీటివాలు తూర్పు దిశగా ఉంటే ఈ ఇంట్లో సంపద వృద్ధి చెందుతుంది. అలాంటి ఇంట్లో ఉండేవారి భవిష్యత్ బావుంటుంది. జీవితంలో వచ్చే సమస్యలను, అవరోధాలను సులభంగా పరిష్కరించుకుంటారు. ఉత్తరదిశలో నీరు ప్రవాహం ఉంటే ఆ ఇల్లు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది, ఆర్థిక సమస్య అస్సలుండవు. పశ్చిమ దిశలో పల్లం ఉంటే వాస్తుశాస్త్రం ప్రకారం అది అశుభంగా పరిగణిస్తారు. అది ఇంటి సభ్యులపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.ఆర్థికంగా చాలా నష్టపోతారు, ఇంట్లో చీటికి మాటికి తగాదాలు జరుగుతాయి. దక్షిణ దిశవైపు ప్రవహిస్తే ఈ ఇంట్లో ఉండేవారికి అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. అంతేకాకుండా కొన్ని అవాంఛనీయం సంఘటనలు జరిగే అవకాశముంది. సరిగ్గా ఈశాన్యంవైపు పల్లం ఉంటే కుటుంబ సభ్యులకు అదృష్టం కలిసొస్తుంది.గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ ఇంట్లో ఉండేవారంతా ప్రశాంతంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వాలు నైరుతి దిశలో ఉంటే ఆ ఇంట్లో నివసించే వారు తరచూ అనారోగ్యానికి గురవుతారు. శత్రుభయం ఎదుర్కొంటారు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.