Tirumala News: తిరుమలలో ఉన్న నంబి ఆలయం గురించి మీకు తెలుసా- ఆకాశగంగతో ఆయనకి ఏం సంబంధం?
Tirumala News: తిరుమల ఆలయ దక్షిణ మాడ వీధిలో ఒక ఆలయం మనకు కనిపిస్తుంది. మాడవీధిలో ఉన్న ఆ ఆలయం తిరుమలనంబి ఆలయం. అసలు ఆ తిరుమల నంబి ఎవరు.. వారి కథేంటో తెలుసుకుందాం.
Tirumala News: తిరుమల శ్రీవారికి ఎంతో మంది సేవ చేసి పుణీతులయ్యారు. శ్రీనివాసుడి చరణాలే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇలాంటి ఎందరో మహానుభావులకి అగ్రగణ్యుడు ఎవరో తెలుసా ఆయనే...తిరుమలనంబి. శ్రీవారి భక్తాగ్రేసరులలో ఒకరైన శ్రీ తిరుమలనంబి శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈయన భగవద్రామానుజుల వారికి స్వయాన మేనమామ, గురుతుల్యులుగా కీర్తి పొందారు. వీరు రామానుజుల వారికి రామాయణ పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది.
ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనంబికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. తిరుమలనంబి శ్రీవేంకటేశ్వరస్వామివారి అభిషేకానికి కావాల్సిన పవిత్రజలాలను తిరుమల ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపవినాశనం తీర్థం నుంచి ప్రతిరోజు తీసుకొచ్చేవారంటా. ఒకరోజు ఆయన పాపవినాశనం నుంచి నీటిని కుండలో తీసుకొస్తుండగా సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామివారు తిరుమలనంబి భక్తిని పరీక్షించాలని భావించారు. ఒక వేటగాని రూపంలో వచ్చి దాహంగా ఉందని, తాగడానికి నీళ్లు కావాలని కోరారు. ఈ పవిత్రజలాలు స్వామివారి ఆభిషేకం కోసమని చెప్పి ఇచ్చేందుకు తిరుమలనంబి తిరస్కరించారు. అంతట వేటగాని రూపంలో ఉన్న స్వామివారు రాయి విసిరి కుండకు చిల్లుచేసి నీరు తాగారు. అందుకు తిరుమలనంబి బాధపడుతూ వయోభారం కారణంగా నేను తిరిగి అంతదూరం పాపవినాశనం వెళ్లి స్వామివారికి అభిషేకజలం తీసుకురావడం సాధ్యంకాదు. ఈ రోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నా అని దు:ఖించారంట.
అంతలో వేటగాని రూపంలో ఉన్న స్వామివారు చింతించకు తాతా నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తానని తెలిపి తన చేతిలోని విల్లును ఆకాశంలోనికి ఎక్కుపెట్టి బాణం వదిలారు. వెంటనే వినీలాకాశం నుంచి ఉరుకుతూ నీటిధార భూమికి వచ్చింది. ఇకపై ఈ జలాన్నే నా అభిషేకానికి వినియోగించు అని ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామివారు అదృశ్యమయ్యారంట. అప్పుడు తిరుమలనంబి సాక్షాత్తు స్వామివారే బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రహించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ తీర్థాన్నే స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నారు. ఆకాశం నుంచి వచ్చినందువల్ల ఈ తీర్థానికి ఆకాశగంగ అని నామధేయం ఏర్పడిందని పురాణాల ద్వారా తెలుస్తోంది.
తిరుమల నంబి ఆలయం
తిరుమల నంబి క్రీ. శ 973 లో తమిళ శ్రీముఖ సంవత్సరం పురటాసి మాసం అనూరాధ నక్షత్రంలో జన్మించారు. ఆయనకు శ్రీవారి కి ఎంతో అనుబంధం ఉండేది. వేంకటేశ్వర స్వామి వారు తాత అని పిలిచే వారంట. నేటికి తాతాచార్యులు వంశీయుల తిరుమలలో ఉన్నారు. అంత ప్రాశస్త్యం కలిగిన ఆయనకు దక్షిణ మాఢ వీధి లో ఆలయం ఉంది. ప్రస్తుతం సుపథం... దర్శనం కోసం వచ్చే భక్తులకు ఉన్న బ్రిడ్జ్ పక్కనే ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది. తిరుమల శ్రీవారు ఎప్పుడు బయటకు వచ్చినా ఇక్కడ హారతి స్వీకరిస్తారు. అదేవిధంగా ఉత్సవాల్లో వేదపారాయణం, దివ్య ప్రబంధను ఈ ఆలయానికి పక్కనే ప్రారంభిస్తారు.
నేడు శ్రీ తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవాలు
ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవం సెప్టెంబరు 9వ తేదీ సోమవారం తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఉదయం 9.30 గంటల నుంచి 16 మంది ప్రముఖ పండితులు శ్రీ తిరుమలనంబి జీవిత చరిత్రపై ఉపన్యసించనున్నారు.
Also Read: దశభుజ శ్రీ మహాగణపతి- ఒక్క ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎక్కడో కాదండోయ్